‘పచ్చ’ సేనలో ఖాకీ చొక్కా

Traffic ACP Prabhakar In TDP Program At Visakhapatnam - Sakshi

తెలుగుదేశం కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌

మంత్రి అచ్చెన్నగారి అనుంగు సోదరుడే ఈయనగారు

అందుకే రూల్స్‌కు విరుద్ధంగా పచ్చ పార్టీపై భక్తిప్రపత్తులు

అధికార బలంతో ఏళ్ల తరబడి విశాఖ ప్రాంతంలోనే తిష్ట

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ఒక్కసారి ఈ ఫొటో పరికించి చూడండి. చుట్టూ పచ్చ చొక్కాలు.. నడిమధ్యలో ఓ ఖాకీ చొక్కా కనిపిస్తోంది కదూ.. సదరు ఖాకీ దొర విశాఖ నగర ట్రాఫిక్‌ ఏసీపీ కింజరాపు ప్రభాకర్‌.. అంతే కాదండోయ్‌.. ఈయనగారు కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు స్వయానా సోదరుడు. 
అయితే ఏంటి.. మంత్రులు, రాజకీయ నేతల కుటుంబీకులు ఉద్యోగాలు చేయకూడదా? అని అంటారేమో!.. 

ఎందుకు చేయకూడదూ.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తన ఉద్యోగ ధర్మానికి, రాజకీయాలను కలగలిపేయకూడదన్నదే ఇక్కడ ప్రస్తావనాంశం.. 

ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం.. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్‌ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌కు పూర్తి విరుద్ధమన్నదే ఇక్కడ చర్చనీయాంశం. విమర్శలకు తావిస్తున్న అంశం కూడా..

 ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా ఫక్తు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది.

ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా విశాఖ నగరంలోనే ఏసీపీ ప్రభాకర్‌ తిష్ట వేశారు. అంతేకాదు.. మధ్యలో ఒకట్రెండేళ్లు తప్ప గత పాతికేళ్లుగా పెద్దగా బదిలీలు లేకుండా ఈ ప్రాంతంలోనే పాతుకుపోయారు. సర్వీస్‌లో ఎలాంటి ఘనకార్యాలు లేకుండానే ఈయనకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ ఇచ్చిన సందర్భంలోనూ అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రభుత్వాధికారి అయి ఉండీ.. పచ్చచొక్కా కార్యక్రమాలకు చెందిన పోస్టర్లను ఆవిష్కరించడమేంటని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన సదరు పోలీస్‌ అధికారి.. అ«ధికార టీడీపీకి ఎంతటి వీరవిధేయత చూపుతున్నారో ఈ ఫొటోతోనే స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఇలా చెయ్యడమేంటని విమర్శలు జోరందుకుంటున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top