ట్రెండ్స్ స్థలానికి ఎసరు | Trends participates in place | Sakshi
Sakshi News home page

ట్రెండ్స్ స్థలానికి ఎసరు

Dec 20 2013 4:27 AM | Updated on Sep 2 2017 1:46 AM

తిరుపతిలోని మంగళంలో ట్రెండ్‌కు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (ఏపీబీసీఎల్) కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చిత్తూరు (జిల్లా పరిషత్), న్యూస్‌లైన్: తిరుపతిలోని మంగళంలో ట్రెండ్‌కు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (ఏపీబీసీఎల్) కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం ఏపీబీసీఎల్, ట్రెండ్స్ మేనేజర్ జిల్లా కలెక్టర్‌ను కలిసి చర్చించారు. ప్రస్తుతం తిరుపతిలోని మంగళం గ్రామంలో ట్రెండ్స్‌కు 7 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ కోసం కొన్ని భవనాలు నిర్మించారు. ఇంకా కొంత స్థలం ఖాళీగా ఉంది. దాన్ని తమకు కేటాయించాలంటూ ఏపీబీసీఎల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
 
1981లో చేతివృత్తులను ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణ ఇవ్వడం, వస్తువులు తయారు చేసి వాటి అమ్మకం ద్వారా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 20 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతికి దగ్గరగా మంగళంలో ట్రెండ్స్ ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి యువతకు బుక్ బైండింగ్, ఉడ్ వర్క్స్ ద్వారా బెంచీలు, టేబుళ్లు, కప్‌బోర్డు తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉత్పత్తులను మార్కెట్ చేసేవారు. 1991లో టీటీడీకి 13 ఎకరాలు ఇచ్చారు.

కాలక్రమంలో చేతివృత్తులపై మోజుతగ్గడం, ఇక్కడ పనిచేస్తూ నైపుణ్యం కలిగిన సిబ్బంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని బయటకు వెళ్లిపోవడంతో శిక్షణ  కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు. అనంతరం అక్కడున్న సిబ్బందే వర్క్ ఆర్డర్లు తీసుకువచ్చి వాటి ద్వారా వచ్చే లాభాన్ని జీతాలుగా తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్స్‌లో 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ట్రెండ్స్ మూసివేయడం మినహా చేయగలిగిందేమీ లేదంటూ సెట్విన్ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ స్థలాన్ని ఏపీబీసీఎల్ తమకు కేటాయించాలని, దానిలో లిక్కర్ స్టాకు గోడౌన్ నిర్మించుకుంటామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ప్రస్తుతమున్న భవనాలు స్థలాన్ని ఏపీబీసీఎల్‌కు కేటాయించడం వల్ల ఆదాయం వస్తుందనే భావనలో ఉన్నట్లు సమాచారం.

దీనికి అనుగుణంగానే గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ట్రెండ్స్, సెట్విన్. ఏపీబీసీఎల్  అధికారుల సమావేశంలో ఏపీబీసీఎల్‌కు ఇస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ స్థలాన్ని పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాంగోపాల్ తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement