టీడీపీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ!

TDP Intelligence Agency! - Sakshi

అధికార పార్టీ జేబు సంస్థగా మారిన నిఘా విభాగం

తెలుగుదేశం సేవలో తరిస్తున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు

అసలు విధులను వదిలేసి, టీడీపీ పనులకే పరిమితం

నిఘా గాలికి.. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఉపయోగపడేలా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సర్వేలు

ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి అమలు చేయాల్సిన వ్యూహాలపై అధ్యయనాలు

ఫిరాయింపులకు ప్రోత్సాహం.. టీడీపీని ఎదిరించే వారికి బెదిరింపులు

ప్రతిపక్ష నేత కదలికలు, కార్యాచరణపై దృష్టి

‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో అప్పటి నిఘా విభాగం చీఫ్‌ అనూరాధపై బదిలీ వేటు

ఇప్పుడు విశాఖ మన్యంలో ఇద్దరు దారుణహత్యకు గురైనా వెంకటేశ్వరరావును కదిలించని ప్రభుత్వం

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: విశాఖ మన్యంలో మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను పట్టపగలే కాల్చి చంపారు. మావోయిస్టుల వ్యూహాలను ముందుగానే పసిగట్టడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధికార పార్టీ జేబు సంస్థగా మారిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు అధికార తెలుగుదేశం పార్టీ తొత్తుగా పనిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన విధులను పక్కనపెట్టి, అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని, నిఘా విభాగం నిస్తేజంగా మారిపోవడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం ఏజెంట్‌
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నివేదికలు ఇవ్వడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, అధికార పార్టీని ఎదిరించే వారిని బెదిరించి దారికి తెచ్చుకోవడం, ఇంటెలిజెన్స్‌ విభాగం సిబ్బందిని టీడీపీ కార్యకర్తలుగా మార్చేయడం.. ఇవీ ఎ.బి.వెంకటేశ్వరరావు చేస్తున్న పనులు. అయన పూర్తిస్థాయిలో తెలుగుదేశం ఏజెంట్‌గా మారిపోయారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన స్వయంగా రంగంలోకి దిగారు.

తన సిబ్బందికి బూత్‌ స్థాయిలో బాధ్యతలు కేటాయించి, టీడీపీ గెలుపు కోసం తనవంతు తోడ్పాటు అందించారు. అధికార పార్టీ పట్ల స్వామిభక్తిని చాటుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో మకాం వేశారు. అక్కడి తాజా రాజకీయ పరిణామాలపై సర్వేలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుకు హైదరాబాద్‌లో ఏం పని అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నిలదీసిన సంగతి తెలిసిందే.

ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఏజెన్సీగా మార్చేశారని రిటైర్డ్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అత్యున్నత అఖిల భారత స్థాయి సర్వీసుకు చెందిన అధికారి ఇలా అధికార ఆర్టీ ఏజెంట్‌గా పనిచేయడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాల్సింది పోయి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం సరైంది కాదని అన్నారు.

టీడీపీలో చేర్పించేందుకు రాయబారాలు
సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎ.బి.వెంకటేశ్వరరావు రానున్న కాలంలో కృష్ణా జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ కోసం తనవంతు సేవలందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి, అధికార పార్టీలో చేర్పించే బాధ్యతను కూడా ఎ.వి.వెంకటేశ్వరరావు తన భుజాలపై వేసుకున్నారు. వారిలోని అసంతృప్తి, అవసరాలను గుర్తించి టీడీపీలో చేర్పించేందుకు రాయబారాలు సాగిస్తుంటారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఏపీలో ఏ మేరకు ఉంటుంది? టీడీపీకి లాభమా? నష్టమా? అనే దానిపై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో ప్రస్తుతం సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ టీడీపీ బలోపేతానికి, ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి అమలు చేయాల్సిన వ్యూహాలపై సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. పోలీసు మాన్యువల్‌లో పొందుపర్చిన విధులను నిర్వర్తించే దిశగా ఇంటెలిజెన్స్‌ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం రాజకీయాల చుట్టే ప్రదక్షిణలు చేస్తోంది.

