నేడు కర్నూలులో నిమజ్జనం | today,immersion program in kurnool | Sakshi
Sakshi News home page

నేడు కర్నూలులో నిమజ్జనం

Sep 17 2013 3:35 AM | Updated on Sep 1 2017 10:46 PM

నగరంలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.


 కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: నగరంలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం స్థానిక రాంబొట్ల దేవాలయం నుంచి ఉదయం 9 గంటలకు నిమజ్జన ఊరేగింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక వినాయక్‌ఘాట్ వద్ద నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఘాట్‌కు ఇరువైపులా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర సమితి సభ్యులు తెలిపారు. ఇందుకోసం సత్యనారాయణస్వామి దేవాలయం వైపు మూడు క్రేన్లు, మందిరం వైపు మరో క్రేన్ ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఐదు స్థలాల్లో చేతుల మీదుగా నిమజ్జనం చేసే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
  సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగనున్న నిమజ్జన ఉత్సవాన్ని ప్రజలు వీక్షించేందుకు అనువుగా 100 ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఘాట్ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు ఉత్సవంలో పాల్గొననున్నారు. ఉత్తరాఖండ్ వరద మృతులు, వీర జవాన్లకు ఈ నిమజ్జన ఉత్సవాలు అంకితం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా 100 మంది గజ ఈతగాళ్లను ఘాట్ వద్ద నియమించారు. మత్స్య శాఖ అధికారులు కొందరు ఈతగాళ్లను లైవ్ జాకెట్లతో మోహరిస్తున్నారు. పొరపాటున ప్రమాదం జరిగితే అరిగిళ్ల ద్వారా రక్షించేందుకు రోప్‌ను సిద్ధం చేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు, పురుషులకు మరోవైపు ఏర్పాట్లు చేపట్టారు.
 
 పోలీసులతో ఘర్షణ వద్దు: కపిలేశ్వరయ్య, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు
 ఊరేగింపులో భక్తులు, నిర్వాహకులు పోలీసులతో ఘర్షణ పడవద్దని గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కార్యధ్యక్షులు కపిలేశ్వరయ్య సోమవారం రాత్రి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తెలిపారు. ఏదైనా సమస్య వస్తే కేంద్ర సమితి దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ ఏడాది 1200 విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నట్లు వెల్లడించారు. అందువల్ల నగరంలోని ఆయా గణేష్ కమిటీలు సమయపాలన పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ర్యాలీల్లో మహిళలను కించపరిచే వేషధారణలు వద్దని.. ఊరేగింపులో పెయింట్, బాణాసంచా వినియోగించవద్దన్నారు. చిన్న పిల్లల జేబులో చిరునామా, సెల్ నెంబర్‌తో కూడిన పేపర్ విధిగా ఉంచాలన్నారు. మహిళలు విలువైన ఆభరణాలు ధరించవద్దని సూచించారు. ఊరేగింపును వీడియో తీస్తున్నందున ఆకతాయి చేష్టలు చేస్తే పోలీసు చర్యలు తప్పవన్నారు. ప్రార్థన, మసీదులను గౌరవించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement