ఎమ్మెల్యే సిఫార్సు ఉందా ఐతే ఓకే..!

TDP Rythu Ratham Tractors Distributions MLAs Involvement - Sakshi

నిడదవోలు రూరల్‌ : రైతుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఆపత్కాలంలో ఉన్న అన్నదాతలను ఆదుకుంటాం. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం కర్షకులకు చెప్పే కల్లబొల్లి మాటలు. కానీ వాస్తవంగా చూస్తే కర్షకుల కన్నీళ్లు తుడవడం మానేసి వారికిచ్చే రాయితీ పథకాలను అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో చేజిక్కించుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా అందించే వ్యవసాయ యంత్రాల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకే అధికార యంత్రాంగం ప్రాధాన్యం ఇవ్వడంతో ఏటా అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోంది. ఇలా రైతులకు అందే వ్యవసాయ పరికరాలను టీడీపీ నేతలు చేజిక్కించుకుని రాయితీ నిధులతో జేబులు నింపుకుంటున్నారు. ఆధునిక పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అందించే వివిధ వ్యవసాయ పనిముట్లు, యం త్రాలు అధికార పార్టీ నేతలకే అందుతున్నాయి. జిల్లాలో 2017–18 ఏడాదిలో రూ.23.14 కోట్లు విలువచేసే 9,262 యంత్రాలను పంపిణీ చేశారు. 2018–19 ఏడాదికిగాను

ఇవిగో ఉదాహరణలు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బండి వెంకటేశ్వరరావుకు రైతురథం పథకంలో ట్రాక్టర్‌ను మంజూరు చేశారు. 2017 అక్టోబర్‌ 24వ తేదీన దరఖాస్తు చేసుకోగా రోటోవేటర్, చిన్న ట్రాక్టర్‌కు కలిపి ఆయన రూ.2 లక్షలు రాయితీ పొందారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్, నిడదవోలు సామాజిక ఆరోగ్యకేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కొమ్మిన వెంకటేశ్వరరావు మేనల్లుడైన కుదప శ్రీనుకు రాయితీపై ట్రాక్టర్‌తో పాటు రోటోపుడ్లర్‌ను మంజూరు చేశారు. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ నాయకుడు కరుటూరి చౌదరికి 2017–18లో రాయితీపై ట్రాక్టర్‌ను మంజూరు చేశారు. 

నిడదవోలు మండలంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయగా లబ్ధిదారులందరూ టీడీపీకి చెందిన వారే. పై ముగ్గురితో పాటు ఎమ్మెల్యే సిఫార్సుతో మరో 27 మంది రైతులు గతేడాది యంత్రాలను దక్కించుకున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. రూ.10.03 కోట్ల బడ్జెట్‌తో 2,420 యంత్రాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది యంత్రాలను ఎంపిక చేసిన రైతులకు గత పది రోజులుగా అందజేస్తున్నారు. రైతు రథం పథకం కింద ఒక్కొక్క ట్రాక్టర్‌ను రూ.2 లక్షలు రాయితీపై పొందేందుకు టీడీపీ సభ్యత్వ కార్డులు, అధికారపార్టీ నేతల సిఫార్సులు ఉన్నవారే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ సిఫార్సులున్న వారికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని అర్హులైన రైతులు వాపోతున్నారు.

ఏటా 12 వేల దరఖాస్తులు
కోరుమామిడి, మునిపల్లి గ్రామాలకు చెందిన రైతులు రెండేళ్లుగా రాయితీపై అందించే యంత్రాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ నేటీకీ మంజూరు చేయలేదు. పొలానికి సంబంధించి అర్హత పత్రాలన్నీ ఉన్నా మాకేందుకు మంజూరు చేయలేదని సదరు రైతులు వ్యవసాయశాఖ సిబ్బందిని ప్రశ్నిస్తే వ్యవసాయశాఖ ద్వారా అందించే రాయితీ యంత్రాలను పొందాలంటే కచ్చితంగా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతకం ఉండాలని ఉన్నతాధికారులు సమాధానం చెప్పడంతో రైతులు ఎవరికీ చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఏటా 12 వేల మంది అర్హులైన రైతులు వ్యవసాయ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే సిఫార్సు లెటర్లు తేలేక రాయితీ యంత్రాలు పొందలేకపోతున్నారు. పవర్‌ టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, రోటోవేటర్లు, తైవాన్‌ స్ప్రేయర్లు కోసం అధికంగా రైతులు దరఖాస్తు చేస్తున్నారు.

ఎవరికి ఇవ్వాలి
రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు, పవర్‌టిల్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను అర్హులైన రైతులకు అందజేయాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న రైతుల స్థితిగతులను విచారించి సొంత భూమి కలిగి ఉండి, వ్యవసాయంపై మక్కువ ఉన్న వారికే వీటిని అందజేయాలి.

ఇస్తున్నది ఎవరికి
రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే దక్కుతున్నాయి. అధికారులు కూడా ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉన్న వారికే వీటిని మంజూరు చేస్తున్నారు. దాంతో అప్పనంగా సబ్సిడీ సొమ్ము దక్కించుకుంటున్నారు.  

రైతు రథం పొందడానికి అర్హులు వీరే..

  • ఎస్సీ, ఎస్టీ రైతులు ఎకరం పొలం, బీసీ, ఓసీ కులాల రైతులు కనీసం రెండు ఎకరాల పొలం కలిగి ఉండాలి.
  • కౌలు రైతులు సాగుచేసే భూమికి ఐదేళ్లు పాటు అగ్రిమెంట్‌ కలిగి ఉండాలి.
  • పట్టదారు పాస్‌పుస్తకం, సాగుచేయు పంటలు, 
  • ఆధార్, బ్యాంక్‌ ఖాతా కలిగి ఉండాలి.
  • దరఖాస్తు చేసుకున్న రైతుకు సొంతంగా ట్రాక్టర్‌ ఉండకూడదు.

కుదించిన రాయితీ పరికరాలు
వ్యవసాయ యాంత్రీకరణకు రాయితీపై అందించే పరికరాలు ఈ ఏడాది కుదించారు. ఒక్కోజిల్లాకు  సబ్సిడీపై 500 ట్రాక్టర్లు ఇస్తామని ప్రకటించినా బడ్జెట్‌లో మాత్రం గతేడాది కంటే 50 శాతం నిధులు కోత విధించారు. 2018–19 ఏడాదికి 2,420 యంత్రాల సబ్సిడీకి రూ.10.03 కోట్లు మంజూరు చేశారు. రైతులకు సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ కింద 90 శాతం రాయితీతో పరికరాలు అందిస్తామని చెప్పినా ఇంకా కార్యరూపం దాల్చ లేదు. పవర్‌టిల్లర్‌తోపాటు, వరి విత్తనాలను వెదజల్లే యంత్రం, వరికోత యంత్రం, చిన్న ట్రాక్టర్లు, లెవెలింగ్‌ బ్లేడులు, పవర్‌ టిల్లర్‌లను కూడా అధికార పార్టీ నేతలకే అందజేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం
వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల స్థితిగతులపై జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో  క్షేత్రస్థాయి పరిశీలన చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. అర్హులైన రైతులు నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు ట్రాక్టర్లతో పాటు మిగిలిన యంత్రాలను రాయితీపై అందజేస్తున్నాం.
– గౌసియాబేగం, సంయుక్త వ్యవసాయ సంచాలకులు, ఏలూరు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top