breaking news
mlc mvs sharma
-
అధికార దుర్వినియోగంతోనే గెలుపు
► గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లే పీడీఎఫ్ సాధించింది ► ఇది ప్రజాసంఘాల నైతిక విజయం ► ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ సీతమ్మధార (విశాఖ ఉత్తర) : బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగంతోనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోగలిగాయని ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ అన్నారు. ఓటర్ల నమోదుతో మొదలైన ఆ పర్వం ఎన్నికల నిబంధనలను బేఖాతర్ చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వరకు కొనసాగిందన్నారు. ఎంఎంటీసీ కాలనీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఓటర్లను ఒత్తిడికి, ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ఆ తీర్పే నిదర్శనం రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఐదింటిలో బీజేపీ, టీడీపీ నాలుగు స్థానాల్లో ఓటమి పాలయ్యాయన్నారు. రాష్ట్రప్రభుత్వ పనితీరుకు ఈ తీర్పే నిదర్శనమని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ తన ప్రచారంలో ముందుకు తెచ్చారన్నారు. దీనికి విరుద్ధంగా బీజేపీ అభ్యర్థి తరఫు ప్రచారం చేసినవారు మేం అధికారంలో ఉన్నాం, కాబట్టి మేమే గెలవాలన్న ధోరణితో వ్యవహరించారన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు సమాధానం చెప్పకపోవడం అన్యాయమన్నారు. అజశర్మకు గత రెండు ఎన్నికల కన్నా అధికశాతం ఓట్లు రావడంతో నైతికంగా ప్రజాసంఘాల విజయంగా పేర్కొన్నారు. ఓటర్ల తీర్పును గౌరవించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ కృషిని కొనసాగిస్తామన్నారు. పెద్దల సభ ఎన్నికలు హుందాగా జరగాలి: అజశర్మ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, శాసనమండలి పి.డి.ఎఫ్.అభ్యర్థి అజశర్మ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఓట్లు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ అధికార దుర్వినియోగంతో, డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. హుందాగా ఉండవలసిన పెద్దల సభకు ప్రతినిధిగా ఎన్నిక కావడానికి కుల సంఘాల మీటింగ్‌లు ఏర్పరచడం, అధికార పదవులలో ఉన్న కుల కార్పొరేషన్ల నేతలను ప్రతక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దింపడం దిగజారుడు పద్ధతులకు పాల్పడ్డారని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమ బలం 38 వేలకు పెరిగిందన్నారు. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి కొనసాగిస్తామన్నారు. ఈ ఎన్నికలలో తమకు మద్ధతు ఇచ్చిన వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలకు కృతజ్ణతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో 11 వేల ఓట్లు చెల్లని వైనంపై ప్రశ్నించగా, గత ఎన్నికల్లో 6 వేల ఓట్లు చెల్లలేదన్నారు. కాగా 80 శాతం మంది ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను వినియోగించలేదని చెప్పారు. -
ప్రజాపక్షాన ఉంటేనే రాజకీయ జీవితం
భోగాపురం: ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన ఉంటేనే రాజకీయ జీవితం ఉంటుందని లేదంటే అధోగతి తప్పదని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. మండలంలోని ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా ఎ.రావివలస పంచాయతీ దల్లిపేట గ్రామం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పదవిలో ఉన్న ఎంఎల్ఏ పతివాడ, మంత్రి మృణాళిని తదితరులు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే పదవుల్లో ఉన్నారన్న విషయం మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రజల భిక్షతో పదవులు అలకంరించి ఇప్పుడు ప్రజల భూములను, గ్రామాలను తీసుకుని వారిని అధోగతి పాలు చేస్తే వారికి రాజకీయ జీవితం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా వారి ఉద్యమంలో ఎంఎల్ఏ బాగస్వాములు కావాల్సి ఉందని సూచించారు. తన నియోజకవర్గ ప్రజల ఇబ్బందిని సీఎం దృష్టికి ఎంఎల్ఏ తీసుకువెళ్లలేకపోవడం శోచనీయమన్నారు. ఎయిర్‌పోర్టు పేరుతో అభివృద్ది చేస్తామనడం సరైంది కాదన్నారు. ఇక్కడ ఏ ఏయిర్పోర్టూ రాదు. భూములను తీసుకుని దళారి వ్యాపారం చేసేందుకు చంద్రబాబు అతని వెనుక ఉన్న విద్యా, వైద్య వ్యాపారవేత్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు అంశంపై ప్రజలు తెలుపుతున్న నిరసనలను, వారి ఇబ్బందులను వానాకాలం శాసన మండలి సమావేశంలో చర్చించేందుకు ముందుగా గ్రామంలో పర్యటించాలని ప్రొగ్రెసివ్ డెమోక్రసీ ఫ్రంట్ ఎంఎల్‌సి బృందం తనను పంపించిందని చెప్పారు. ఆ విషయమై తాను బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ... మండలంలో ఎయిర్‌పోర్టు బాధితుల ఆవేదనను శాసనమండలిలో మాట్లాడేందుకు వచ్చిన ఎంఎల్సీ శర్మను అభినందించారు. సమావేశంలో ఎ.రావివలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి, కవు ల వాడ సర్పంచ్ భర్త దాట్ల శ్రీనివాసరాజు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.సూర్యనారాయణ, జగన్మోహన్, దల్లిపేట మాజీ సర్పంచ్ దల్లి శ్రీనివాస్, కోరాడ అప్పన్న, ఎ. రావివలస ఉపసర్పంచ్ నడుపూరు సత్యనారాయణ నాయుడు పాల్గొన్నారు.