హోటల్‌లో ఇసుక స్కెచ్! | TDP Leaders and sketch in Hotel! | Sakshi
Sakshi News home page

హోటల్‌లో ఇసుక స్కెచ్!

Feb 23 2016 12:56 AM | Updated on Aug 28 2018 8:41 PM

హోటల్‌లో ఇసుక స్కెచ్! - Sakshi

హోటల్‌లో ఇసుక స్కెచ్!

ఎక్కువ ఇసుక రీచ్‌ల్ని దక్కించుకోవాలని టీడీపీ నేతలు పన్నాగం పన్నారు. గతంలో ఇసుక ద్వారా కోట్లు సంపాదించుకున్న....

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎక్కువ ఇసుక రీచ్‌ల్ని దక్కించుకోవాలని టీడీపీ నేతలు పన్నాగం పన్నారు. గతంలో ఇసుక ద్వారా కోట్లు సంపాదించుకున్న నేతలు ఆన్‌లైన్‌లోనూ ప్రతాపం చూపుతున్నారు. మహిళా సంఘాలకే ఇసుక అంటూ ప్రభుత్వం ప్రకటించిన పాలసీను సొమ్ము చేసుకున్న అధికార టీడీపీ నేతలు భవిష్యత్తులోనూ సొమ్ము వెనకేసుకునేందుకు సిద్ధమైపోయారు. ఇతరులకు దక్కకుండా విజయవాడ నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చి మంతనాలు నడిపారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఆధ్వర్యంలో ఓ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. పార్టీ అంతర్గత సమావేశాల పేరిట క్యాంప్‌లు నిర్వహిస్తూ ఇసుక ర్యాంప్‌ల విషయంపైనే సుదీర్ఘ చర్చ జరుగుతోంది.  సోమవారం ఇక్కడి రామలక్ష్మణ్ జంక్షన్‌లోని ఓ హోటల్‌లో ఇలాంటి క్యాంపే జరిగింది.
 
సమీక్ష ఎగ్గొట్టి మరీ..
జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఎగ్గొట్టి మరీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి  ఇసుక క్యాంపులో పాల్గొన్నట్టు తెలిసింది. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు సహా టీడీపీ నేతలు హోటల్‌లో కూర్చుని ఆన్‌లైన్ ఇసుక టెండర్లలో ఎవరెవరికి ఎన్నెన్ని ర్యాంపులివ్వాలో లెక్కలేసుకున్నట్టు సమాచారం. విశాఖలోని ఎమ్‌ఎస్‌టీసీ ఆధ్వర్యంలో జరిగిన దరఖాస్తుల ప్రక్రియ నుంచి ఆన్‌లైన్ బిడ్డింగ్ వివరాలు తెప్పించుకుని మెజార్టీ శాతం టీడీపీ నేతలకే ర్యాంప్‌లు దక్కేలా మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇందుకు అనుగుణంగానే సోమవారం జరిగిన వేలంలో జిల్లాలోని 13ర్యాంపులకు ప్రక్రియ ముగిసింది. 17ర్యాంపులకు గతంలోనే నాలుగు రద్దవ్వగా జిల్లా మంత్రికి రెండు, విప్ అనుచరులకు ఒకటి, టీడీపీ నేతలకు మరికొన్ని రీచ్‌లు దక్కినట్టు తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది.
 
గుడ్‌విల్‌తోనైనా..
బెదిరించైనా, గుడ్‌విల్ ఇచ్చయినా రీచ్‌లు సొంతం చేసుకోవాలని బెజవాడ నుంచి వచ్చిన ప్రతినిధి ఇక్కడి నాయకులకు సూచించినట్టు తెలిసింది. వాస్తవానికి గతంలో కోట్లు దక్కించుకున్న ర్యాంప్‌లు కూడా క్యూబిక్ మీటర్‌కు రూ.500లోపే వేలంలో వెళ్లినట్టు తెలిసింది. రూ.150, 500కు మధ్య అధికశాతం ర్యాంపులు వెళ్లగా రూ.458కి మరో ర్యాంపు వేలంలో పలికినట్టు తెలిసింది. ఈ ర్యాంపులో ఇతరులకు దక్కిన వాటిని గుడ్‌విల్ చెల్లించడమో, వాటాలివ్వడం ద్వారా సొంతం చేసుకోవడమో చేయాలని చినబాబు నుంచే డెరైక్షన్ వచ్చినట్టు తెలిసింది.

ఎంఎస్‌టీసీ నుంచి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడై స్థానిక మైనింగ్ అధికారులకు నివేదిక వస్తుందని, అధికారిక తవ్వకాలూ జరుగుతాయని, జన్మభూమి కమిటీ సభ్యులు, పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ్ముళ్లకూ కొంత వాటాలిచ్చి ర్యాంప్‌లు నిర్వహించుకోవాలని సూచించి బెజవాడ బృందం తిరుగు ప్రయాణమైనట్టు తెలిసింది. విస్తృతస్థాయి సమావేశం ఉండడంతో ఇసుక క్యాంప్‌పై రహస్య సమావేశం విషయం తొలుత తమ్ముళ్లకు తెలియలేదు. సోమవారం రాత్రి హోటల్‌లో హడావుడి జరగడం, వాటాల విషయంలో తలెత్తిన విభేదాలు బయటపడడంతో మరో వర్గం తీవ్రమనస్తాపం చెంది తమకు వాటాలు దక్కకపోతే విషయాన్ని చినబాబు, పెదబాబుల వద్దకు తీసుకువెళ్తామని హెచ్చరించినట్టు కూడా ప్రచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement