ఖాకీపై ఖద్దరు స్వారీ!

TDP Leaders Threats to Police in Anantapur - Sakshi

పోలీసు శాఖపై నాయకుల పెత్తనం

నేతల కనుసన్నల్లో పోలీసులకు పోస్టింగ్‌లు

అనుకూలమైన సీఐలు, ఎస్‌లపై దృష్టి

పదేపదే మారుతున్న ఉత్తర్వులు

ఎన్నికల వేళ అధికార పార్టీ నేతల ఇష్టారాజ్యం

ప్రశ్నార్థకంగా మారనున్న శాంతిభద్రతలు

జిల్లా కేంద్రంలో ఓ పోలీసు ఉన్నతాధికారి స్థానిక ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఏ పనీ చేయడం లేదనే చర్చ జరుగుతోంది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ జరిగిన బదిలీలు కూడా సదరు నేత కనుసన్నల్లోనే ఉన్నతాధికారి చేపట్టినట్లు సమాచారం. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలా ఏకపక్షంగా వ్యవహరించే పోలీసు అధికారి ఎంతమాత్రం పారదర్శకంగా వ్యవహరిస్తారనేది అనుమానం.

అనంతపురం, అనంతపురం సెంట్రల్‌: పోలీసు శాఖలో బదిలీల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకునే దిశగా నాయకులు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన సీఐ, ఎస్‌ఐల బదిలీలనుపరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నెలాఖరుకు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల్లో అనుకూలమైన సిబ్బంది నియామకం దిశగా అధికార పార్టీ నేతలు దృష్టి సారించారు. తాము సూచించిన అధికారులనే ఆయా స్థానాల్లో నియమించాలనే ఒత్తిడి ఉన్నతాధికారులపై అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణ, సజావుగా ఎన్నికల నిర్వహణ విషయంలో పోలీసు శాఖ అత్యంత కీలకం. ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ శాఖపై ఒత్తిడి అధికం. పారదర్శకంగా సేవలు అందిస్తేనే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగుస్తుంది. అయితే ఇటీవల పోలీసు శాఖలో కొనసాగుతున్న బదిలీను పరిశీలిస్తే అధికార పార్టీ నేతల పెత్తనం, ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది.

రాజకీయ బది‘లీలలు’
సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఎన్నికల కమిషన్‌ గైడ్‌లైన్స్‌ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపడుతారు. పోలీసుశాఖ మాత్రం ఇందుకు బిన్నం. ఎందుకంటే శాంతిభద్రతల విషయం కావడంతో పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం బదిలీలు చేపట్టడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత బదిలీలు పూర్తిగా రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. రెండు, మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో పలువురు రాజకీయ నాయకులు బదిలీలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ నేతల సిఫారసు లేనిదే బదిలీలు జరగడం లేదనేందుకు ఇటీవల జరిగిన మార్పులే నిదర్శనం.

బదిలీ ఉత్తర్వుల్లో గందరగోళం
ఇటీవల పోలీసు శాఖ నుంచి వెలువడుతున్న ఉత్తర్వుల్లో గందరగోళం నెలకొంది. ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ పడుతుందో.. ఎవరిని ఎప్పుడూ బదిలీ చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో పాటు బదిలీ ఉత్తర్వులు అందుకున్నా సంబంధిత స్థానంలో బాధ్యతలు తీసుకునే వరకు ఆ స్థానం తమదేననే నమ్మకం కలగని పరిస్థితి. ఇందుకు నిదర్శనం రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన పోలీసుల బదిలీలే. నియోజకవర్గం మొత్తం తమకు అనుకూలమైన అధికారులే ఉండాలనే ఉద్దేశంతో బదిలీలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

పరిపాలనా సౌలభ్యం కోసమే..
సీఐల బదిలీలను పరిపాలన సౌలభ్యం కోణంలోనే చేపడుతున్నాం. ఇందులో తక్కువ కాలంలో నియమితులైన వారిని కూడా బదిలీ చేశాం. కేవలం పరిపాలనా పరమైన ఇబ్బందుల వల్లే ఈ మార్పులు. అన్నీ సాధారణ బదిలీలే. ఎస్‌ఐల బదిలీలను జిల్లా ఎస్పీ చూస్తారు. అయినా బదిలీల అంశం అంత పెద్దది కాదు.– కాంతిరాణా టాటా, డీఐజీ, అనంతపురం రేంజ్‌

ఏపీ డాక్టర్స్‌ జేఏసీలో పలువురికి చోటు
అనంతపురం న్యూసిటీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు వైద్యులకు చోటు లభించింది. ఇటీవల గుంటూరులో జేఏసీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ వీరభద్రయ్య, తరిమెల పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ రమణ నాయక్‌లను సభ్యులుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం  నూతన కమిటీ ఏర్పాటు కాని విషయం విదితమే. జేఏసీ అధ్యక్షుడిగా ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు (తిరుపతి) నియమితులయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top