కమిట్ అయ్యి.. కంటితుడుపా? | The decision to set up in the state capital of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కమిట్ అయ్యి.. కంటితుడుపా?

Jul 9 2014 2:34 AM | Updated on Jun 2 2018 2:23 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు ఎక్కడన్న నిర్ణయం ముందే జరిగిపోయిందా? మిగిలిన ప్రాంతాల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకే శివరామకృష్ణన్ కమిటీ జిల్లాల్లో పర్యటిస్తోందా?

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు ఎక్కడన్న నిర్ణయం ముందే జరిగిపోయిందా? మిగిలిన ప్రాంతాల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకే శివరామకృష్ణన్ కమిటీ జిల్లాల్లో పర్యటిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం రాజకీయ వర్గాలు, మేధావుల నుంచి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కోస్తా జిల్లాల మంత్రులు గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్ణయం జరిగిపోయినట్లు ఇప్పటికే వ్యవహరిస్తున్నారు.

 చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం కోసం ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నది మొదలు.. నెల రోజుల వ్యవధిలో జరిగిన అనేక పరిణామాలు ఇప్పటికే రాజధాని ఏర్పాటు విషయంలో ఒక నిర్ణయం జరిగింపోయిందన్న తీరుగానే ఉన్నాయి. కొత్త రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతమయితే అనుకూలంగా ఉంటుందో పరిశీలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటి మొదట గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. కమిటీ ఒక నిర్ధారణకు రాక ముందే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఉంటుందని మీడియా ముందే పేర్కొన్నారు.
 
 ఈ ప్రకటన వెలువడ్డాక రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తన నివేదిక ఇవ్వక ముందే ముఖ్యమంత్రి గుంటూరు-విజయవాడల మధ్య రాజధాని అని ఎలా అంటారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్  కమిటీ రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోంది. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే... రాజధాని ఏర్పాటు నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని, కాకపోతే ఇతర ప్రాంతాల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకే ఇపుడు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోందన్న అభిప్రాయం  రాజకీయ, ఉద్యోగ, మేధావి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచీ కోస్తా నాయకుల వంచనకు రాయలసీమ గురవుతూనే ఉంది.
 
 సీమ చేలను బీళ్లు చేసి కృష్ణా జలాలను మూడోపంట సాగుకు కూడా కోస్తా జిల్లాల వారు తరలించుకు పోయారు. కర్నూలు రాజధాని మూన్నాళ్ల ముచ్చటే అయింది. అప్పట్లో జిల్లాకు చెందిన పప్పూరి రామాచార్యులు లాంటి మేధావులు సీమకు జరగనున్న అన్యాయం గురించి హెచ్చరించారు. అయినా ‘విశాలాంధ్ర’ పూనకంతో సీమ నాయకులు ఆరోజు మోసపోయారు. అప్పటికే ఏర్పాటైన రాజధానిని త్యాగం చేశారు. ఇప్పుడు మళ్లీ రాజధాని విషయంలో సీమ జిల్లాకే చెందిన ‘పసుపు నేత’ వంచనకు పాల్పడుతున్నాడన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
 
 దేవినేనికున్న తెగువ జిల్లా మంత్రులకు లేదా..?
 దేవినేని ఉమ..13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్‌కు నీటి పారుదల శాఖా మంత్రి. తాను విజయవాడ కేంద్రంగానే తన శాఖ సమీక్షలు, కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. అలాగే చేస్తున్నారు. ఇప్పటికింకా రాజధాని ఎక్కడన్నది ఖరారు కాలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా కొత్త రాజధాని ఏర్పాటు అయ్యేవరకూ హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి తన కార్యకలాపాలను విజయవాడ నుంచే కొనసాగిస్తానని ఘంటాపథంగా చెప్పారు. అదే పని జిల్లా మంత్రులైన పరిటాల సునీత, పల్లె రఘనాథ రెడ్డిలు ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్న జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. జిల్లా మంత్రులు కూడా తమ కార్యక్షేత్రాన్ని అనంతపురం నుంచో కర్నూలు నుంచో కొనసాగించేందుకు పూనుకుంటే ఆ మేరకు రాష్ట్ర రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటంపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ పని చేసే తెగువ మన జిల్లా మంత్రులకు ఉందా అన్న ప్రశ్నకు ఇకపై వారి ఆచరణే సమాధానం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement