తహసీల్దార్‌పై దాడికి తెగబడిన టీడీపీ నాయకులు

TDp Leaders Attack on Tahsildar in Srikakulam - Sakshi

తహసీల్దార్‌పై దాడికి తెగబడిన టీడీపీ నాయకులు

వీఆర్‌ గూడెంలో ఇంటి స్థలాలు చదును చేస్తుండగా ఘటన

ఇలాగైతే విధులు నిర్వహించలేమంటున్న రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులు, సిబ్బంది  

పొందూరు: అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల అలవాట్లు మాత్రం పోలేదు. పీఠంపై ఉన్నన్నాళ్లు అధికారులపై పెత్తనం చెలాయించి, వారిపై దాడులకు దిగిన ఆ పార్టీ నేతలు ప్రతిపక్షానికి చేరినా ధోరణి మార్చుకోవడం లేదు. పొందూరు మండలంలోని వీఆర్‌ గూడెంలో ఇళ్ల స్థలాలు చదును చేయడానికి వచ్చిన రెవెన్యూ, హౌసింగ్‌ సిబ్బంది పై టీడీపీ నాయకులు మంగళవారం దాడికి తెగబడ్డారు. తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అధికారులు భయాందోళనకు గురయ్యారు.  మండలంలోని వీఆర్‌గూడెం గ్రామం మధ్యలో ఉన్న చిన్న గుట్టపై పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు తహసీల్దార్‌ తామ రాపల్లి రామకృష్ణ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థల సేకరణ, రాళ్లను కొట్టించడం, చదును చేయించడం, రోడ్డు వేయించడం వంటి పనులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ సుమారు రెండు నెలలుగా జరుగుతోంది. పనుల్లో హౌసింగ్‌ సిబ్బందికి ఇబ్బందులు ఎదురుకావడంతో మంగళవారం త హసీల్దార్‌ అక్కడకు పరిశీలన కోసం వెళ్లారు.

అక్కడ ఆవులు కట్టి ఉండడంతో వాటిని పక్కకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పనులు ప్రారంభమయ్యాక కొందరు ఆ ప్రాంతానికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ కొన్నేళ్ల కిందట తమకు పట్టాలు ఇచ్చారని చెప్పారు. దీంతో తహసీల్దార్‌ స్పందిస్తూ.. ఆ స్థలంలో ఇళ్లు కట్టకపోవడంతో ‘డీమ్డ్‌ టు బి కేన్సిల్డ్‌’ అని చెప్పి పట్టాకాగితాలు తీసి చదివారు. దీన్ని భరించలేని టీడీపీ నాయకులు ‘మాకు రూల్స్‌ చెప్పొద్దు’ అంటూ కాగితాలు లాగేసుకున్నారు. అరగంట తర్వాత సువ్వారి మధుసూదనరావు అనే టీడీపీ నేత వచ్చి అధికారులను నేరుగా బెదిరించారు. ఆయనతో పాటు మరికొంత మంది వచ్చి అధికారులను నెట్టేశారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా విలేజ్‌ సర్వేయర్‌ శ్వేత, ఆర్‌.కృష్ణకుమారిలను తోసేశారు.

వారితో పాటు మరో ఆర్‌ఐ నారాయణమూర్తి, వీఆర్‌ఓ సాయి, హౌసింగ్‌ సిబ్బందిపై కూడా దౌర్జన్యానికి దిగారు. దీంతో అధికారులంతా భయపడ్డారని తహసీల్దార్‌ చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులపై దాడి చేసిన సువ్వారి శ్రీనివాసరావు, సువ్వారి మధుసూదనరావు, పేడాడ గోవిందరావు, పల్ల రాజారావు, గండబోన పాపయ్యలతో పాటు మరో ఐదుగురుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. అధికారులకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం నుంచి రెవెన్యూ సిబ్బంది తమ విధులను బాయ్‌కాట్‌ చేయనున్నారు. వీరికి జిల్లాలోని తహసీల్దార్లు, సిబ్బంది మద్దతు తెలుపనున్నారని తెలిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top