సైబర్ నిపుణుల సూచన
సాక్షి, హైదరాబాద్: నేటి బిజీబిజీ జీవితాల్లో ప్రతి నిమిషం విలువైందే. ఎక్కడో అత్యంత ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. ఒకసారి ఆన్సర్ చేయకపోతే మరోసారి వరుసగా మోగుతూనే ఉంటుంది. తీరా ఫోన్ ఆన్సర్ చేస్తే.. అవతలి వ్యక్తి హలో అంటూ మొదలు పెట్టి.. మనకు సంబంధం లేని ఏవేవో వాణిజ్య ప్రకటనలు, భూముల కొనుగోళ్లు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్లు అవసరం లేకుండా ప్రీ అప్రూవ్‌డ్ లోన్లు.. అంటూ దండకం అందుకుంటారు.
ఇలాంటి స్పామ్ ఫోన్‌కాల్స్ తలనొప్పి కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి అనవసరమైన ఫోన్‌కాల్స్ బారి నుంచి బయటపడటంతోపాటు అనుమానాస్పద, మోసపూరిత యూఆర్‌ఎల్ (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)పై సైబర్ క్రైం పోర్టల్ ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేసేందుకు రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ అనే ఆప్షన్ అందుబాటులో ఉందని నిపుణులు చెపుతున్నారు.
ఇలా చేయండి..
మీకు అనుమానాస్పద నంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ కాల్స్ చేసి విసిగిస్తున్నా, మీ వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అలాంటి ఫోన్‌కాల్‌ను కట్ చేసి వదిలేయకుండా ఆ నంబర్ల వివరాలను పోలీసుల దృష్టికి తెచ్చి చర్యలు తీసుకోవచ్చని సైబర్ నిపుణులు చెపుతున్నారు. అందుకు మీరు చేయాల్సింది.. సైబర్ క్రైం పోర్టల్‌లోకి వెళ్లి రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రిపోర్ట్ సస్పెక్ట్‌లోకి వెళ్లాలి.
మీరు ఏ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయాలో కూడా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫోన్ నంబర్, వెబ్‌సైట్ యూఆర్‌ఎల్, సోషల్ మీడియా యూఆర్‌ఎల్ నమోదు చేయాలి. మీకు ఏవిధంగా ఇబ్బంది కలిగిస్తున్నారన్న దానికి సంబంధించిన స్కీన్ర్‌షాట్ లేదా వాయిస్ రికార్డింగ్‌లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సైబర్ క్రైం పోలీసులు ఈ ఫిర్యాదులను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారు.


