దగాకోడ్‌ రాజ్యం..!  | TDP Leaders code violation west godavari | Sakshi
Sakshi News home page

దగాకోడ్‌ రాజ్యం..! 

May 6 2019 10:42 AM | Updated on May 6 2019 10:42 AM

TDP Leaders code violation west godavari - Sakshi

డగ్లస్‌ స్కూల్‌ రోడ్డులో తమ్మిలేరు ఏటిగట్టును ఆక్రమించి సాగిస్తున్న అక్రమ నిర్మాణం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్నికల కోడ్‌ రావడంతో గత మార్చి నుంచి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ, కోడ్‌ అమలు ఎన్నికల అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూములకు తరలించడం, వాటికి పటిష్ట భద్రత కల్పించడం వంటి పనుల్లో బిజీగా ఉంది. ఎన్నికలు ముగిసినా ఇప్పటికీ కోడ్‌ అమలులో ఉండడం ఒక పక్క ఓట్ల లెక్కింపు, సిబ్బందికి శిక్షణ తదితర పనులలో నిమగ్నమైంది. ఈ సమయాన్ని ఆక్రమణదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సందట్లో సడేమియాలా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని అనుకున్నారో ఏమో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలు చేసి అక్రమ కట్టడాలను నిర్మించేస్తున్నారు. వీటిపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా వాటిని పట్టించుకునేంత తీరుబడి అధికారులకు లేకపోవడంతో అక్రమార్కుల ఆటలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి.
 
తాపీ మేస్త్రి కాలనీలో..
స్థానిక 29వ డివిజన్‌ తాపీమేస్త్రీ కాలనీలో గతంలో పాలకేంద్రం ఉద్యోగులు సొసైటీగా ఏర్పడి వారు ఇళ్ళ స్థలాల కోసం ప్లాట్లు వేసుకున్నారు. దానికి సంబంధించి నిబంధనల ప్రకారం పార్కు, వాటర్‌ ట్యాంకులకు కొంత స్థలాన్ని కేటాయించారు. కాలక్రమంలో పార్కు, వాటర్‌ ట్యాంక్‌ల కోసం విడిచిపెట్టిన స్థలాన్ని కొంతమంది స్వార్థపరులు అమ్మేసుకున్నారు. దీనిపై అక్కడి స్థానికులు కోర్టులో వ్యాజ్యం కూడా వేశారు.  ప్రస్తుతం ఆ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దీనిలో ఇటీవల ఒక వ్యక్తి నిర్మాణం ప్రారంభించాడు. ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాడు.  దీంతో తాపీమేస్త్రి కాలనీలో ఉన్న 300 గృహాలకు దారులు మూసుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం వల్ల రోడ్డు కుచించుకుపోయి అటువైపు వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుందని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా కనీసం ఫైర్‌ ఇంజిన్‌ కూడా వచ్చే అవకాశం ఉండదని పేర్కొంటూ 29వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆడారి అరుణ, స్థానిక నాయకుడు వేగి చిన్న ప్రసాద్‌ ఇటీవలనగర కమిషనర్‌కు వినతిపత్రం అందచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించలేదు.

డగ్లస్‌ స్కూల్‌ రోడ్డులో..
స్థానిక మంచినీళ్లతోట డగ్లస్‌ స్కూల్‌ రోడ్డులో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన ఇద్దరు అన్నదమ్ములు తమ్మిలేరు ఏటిగట్టును ఆనుకుని ఒకేసారి నాలుగు ఇళ్ళు నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా రెండు ఇళ్ళు ఏకంగా తమ్మిలేరు గట్టు దాటి లోపలకు ఆక్రమించి నిర్మించేస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ్మిలేరును ఆక్రమించి నిర్మాణం చేయడంవల్ల రానున్న వర్షాకాలంలో తమ్మిలేరు పొంగితే నీటిప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరద నీరు నగరంలోకి చేరే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు చర్యలు తీసుకోవడం లేదు
తాపీమేస్త్రీ కాలనీలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 300 గృహాలకు వెళ్ళడానికి ప్రధాన రహదారికి ఆనుకునే అక్రమ నిర్మాణం జరుగుతోంది. దీనిని నిలువరించాలని గతంలోనే నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం అందచేశాం. ఇప్పటి వరకూ అధికారులు చర్యలు తీసుకోలేదు. పైగా ఈ అక్రమ నిర్మాణం జరిగిన స్థలం కోర్టు పరిధిలో ఉండగా సదరు వ్యక్తి కోర్టు ధిక్కారాన్కి పాల్పడినట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం.– వేగి చిన్న ప్రసాద్, స్థానికుడు

నగరానికే ప్రమాదం..
తమ్మిలేరు ఏటిగట్టు నానాటికీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కిపోతోంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఏరును ఆక్రమించి గట్టుదాటి లోపలకు గృహాలు నిర్మించేసుకుంటున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ్మిలేరు పొంగుతుందేమోనని నగర ప్రజలు భయపడుతూనే కాలం గడుపుతుంటారు. పైన భారీ వర్షాలు కురిస్తే ఆ నీరు తమ్మిలేరులోకే వచ్చి నీరు ప్రవహించే దారిలేక నగరంలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. – చింతా చంద్ర శేఖర్, మంచినీళ్ళ తోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement