కొత్త పోలీస్ బాస్‌లు! | The new police chiefs! | Sakshi
Sakshi News home page

కొత్త పోలీస్ బాస్‌లు!

May 18 2014 12:22 AM | Updated on Jun 2 2018 2:08 PM

కొత్త పోలీస్ బాస్‌లు! - Sakshi

కొత్త పోలీస్ బాస్‌లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బి.ప్రసాదరావు, తెలంగాణ రాష్ట్రానికి అనురాగ్‌శర్మలు తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ)లుగా నియామకం కానున్నారని ఐపీఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అలాగే, హైదరాబాద్‌కు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్‌రెడ్డి పోలీస్ కమిషనర్‌గా కానున్నారనే చర్చా సాగుతోంది.

ఆంధ్రకు ప్రసాదరావు, తెలంగాణకు అనురాగ్‌శర్మ , నగర పోలీసు కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి?
 
 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బి.ప్రసాదరావు, తెలంగాణ రాష్ట్రానికి అనురాగ్‌శర్మలు తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ)లుగా నియామకం కానున్నారని ఐపీఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అలాగే, హైదరాబాద్‌కు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్‌రెడ్డి పోలీస్ కమిషనర్‌గా కానున్నారనే చర్చా సాగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతస్థాయిలో నిర్ణయం జరిగిందని, వాటిని అపాయిం టెడ్ డే జూన్ 2న గానీ, అంతకంటే ముందే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న 1982వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ హోదాలో ఉన్న అనురాగ్‌శర్మను తెలంగాణ డీజీపీగా నియమించే విషయంలో టీఆర్‌ఎస్ అధినేత సానుకూలం గా ఉన్నట్లు తెలిసింది. 1979వ బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత డీజీపీ ప్రసాదరావు, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి టీపీదాస్, రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్ సయ్యద్ అన్వరుల్ హుదాలు ఏపీ కేడర్‌లోకి మారనున్నట్లు సమాచారం. ఇక ఇదే బ్యాచ్‌కు చెంది, శివరాంపల్లిలోని జాతీయ పోలీసు అకాడమి డెరైక్టర్ గా ఉన్న అరుణాబహుగుణ తెలంగాణ రాష్ట్ర కేడర్‌కి మారనున్నారని తెలుస్తోంది.

1980 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌ల్లో ఒకరైన అంబటి శివనారాయణ పదవీ విరమణ చేయగా, వాసన్ ఢిల్లీలో కేంద్రంలో డిప్యూటేషన్‌లో ఉన్నారు. 1981 బ్యాచ్‌నకు చెందిన డీజీపీ హోదా కలిగిన అధికారుల్లో కోడె దుర్గాప్రసాద్‌రావు ఎస్‌పీజీ చీఫ్‌గా ఢిల్లీలో ఉన్నారు. గ్రేహౌండ్స్ డీజీపీగా జేవీ రాముడు, ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న ఏకేఖాన్ ఉండగా, మరో అధికారి ఆర్‌పీ మీనా పదవీవిరమణ చేశారు. 1982 బ్యాచ్‌కు చెందిన వారిలో అనురాగ్ శర్మతో పాటు ఎస్‌వీ రమణమూర్తి (రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్)గా ఉన్నారు. వాసన్ కేంద్ర సర్వీసులోనే కొనసాగే అవకాశాలు ఉండగా, జేవీ రాముడు, కోడె దుర్గాప్రసాద్, ఏకే ఖాన్, రమణమూర్తిలు ఏపీ కేడర్‌లోకి వెళ్లే అకాశాలున్నాయి. దీంతో సీనియార్టీ ప్రకారం బి. ప్రసాదరావును ఏపీ రాష్ర్ట డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన డీజీపీగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించడం, వివాదాలకు అతీతుడు కావడంతో ఆయనకే ఏపీ పోలీసు పగ్గాలను అప్పగించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో సీనియర్‌గా అరుణా బహుగుణ ఉన్నప్పటికీ శాంతిభద్రతల పరిరక్షణలో అనురాగ్‌శర్మకు ఉన్న సమర్థతను దృష్టిలో ఉంచుకొని ఆయనకే పోలీసుబాస్ పగ్గాలు దక్కనున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనర్‌గా ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డిని నియమించడం ఖాయమని ఐపీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ గవర్నర్ పరిధిలో ఉం డడం, ఆయనే నగర పోలీసు కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే, మహేందర్‌రెడ్డి విషయంలో గవర్నర్ సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా సీఎంలు సైతం మహేందర్‌రెడ్డి విషయంలో సానుకూలంగానే ఉండే అవకాశాలున్నాయని ఐపీఎస్ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. చివరి క్షణంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప.. ఈ ముగ్గురు అధికారులకు కీలక పోస్టులు లభించడం ఖాయమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement