బిడ్డా.. నేనొచ్చా లేరా

Triple IT student suicide in Krishna district - Sakshi

తనయుడి మృతదేహంపై పడి ఏడ్చిన తండ్రి

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ఫోన్ లో తండ్రి మాట విన్నాక బలవన్మరణం

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

‘బిడ్డా.. నేనొచ్చా లేరా.. ఇప్పుడే కదా నాయనా నాతో మాట్లాడావు. అప్పుడే ఏందిరా ఇది..’ అంటూ ఆ తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఏం కష్టం వచ్చిందో తండ్రి రాకకోసం ఆశగా ఎదురుచూసి.. ఫోన్ లో ‘వచ్చావా నాన్న..’ అంటూనే భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హఠాత్పరిణామానికి అప్పటివరకు కొడుకు కోసం ఆశగా చూసిన తండ్రి నిశ్చేష్టుడైపోయాడు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం.గోపీచంద్‌ నాయక్‌ గురువారం ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది.

పొక్కునూరు (చందర్లపాడు): నాన్న రాక కోసం ఆర్తిగా ఎదురుచూశాడు. చివరిగా నాన్నతోనే మాట్లాడాలనుకున్నాడు. మాట్లాడుతూనే మాయమైపోయాడు. భవనం పైనుంచి దూకేశాడు. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి‘పోయాడు.’ తోటివారితో స్నేహపూర్వకంగా ఉంటూ.. మృదుస్వభావంతో మెలిగే నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం (సివిల్‌ బ్రాంచి) విద్యార్థి మెగావతు గోపీచంద్‌నాయక్‌ (20) గురువారం ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించాడు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి్సన సమయంలో మరణశాసనం రాసుకున్నాడు. కళాశాలకు వచ్చిన కన్నతండ్రిని కడసారి చూడకుండానే మృత్యుకౌగిలికి చేరుకున్నాడు.

చదువులో టాప్‌
గోపీచంద్‌ హాస్టల్‌ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్చనీ యాంశమైంది. 2012–13లో చందర్లపాడు జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివిన గోపీచంద్‌ 9.3 పాయింట్లు సాధించాడు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు రావడంతో అప్పటి నుంచి అక్కడే చదువుకుంటున్నాడు. రెండు రోజులుగా గోపీచంద్‌ తల్లిదండ్రులకు, అక్కకు ఫోన్ చేసి గతానికి భిన్నంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో రూమ్‌మెట్‌ కూడా బుధవారం రాత్రి తండ్రి దేవిజనాయక్‌కు ఫోన్ చేసి గోపీచంద్‌ రెండు రోజులుగా సరిగ్గా ఉండట్లేదని, ఒకసారి వచ్చి వెళ్లమని చెప్పాడు. గురువారం మధ్యాహ్నం కళాశాల గేటు వద్దకు వెళ్లి కుమారుడికి ఫోన్ చేశాడు. ‘వచ్చావా నాన్న..’ అని ఫోన్ లో పలికిన బిడ్డ, ఆ తరువాత ఎంతసేపటికి తన వద్దకు రాకపోవడంతో ఆందోళన చెందాడు. అయితే, అప్పటికే హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఎవరో ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త వచ్చింది. దీంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి వెళ్లి కొడుకు గోపీ మృతదేహాన్ని చూసిన ఆ తండ్రి నిశ్చేషు్టడైపోయాడు. హుటాహుటిన గోపీచంద్‌ను నూజివీడులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
గోపీచంద్‌ మరణవార్త విని తల్లి దేవి, సోదరి లాకీ బోరున విలపిస్తుండటం చూపరులను కంటతడి పెట్టించింది. కూలీనాలి చేసుకుంటూ, రిక్షా తోలుతూ, కౌలుకు పొలం సాగు చేసుకుంటూ జీవిస్తున్న డేవీజానాయక్‌ దంపతులు రోదించిన తీరు కుమారుడిపై వారి ప్రేమను తెలియజేసింది.

ఒత్తిడే కారణమా?
గోపీచంద్‌ పీయూసీ (ఇంటర్‌)లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినా త్వరగానే వాటిని పూర్తిచేశాడు. మంచిస్థాయికి చేరుకోవాలి, తోటివారితో స్నేహంగా ఉండాలనే ఆలోచనలో ఉండే గోపీచంద్‌కు షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే అలవాటు ఉంది. అయినా.. మృతికి గల కారణాలు తెలియలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top