అరుస్తున్న అచ్చెన్న..రెచ్చిపోతున్న ‘రవి’ | TDP Leaders Rowdyism On Government Employees | Sakshi
Sakshi News home page

అంతే వీరు..  మారదు తీరు!

Aug 28 2019 8:26 AM | Updated on Aug 28 2019 10:44 AM

TDP Leaders Rowdyism On Government Employees - Sakshi

‘చెప్పింది చెయ్యరా.. పనిచెయ్యడం ఇష్టం లేకపోతే సెలవులు పెట్టి వెళ్లిపోండి. నియోజకవర్గంలో నాకు తెలీకుండా ఏ పనీ జరగకూడదు. జాగ్రత్త.  పద్ధతులు మార్చుకోండి’ – ఈ నెల 24న కోటబొమ్మాళి మండల ప్రత్యేకాధికారి కార్యాలయ గదులు మూసి వేసి మరీ టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీడీఓ రాజేశ్వరమ్మకు ఇచ్చిన వార్నింగ్‌ ఇది.

‘నాకు రెస్పాండ్‌ అవ్వకపోతే రేపటి నుంచి మీ సీట్లో కూర్చుంటా. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఆఫీస్‌లోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.’ అం టూ సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరరావుపై. . ‘నువ్వు రాజకీయాలు చెయ్యకు. నీకు తెలిసింది రూల్‌ కాదు. నేను చెప్పిందే రూల్‌. నేను చెప్పింది చెయ్యకపోతే. వాట్‌ ఐ యామ్‌ అనేది చూపిస్తా’ అంటూ ఓ మహిళా పంచాయతీ కార్యదర్శిపై.. – ఈ నెల 26న ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ దాదాగిరీ చెలాయించిన తీరు ఇది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  పై రెండు ఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది కదా టీడీపీ అగ్ర నేతల అసలు స్వరూపం. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై పరుషంగా మాట్లాడమే కాకుండా ఏకంగా ఈ ఇద్దరు టీడీపీ అగ్రనేతలు ప్రభుత్వ కార్యాలయాల తలుపులు వేసి మరీ ప్రత్యక్ష బెదిరింపులకు దిగడం చూస్తుంటే ఇంకా వీరి తీరు మారలేదని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్లుగా వీరి వ్యవహారం తయారైంది. ఐదేళ్ల పాటు కీలక పదవుల్లో అధికారం చెలాయించిన వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులపై, మహిళలపై కూడా అప్పట్లో తమదైన శైలిలో రౌడీయిజాన్ని ప్రదర్శించిన సంగతి జిల్లా వాసులకు తెలిసిందే. అయితే ఇలాంటి దుర్మార్గ పాలన రాష్ట్రమంతా ఉండడంతో పాటు అక్రమాలు, అవినీతి పాలన అందించడంతో ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారు. అయినా వీరి తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.

ఏకవచన ప్రయోగాలతో పాటు అవమానకర ప్రవర్తన చేస్తూనే మానసికంగా కుంగదీసేలా పరుష పదజాలంతో తిట్టడం వంటి ఘటనలతో ఉ ద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలతో పాటు జిల్లా వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న తనపై ప్రత్యక్షంగా బెదిరించడంపై బాధిత ఎంపీడీఓ దా మోదరరావు సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగడం మంచి విధానం కాదని, వెంటనే బాధిత ఉద్యోగులకు మాజీ విప్‌ రవికుమార్‌ క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం డిమాండ్‌ చేశారు. దీంతో ఈ వ్యవహరంపై జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా పరిగణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అరుస్తున్న అచ్చెన్న..
టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో అధికారులపై తీవ్రంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గత ఐదేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈయనకు మండల స్థాయి అధికారులతో ఎలా మాట్లాడోలా తెలీకపోవడం దారుణమని ఉద్యోగుల సంఘం విమర్శిస్తోంది. ఈనెల 24న కోట బొమ్మాళి మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేకాధికారి కార్యాలయంలో తలుపులు వేయించి మరీ అచ్చెన్నాయుడు ఎంపీడీఓ రాజేశ్వరమ్మపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు తెలీకుండా వలంటీర్లను నియమించారని, సమాచారం ఇవ్వలేదని, అలాగే పింఛన్లు ఎలా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారిపైన, జలవనరుల శాఖ అధికా రులపైనా ఇలాగే విరుచుకు పడుతూ తన మాట వినకపోతే సెలవులు పెట్టి వెళ్లిపోండని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యాలయ తలుపులు వేసి బెదిరింపులకు దిగారు.

గతంలో కూడా మంత్రి హోదాలో జిల్లాలో చాలా మంది అధికారులపై, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం, పరుష పదజాలంతో మండిపడటం, బెదిరిం చడం తెలిసిందే. టెక్కలి డివిజన్‌కు చెందిన ఓ ఆర్‌అండ్‌బీ ఉద్యోగినిపై కూడా చెయ్యిచేసుకోవడం కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే నాటి తీరునే ఇప్పటికీ ప్రదర్శించడంపై ఉద్యోగుల సంఘ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోటబొమ్మాళి మండలంలోనే పలు బూత్‌లను రిగ్గింగ్‌ చేయించి మరీ ఎమ్మెల్యేగా గెలిచారనే ఆరోపణలు అచ్చెన్నపై ఉన్న సంగతి తెలిసిందే.

రెచ్చిపోతున్న ‘రవి’
ప్రభుత్వ విప్‌గా గత ఐదేళ్లుగా ఓ రేంజ్‌లో ఇసుక, భూ అక్రమాలకు పాల్పడిన కూన రవి కుమార్‌ తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఏమాత్రం తీరు మార్చుకోలేదు. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి వరదల పుణ్యమా అని అడ్డంగా బుక్కైన కూన రవి ఇప్పుడు కూడా అదే తీరులో దాదాగిరీ చేస్తున్నారు. అధికారులపై ఏకంగా తిట్ల దండకం పాడుతున్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా ఈనెల 26న సరుబుజ్జిలి మండల పరిషత్‌ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమంలో విధుల్లో ఉన్న ఎంపీడీఓ దామోదరరావును, అక్కడే ఉన్న ప్రత్యేకాధికారి, ప్రాజెక్టు అధికారిపైన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ‘తలుపులు వేసి బాదేస్తా.. చెట్టుకు కట్టి కాల్చేస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాట్‌ ఐ యామ్‌...అనేది తెలిసే మాట్లాడుతున్నావా’ అంటూ ఓ గ్రామ కార్యదర్శిని ఫోన్‌లో బెది రించడం కూడా తీవ్ర సంచలనంగా మారింది.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఇంకా తానే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును అంతా ఖండిస్తున్నారు. ‘నీకు తెలిసింది రూల్‌ కాదు...నేను చెప్పిందే రూల్‌..’ అంటూ అధికారులపై జులుం చెలాయించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నారు. ఫలితంగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎందరో టీడీపీ నేతలు ఇలాగే అధికారులపైన, సమస్యల పరిష్కారం కోసం అడిగిన బాధితులపైన కూడా విరుచుకుపడటం తెలిసిందే. ఈ ప్రభావంతోనే ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైనా ఆ నేతల తీరు మారకపోవడం గమనార్హం. తీరు మార్చుకోకపోతే చట్టరీత్యా తీవ్ర పరిణామాలు ఎదురుకాక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement