టీడీపీ పాలనలో శాంతిభద్రతలు ఘోరం | TDP law and order during the disaster | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనలో శాంతిభద్రతలు ఘోరం

Nov 29 2014 1:24 AM | Updated on Sep 2 2017 5:17 PM

టీడీపీ పాలనలో శాంతిభద్రతలు ఘోరం

టీడీపీ పాలనలో శాంతిభద్రతలు ఘోరం

:రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.

పెట్లూరివారిపాలెం (నరసరావుపేట రూరల్) :రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పెట్లూరివారిపాలెంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో గుంటూరు-కర్నూలు రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. అదే సమయంలో వినుకొండ వెళుతున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు కూడా రాస్తారోకోలో పాల్గొన్నారు. సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో రహదారికి ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

పట్టణ సీఐ ఎం.వి.సుబ్బారావు సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వైఎస్ విగ్రహ ధ్వంసం ఘటనకు బాధ్యులైన వారిని రెండు రోజుల్లో అరెస్టుచేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.  అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా పేర్కొన్నారు.  

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పదికిపైగా వైఎస్ విగ్రహాలు ధ్వంసానికి గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్లూరివారిపాలెం ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించి దోషులను అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇటువంటి చర్యలు శాంతిభత్రలకు విఘాతం కలిగిస్తాయన్నారు. రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వినుకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు.

ఈ పరిస్థితులను ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. రాస్తారోకోలో నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు పిల్లి ఓబుల్‌రెడ్డి, కె.శంకరయాదవ్, పెట్లూరివారిపాలెం, జొన్నలగడ్డ గ్రామ సర్పంచ్‌లు చల్లా నారపరెడ్డి, దొండేటి అప్పిరెడ్డి, ఉప్పలపాడు, తురకపాలెం, రంగారెడ్డిపాలెం నాయకులు నంద్యాల సత్యనారాయణరెడ్డి, పొదిలే ఖాజా, మూరే రవీంద్రరెడ్డి, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, మున్సిపల్ ప్లోర్‌లీడర్ మాగులూరి రమణారెడ్డి, సయ్యద్ ఖాదర్‌బాషా, గ్రామ నాయకులు మేకల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement