చైన్‌స్నాచర్ల చేతివాటం | theft of 14 chain within a week | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచర్ల చేతివాటం

Aug 3 2015 12:49 AM | Updated on Sep 17 2018 6:20 PM

చైన్‌స్నాచర్ల చేతివాటం - Sakshi

చైన్‌స్నాచర్ల చేతివాటం

చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగరంలో వారం రోజుల్లో 14 గొలుసు చోరీలు చేసి ఏడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో మహిళల ...

వారం రోజుల్లో 14 గొలుసు చోరీలు
తెగబడుతున్న స్నాచర్లు
బెంబేలెత్తుతున్న మహిళలు
జల్లెడ పడుతున్న పోలీసులు

 
చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగరంలో వారం రోజుల్లో 14 గొలుసు చోరీలు చేసి ఏడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో మహిళల మెడల్లోని అరకిలో బంగారం కాజేశారు. హఠాత్తుగా జరిగే గొలుసు దొంగల దాడితో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడే వైపు నుంచి స్నాచర్లు వచ్చి మెడలోని గొలుసులు తెంచుకుపోతారోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. పంజా విసిరిన గొలుసు దొంగలను పట్టుకునేందుకు సీసీఎస్ పోలీసులు నిఘా పటిష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీఎస్ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. చిన్న అనుమానం వచ్చినా వాహనాలు స్వాధీనం చేసుకుని పూర్తి ఆధారాలు తెలుసుకున్న తర్వాతే వదులుతున్నారు.
 
విజయవాడ సిటీ : గతనెల 23వ తేదీ గురువారం నగరంపై గొలుసు దొంగలు దాడి చేశారు. పటమట, మాచవరం, కృష్ణలంక పోలీస్‌స్టేషన్ల పరిధిలో గంటన్నర వ్యవధిలోనే నాలుగు గొలుసు చోరీలు చేశారు. ఆ తర్వాత మాచవరం భవానీపురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు గొలుసు చోరీలు జరిగాయి. తిరిగి గురు పౌర్ణమి రోజైన శుక్రవారం సత్యనారాయణపురం, సూర్యారావుపేట, గవర్నరుపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదు ప్రాంతాల్లో గొలుసు చోరీలు జరిగాయి. శుక్రవారం రాత్రి పోలీసుల తనిఖీ సమయంలోనే రైల్వేస్టేషన్‌కి మోటారు సైకిల్‌పై భర్తతో వెళ్తున్న మహిళ మెడలో గొలుసు తెంచుకుని పరారవ్వడం కలకలం రేపింది.

 చోరీ బైకులతోనే..
 చోరీ బైకులనే గొలుసు దొంగలు ఉపయోగించినట్టు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉదయం గవర్నర్‌పేట, సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో రెండు కరిజ్మా మోటారు సైకిళ్ల చోరీ జరిగింది. బైకుల చోరీ జరిగిన 15 నిమిషాల వ్యవధిలోనే వరుస గొలుసు చోరీలు జరిగాయి. వీటిని చోరీలు చేసిన తర్వాత పశువుల ఆస్పత్రి సమీపంలో వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో అవి చోరీ బైకులుగా వెల్లడైంది. బైకు చోరీలు మొదలు గొలుసు చోరీల వరకు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పలుచోట్ల నాసిరకం సీసీ కెమెరాలు ఉంటే, మరికొన్ని చోట్ల ఏదో ఒకటి అడ్డు రావడం వల్ల నిందితుల ఆచూకీ కనిపెట్టలేని పరిస్థితి. దీంతో పోలీసుల దర్యాప్తులో పురోగ తి మందగించింది.

 ఉత్తరాది ముఠాల రాక
 వారం రోజులగా జరుగుతున్న గొలుసు చోరీలను బట్టి ఉత్తరాది ముఠాల ప్రమేయంగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉండే పాత నేరస్తులు ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు తెల్లవారుజామున గొలుసు చోరీలు చేస్తారు. లేదంటే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, రాత్రి 7 గంటల సమయంలో ఎక్కువగా చోరీలకు పాల్పడుతుంటారు. రద్దీ అధికంగా ఉండే సమయంలోనే వీరు గొలుసు దొంగతనాలకు తెగబడటాన్ని బట్టి ఉత్తరాది నుంచి వచ్చిన ముఠాల పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు నగరంలోని ఏదైనా ప్రాంతంలో గానీ, లేదా ఇతర ప్రాంతాల్లో గానీ షెల్టర్ తీసుకుని పోలీసుల కదలికలకు అనుగుణంగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు.
 
మహిళలు అప్రమత్తంగా ఉండాలి
బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు గొలుసు చోరీలకు పాల్పతున్నట్టు గుర్తించాం. పోలీసుపరంగా వీరిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ప్రజలు కూడా వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా వెళ్లే మహిళలు ఎక్కువ నగలు ధరించకపోవడం, వెళ్లే సమయంలో పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించడం చేయాలి. ప్రజలు కూడా అపరిచితుల ఆధారాలను గుర్తించి డయల్ 100కి సమాచారం ఇవ్వాలి.
 - జి.రామకోటేశ్వరరావు, అదనపు డీసీపీ(క్రైమ్స్)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement