ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన ఉంటేనే రాజకీయ జీవితం ఉంటుందని లేదంటే అధోగతి తప్పదని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్‌సీ ఎంవీఎస్ శర్మ అన్నారు.
భోగాపురం: ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన ఉంటేనే రాజకీయ జీవితం ఉంటుందని లేదంటే అధోగతి తప్పదని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్‌సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. మండలంలోని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా ఎ.రావివలస పంచాయతీ దల్లిపేట గ్రామం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పదవిలో ఉన్న ఎంఎల్‌ఏ పతివాడ, మంత్రి మృణాళిని తదితరులు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే పదవుల్లో ఉన్నారన్న విషయం మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రజల భిక్షతో పదవులు అలకంరించి ఇప్పుడు ప్రజల భూములను, గ్రామాలను తీసుకుని వారిని అధోగతి పాలు చేస్తే వారికి రాజకీయ జీవితం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా వారి ఉద్యమంలో ఎంఎల్‌ఏ బాగస్వాములు కావాల్సి ఉందని సూచించారు. తన నియోజకవర్గ ప్రజల ఇబ్బందిని సీఎం దృష్టికి ఎంఎల్‌ఏ తీసుకువెళ్లలేకపోవడం శోచనీయమన్నారు. ఎయిర్‌పోర్టు పేరుతో అభివృద్ది చేస్తామనడం సరైంది కాదన్నారు. ఇక్కడ ఏ ఏయిర్‌పోర్టూ రాదు. భూములను తీసుకుని దళారి వ్యాపారం చేసేందుకు చంద్రబాబు అతని వెనుక ఉన్న విద్యా, వైద్య వ్యాపారవేత్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు అంశంపై ప్రజలు తెలుపుతున్న నిరసనలను, వారి ఇబ్బందులను వానాకాలం శాసన మండలి సమావేశంలో చర్చించేందుకు ముందుగా గ్రామంలో పర్యటించాలని ప్రొగ్రెసివ్ డెమోక్రసీ ఫ్రంట్ ఎంఎల్‌సి బృందం తనను పంపించిందని చెప్పారు.
ఆ విషయమై తాను బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ... మండలంలో ఎయిర్‌పోర్టు బాధితుల ఆవేదనను శాసనమండలిలో మాట్లాడేందుకు వచ్చిన ఎంఎల్‌సీ శర్మను అభినందించారు. సమావేశంలో ఎ.రావివలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి, కవు ల వాడ సర్పంచ్ భర్త దాట్ల శ్రీనివాసరాజు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.సూర్యనారాయణ, జగన్మోహన్, దల్లిపేట మాజీ సర్పంచ్ దల్లి శ్రీనివాస్, కోరాడ అప్పన్న, ఎ. రావివలస ఉపసర్పంచ్ నడుపూరు సత్యనారాయణ నాయుడు పాల్గొన్నారు.