ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 29న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కి సీపీఐ, సీపీఎం పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీల జిల్లా కార్యదర్శులు డి.జగదీష్, వి.రాంభూపాల్ ప్రకటించారు.
అనంతపురం అర్బన్ : ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 29న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కి సీపీఐ, సీపీఎం పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీల జిల్లా కార్యదర్శులు డి.జగదీష్, వి.రాంభూపాల్ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో బంద్‌ని విజయవంతం చేయాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జగదీష్, రాంభూపాల్ మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాన మంత్రి మోదీని నిలదీసి అడగడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా ఉద్యమానికి తూట్లు పొడిచేలా మాట్లాడారని ఆగ్రహించారు.
చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని, టీడీపీ కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయిస్తామని ప్రధానికి అల్టిమేటం ఇచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర, ఏపీ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి బీజేపీకి చ్రందబాబు బాసటగా నిలుస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదనే విషయం పద్నాలుగు నెలల తరువాత తెలిసివచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అజెండాగా ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేశాయి. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే మేలు జరుగుతుందని చంద్రబాబు అంటున్నారు. అంటే ఎన్నికల్లో ప్రత్యేక హోదా గురించి చెప్పింది అబద్ధమా? అని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఇందుకు తగిన గుణపాఠాన్ని ప్రజలు చెబుతారని హెచ్చరించారు.