ఫోన్‌ వచ్చిందో ఒకటి నొక్కేయాల్సిందే...!

TDP govt embarrassment  with Phone call - Sakshi

ఆర్టీజీఎస్‌ కాల్స్‌తో ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం 

ఒకటి నొక్కే వరకు వదలడం   లేదు.. 

దాని ఆధారంగా ప్రభుత్వ పనితీరు సంతృప్తి అంటూ ప్రచారం

గగ్గోలు పెడుతున్న  ఫోన్‌ వినియోగదారులు

గంట్యాడ మండలానికి చెందిన బి.శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నానని, ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా ఉందా? అంటూ అడిగారు. సంతృప్తిగా ఉంటే 1, లేకుంటే 2 నొక్కాలని అన్నారు. సదరు వ్యక్తి 2 నొక్కారంతే పొద్దంతా ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ సిబ్బంది విసిగించారు. చేసేది లేక ఆయన అక్కడ నుంచి ఫోన్‌ వస్తే చాలు 1 నొక్కేస్తున్నారు. 

‘ విజయనగరం  పట్టణంలో ఉన్న సింహాచలం అనే వ్యక్తికి అదేవిధంగా కాల్‌ వచ్చింది. పౌరసరఫరాలశాఖ పనితీరు ఎలా ఉందని అడిగారు. సంతృప్తిగా లేదన్నందుకు పదేపదే ఫోన్‌లు వచ్చాయి. చేసేది లేక అంతా బాగుందని చెప్పేశాడు’. 

విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం పాలనకంటే ప్రచారానికే ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడి నాడి తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్‌ ద్వారా వస్తున్న ఫోన్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఫోన్‌ వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నామన్న అభిప్రాయం వెలుబుచ్చితే గానీ వదలడం లేదు. దీంతో ఇదెందుకు వచ్చిన సంతృప్తి అంటూ ప్రజలు నిట్టూర్చుతున్నారు.

అందరిదీ అదే పరిస్థితి.. 
ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు సమస్య కాదు ఇది. జిల్లాలో అనేక మంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు పథకాలు అమలు చేయడం, వాటిని అర్హులకు అందేటట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించడం తెలుసు. ఈసారి ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు ప్రజలకు రియల్‌టైం గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ద్వారా ఫోన్‌లు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాయిస్‌తో వస్తున్న ఫోన్‌ సంతృప్తిగా ఉన్నారా? ఉంటే 1 నొక్కాలని, లేదంటే 2 నొక్కాలని అడుగుతున్నారు. ఇలా జిల్లాలో రోజూ ప్రభుత్వ పనితీరుపై, ప్రభుత్వ పథకాలు అమలుపై వేలాది మందికి ఫోన్‌లు వస్తున్నాయి. అయితే, ఇందులో అనేక మంది 1 నొక్కుతుండడం విశేషం. 

2 నొక్కితే ఇబ్బందే.. 
దీనివెనుక పెద్ద కథ ఉంది. పొరపాటున 2 నొక్కితే ఆ రోజుంతా పని చేయనవసరం లేదు. అక్కడ సిబ్బంది ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? కారణం ఏమిటి? అంటూ అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. పైగా కొందరిని వారికి సంబంధం లేని అంశాలపై కూడా అభిప్రాయాలు కోరుతున్నారు. రేషన్‌కార్డు లేనివారిని, పెన్షన్‌ అందుకోని వారిని, ఆ పథకాలతో సంబంధం లేని వారికి కూడా ఫోన్‌ చేసి వాటిపై అభిప్రాయం కోరుతున్నారు. తెలియకపోవడంతో కొందరు ఫోన్‌ కట్‌ చేస్తున్నారు.

అయినా, మళ్లీమళ్లీ ఫోన్‌ చేసి విసిగిస్తున్నారు. దీంతో అభిప్రాయం కోరగానే 2 నొక్కితే తర్వాత పదేపదే ఫోన్‌లు వస్తున్నాయి. దీంతో చేసేది లేక 1 నొక్కేస్తున్నారు. 1 నొక్కితే ఏ సమస్య ఉండదని, తర్వాత మరేమీ అడగరని, అందుకే అలా చేస్తున్నామని అనేక మంది బహిరంగంగా చెబుతున్నారు. పైగా 2 నొక్కితే తర్వాత ఫోన్‌ లైనులోకి వచ్చేవారు ఆధార్‌ కార్డు, ఊరు, పేరు, ఇతర ఇబ్బందికర వివరాలు అడగడంతో 1 బెటర్‌ అన్న భావనలో ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తున్నామని పలువురు అభిప్రాయపడుతుండడం గమనార్హం. జిల్లా అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలుసు. అనేక మంది అధికారులు వద్ద ఈ చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. అయినా, ఎవరూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం లేదు. తీసుకెళ్లినా ప్రభుత్వంతో ఇబ్బంది దేనికని మౌనంగా ఉంటున్నారు. 

సంతృప్తిగా ఉన్నారంటూ ప్రభుత్వం ప్రచారం
ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా, పథకాలు అందకపోయినా ఇబ్బంది పడలేక 1 నొక్కితే ప్రభుత్వం అదే తమ పాలన ఘనత అంటూ ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రితో పాటు అనేక మంది అధికారపార్టీ నేతలు తమ ప్రభుత్వంపై 70, 80 శాతం సంతృప్తిగా ఉన్నారంటూ చెబుతుండగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు. అదే సంతృప్తి అనుకుంటే ప్రతిపక్షానికి మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్ధం చేసుకోపోయినా ఫర్వాలేదు గానీ, ప్రజలను విసిగించకుండా ఉంటే మంచిదని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top