కీలక స్థానాల్లో టీడీపీ అనుకూలురే...
ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ పర్యవేక్షణలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ లేదా కానిస్టేబుల్‌ను కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని కేటాయించారు. ఇలా రాష్ట్రంలో 256 మంది ఇంటెలిజెన్స్‌ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రోజువారీ సమాచారం ఇస్తుంటారు. ఆ సమాచారాన్ని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో 150 మంది క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. రాష్ట్ర నిఘా విభాగంలో కీలకమైన స్థానాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారినే నియమించారు.

కాంగ్రెస్‌తో పొత్తు లాభమా? నష్టమా?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలపై రాష్ట్ర నిఘా విభాగం పూర్థిస్థాయిలో దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ లాభమా? నష్టమా అనే దానిపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తామన్న కాంగ్రెస్‌ హామీని ప్రజలు విశ్వసిస్తున్నారా? వ్యవసాయ రుణాలు రూ.2 లక్షల మాఫీ హామీపై ప్రజల స్పందన ఏమిటి? కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఓట్ల బదలాయింపు జరుగుతుందా? అనేదానిపై అనే వివరాలను సేకరిస్తున్నారు.

జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేనివారిని గుర్తించి, అదిలించి బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత కదలికలు, కార్యాచరణపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. టీడీపీ నేతలు ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు పని చేయడం లేదనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. ఏ పార్టీలో ఎవరు బలంగా ఉన్నారో తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో కులాల వారీగా ఓటర్ల వివరాలు, టీడీపీ బలం, బలహీనతలపై సర్వే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ ఆశావహుల ఆర్థిక స్థితిగతులపై ఆరా తీస్తున్నారు.

క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి బలం తక్కువుగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. అక్కడ బలంగా ఉన్న ఇతర పార్టీల నేతల సమాచారాన్ని రాబట్టి, టీడీపీ ముఖ్యులకు చేరవేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం ఉన్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో నిఘా విభాగం అధికారులే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం వారిని సంప్రదించక తప్పడం లేదు.

మహిళా అధికారిపై వేటు.. ఎ.బి.వెంకటేశ్వరరావుకి చోటు
తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు ‘బ్రీఫ్‌డ్‌ మీ’ వాయిస్‌తో అడ్డంగా బుక్కయిన సంగతి తెల్సిందే. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ ఎత్తుగడలను గుర్తించడంలో విఫలమయ్యారంటూ అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏఆర్‌ అనూరాధను బాధ్యతల నుంచి తప్పించారు. చంద్రబాబుకు సన్నిహితుడు, అప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న ఎ.బి.వెంకటేశ్వరరావుకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్రంలో నిఘా వ్యవస్థ పూర్తిగా దారితప్పిందని, అయినా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు పదవికి వచ్చిన ముప్పేమీ ఉండదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో తాను అడ్డంగా దొరికిపోతే అందుకు బాధ్యులను చేస్తూ అప్పటి ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ అనూరాధను విధుల నుంచి తప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దారుణహత్యకు కారణమైన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును ఎందుకు తప్పించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నిఘా వైఫల్యాలు ఎన్నెన్నో..
రాష్ట్రంలో ఇంటెలిజెన్స్‌ విభాగం వైఫల్యాల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. ప్రధానంగా గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకోకపోతే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని ముందే తెలిసినప్పటికీ నిఘా విభాగం పట్టించుకోలేదు. ఈ మేరకు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. దాంతో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

తుని రైలు దహనం ఘటనలోనూ నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాపుల ఉద్యమంలో అసాంఘీక శక్తులు చొరబడే ప్రమాదం ఉన్నా ముందే గుర్తించలేదు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డికి ప్రత్యర్థుల నుంచి ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించలేకపోయింది. ఫలితంగా ఆయన ప్రత్యర్థుల దాడిలో మరణించారు. తాజాగా విశాఖ మన్యంలో నిఘా వైఫల్యం వల్ల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top