బరితెగింపు | Sakshi
Sakshi News home page

బరితెగింపు

Published Fri, May 9 2014 1:55 AM

బరితెగింపు - Sakshi

  •  ‘దేశం’ అరాచక పర్వం
  •   ఓటమి భయంతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు
  •  మహిళలని చూడకుండా పిడిగుద్దులు
  •  భయభ్రాంతులకు గురిచేసే యత్నాలు
  •  సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వైపే ప్రజాదరణ ఉండటం.. టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటం.. ఓటమి భయం వెంటాడుతుండటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బరితెగించి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతిచ్చే ప్రజలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. పోలింగ్ సమయం సమీపించేకొద్దీ అరాచకం పేట్రేగింది.
     
    సాక్షి, విజయవాడ : ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసైనా సరే ఎన్నికల్లో గెలవాలనే భావనతో తెలుగుదేశం నేతలు బరితెగించారు. ఎన్నికల రోజు జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు దిగారు. వారే దాడులు చేసి పోలీస్‌స్టేషన్ల ముందు ధర్నాలకు దిగారు. పోలింగ్ కేంద్రాల వద్దనే ప్రచారాలకు ఒడిగట్టారు. అదేమని ప్రశ్నించిన వారిపై నానా దుర్భాషలాడటానికి కూడా వెనుకాడలేదు.

    మహిళలని కూడా చూడకుండా చేయి చేసుకున్నారు. అడ్డువచ్చిన పోలీసు సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారు. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు మీ సంగతి తేలుస్తామంటూ గొప్పలకుపోయి వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఓటమి భయంతోనే సైకోల్లా ప్రవర్తించారని పలువురు భావిస్తున్నారు. దొంగతనం చేసినవాడే దొంగో దొంగ అని కేకలేసిన చందంగా ఆ నేరాలు ఇతరులపై నెట్టిన వైనం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
     
    టీడీపీ రౌడీయిజం ఇలా...

    గంపలగూడెం మండలం అనుమోలులంక  గ్రామంలో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే ఆగ్రహంతో నలుగురు రజక వృత్తిదారులపై టీడీపీ నేతలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో పత్తిపాటి నారాయణకు తీవ్ర గాయాలపాలయ్యారు. పుష్పవతి, లక్షణరావు, పుల్లమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. వారి ఇంటిని కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇంటిలోని తడికలను పీకి వేసి గలాటా సృష్టించారు.
     
    గుడ్లవల్లేరు మండలం వెణుతురుమిల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త హనుమంతరావు ఒక వృద్ధురాలిని ఎన్నికల కేంద్రంలోకి తీసుకువెళుతుండగా... టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రావు, అశోక్, ప్రసాద్‌లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హనుమంతరావు భార్య లక్ష్మీకుమారి గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. ఓటమి అక్కసుతోనే టీడీపీ నేతలు వారిపై ఈ దాడికి పాల్పడ్డారు. భర్త గాయపడ్డాడని తెలియగానే ఆమె పరుగు పరుగున అక్కడకు చేరుకోగా, మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నేతలు ఆమె ముఖంపై పిడి గుద్దులు గుద్ది పరారయ్యారు.
     
    చందర్లపాడు మండలంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఎక్కువ మంది ఓట్లు వేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు మైనార్టీ వర్గానికి చెందిన షేక్ బుజ్జి, షేక్ చిన్న బీబీ, మీరాబీలపై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో షేక్ బుజ్జి తలకు బలమైన గాయం కాగా ఆయన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. టీడీపీకి చెందిన షేక్ సయిదా, లాల్ అహ్మద్, హుస్సేన్ తదితర పదిమంది ఈ దాడిలో పాల్గొన్నారు.
     
    నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో సర్పంచి చంద్రశేఖర్‌రావుపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి గాయపరిచారు. చంద్రశేఖర్‌రావు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.
     
    రెడ్డిగూడెం మండలం రంగాపురంలో పోలింగ్ బూత్‌లో టీడీపీ నేత  ఓటర్లను ప్రభావితం చేయబోయారు. దీన్ని వైఎస్సార్ సీపీ నేతలు అడ్డుకోవడంతో వివాదం చోటుచేసుకుంది. చివరకు టీడీపీ కార్యకర్తను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి స్టేషన్ పైనే దాడికి దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
     
    మోపిదేవిలో జెడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద గ్రామ సర్పంచ్ చక్రపాణి ఓటర్లను ప్రభావితం చేయబోగా, దాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
     
    జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీకి చెందిన చుక్కా మరియమ్మ అనే మహిళను అడ్డుకున్నందుకు వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్లు చుక్కా ప్రసాద్, రవిలపై టీడీపీ కార్యకర్తలు చుక్కా సుదర్శన్, సంజీవరావు, ఇజ్రాయిల్, లాజర్ దాడి చేశారు. ఈ ఘటనలో ప్రసాద్, రవిలకు తీవ్ర గాయాలయ్యాయి.
     
    బాపులపాడు మండలం కొత్త మల్లవల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి వంశీ సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. మహిళలు, చిన్నారులు ఉన్నారని కూడా చూడకుండా రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలయ్యాయి.

    నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. అయితే వైస్సార్‌సీపీ శ్రేణులు ఎంతో సమన్వయంతో వ్యవహరించడం గమనార్హం.

Advertisement
Advertisement