ఎస్వీవీ నర్సింగ్‌ కాలేజీలో నరకం.. నిజమే!

Tirupati Sub-Collector Visit SVC Nursing College - Sakshi

తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..

సాక్షి, తిరుపతి రూరల్‌: ‘ఒకే భవనంలో రెండు కళాశాలలు. తరగతి గదులు..హాస్టల్‌ గదులకు సైతం అదే భవనం.. నాలుగేళ్ల కోర్సును బోధించేందుకు కేవలం ఇద్దరే అధ్యాపకులు. నర్సింగ్‌ బోధన దేవుడెరుగు.. వంటపని, ఇంటి పని, సొంత పనులతో సహా పొలం పనులను సైతం బలవంతంగా చేయిస్తూ యాజమాన్యం నరకం చూపుతోంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కరుణించలేదు సరికదా, మా కష్టాలను యాజమాన్యానికి అమ్ముకుని కాసులు దండుకున్నారు. ఈ నరకం నుంచి మమ్మల్ని కాపాడండి’ అంటూ శ్రీ వెంకట విజయ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు తిరుపతి సబ్‌–కలెక్టర్‌ ఎదుట కన్నీరుమున్నీరు అయ్యారు.

తిరుపతికి సమీపంలోని శ్రీవెంకట విజయ నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థినులపై జరుగుతున్న వేధింపులపై విచారణ జరిపేందుకు మంగళవారం తిరుపతి సబ్‌–కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ కళాశాలకు వెళ్లారు. కళాశాలను మూసివేస్తున్నట్లు తగిలించిన బోర్డును చూసి ఆశ్చర్యపోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసివేస్తున్నట్లు యాజమాన్యం అందులో పేర్కొంది.  శ్రీ వెంకట విజయ కళాశాలను మూసివేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్‌ కళాశాల లెటర్‌ ప్యాడ్‌పై కరస్పాండెంట్‌ బండి. విజయ పేరుతో ప్రకటన విడుదలైంది.

సబ్‌–కలెక్టర్‌ ఎదుట విద్యార్థినుల కన్నీరు
ప్రభుత్వం ఆదేశంతో శ్రీ వెంకట విజయ నర్సింగ్‌ కళాశాలలో తిరుపతి సబ్‌–కలెక్టర్‌ మహేష్‌కుమార్, జిల్లా డాక్టర్‌ రామగిడ్డయ్య, డీసీహెచ్‌వో సరళమ్మ, డీఐవో హనుమంతరావు, విచారణ కమిటీ సభ్యులు గీత, లలితాదేవి విచారణ చేశారు. కళాశాల యాజమాన్యం గేటు మూసివేయడంతో బయట ఉన్న విద్యార్థినులతో మాట్లాడారు. దీంతో కళాశాలలో ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను వివరించారు. తమను విద్యార్థినులుగా కాకుండా కూలీలుగా చూస్తారని, వంట పని, పెరటి పని, గదుల శుభ్రత నుంచి వారి ఇంట్లో పాచిపని సైతం చేయిస్తారని కాయలు కాసిన చేతులను చూపించారు. కళాశాల నిర్వాహకురాలు విజయకు చెందిన వ్యవసాయక్షేత్రంలో పొలం పనులు చేయాలని, లేకుంటే దారుణంగా శారీరక హింసలకు గురి చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. నాలుగేళ్ల కోర్సులకు కేవలం ఇద్దరు మాత్రమే అధ్యాపకులు ఉన్నారని, కనీస పరిజ్ఞానం కూడా లేకుండా బోధన చేస్తారని వాపోయారు. క్లినికల్‌ పరిజ్ఞానం లేకుండానే ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై స్టాఫ్‌ నర్సులుగా బలవంతంగా ఉద్యోగాలు చేయిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

అంతా లోపభూయిష్టం: సబ్‌ కలెక్టర్‌
ఒకే భవనంలో రెండు నర్సింగ్‌ కళాశాలలను నిర్వహించడమే కాకుండా నిపుణులైన అధ్యాపకులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నట్లు, క్లినికల్‌ అనుభవం లేకుండానే కోర్సులను తూతూమంత్రంగా పూర్తి చేయిస్తున్నట్లు వెల్లడైందని తిరుపతి సబ్‌–కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. తమపై కళాశాల యాజమాన్యం వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు చెప్పినట్లు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు
ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి విముక్తి కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం స్పందించకుంటే మాపై ఇంకా వేధింపులు కొనసాగుతునే ఉండేవన్నారు. ఇప్పటికైనా మరో కళాశాలలో విద్యను కొనసాగించేందుకు తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top