కలెక్టరేట్‌లో దొంగలు పడ్డారు!

TDP Government Not Solved Titli Victim Problems - Sakshi

2018 అక్టోబరు 11.. తిత్లీ తుపాను జిల్లాను అతలాకుతలం చేసిన రోజు.. ఈ విపత్తు ధాటికి 11 మండలాల్లోని దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు దారుణంగా చితికిపోయిన దుర్దినం.. తుపాను వెలసి ఆరు నెలలైనా సహాయ చర్యల పేరిట నిధుల స్వాహా మాత్రం ఇంకా ఆగలేదు. బాధితుల పునరావాస, తక్షణ సహాయ చర్యల కోసం టీఆర్‌ 27 బిల్లు ఆధారంగా అధికారులు కావాల్సినన్ని నిధులు ఖజానా శాఖ నుంచి తీసుకోవచ్చు. అలాగే ఎలాంటి వివరాలు లేకుండా అబస్టాట్‌ కంటింజెన్సీ (ఏసీ) బిల్లులు సమర్పించే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే జీవో ప్రకారం వీటిని విపత్తు తర్వాత ఒకటీ రెండు వారాల్లో ఖజానా శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఆరు నెలల తర్వాత టీఆర్‌ 27 బిల్లు కింద కొత్త ఏసీ బిల్లులు రూ.3.10 కోట్లకు సృష్టించారు. జిల్లా కలెక్టరు సంతకం లేకుండానే వాటిని ఖజానా శాఖకు సమర్పించి అందినకాడికి నొక్కేయడానికి పెద్ద పన్నాగమే పన్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ బాధితులకు అందాల్సిన సొమ్మును అధికార పార్టీ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మకై నొక్కేసిన లీలలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇది చాలదన్నట్లుగా మరో రూ.3.10 కోట్ల మేర మెక్కేసేందుకు భారీ స్కెచ్‌ వేశారు. వాస్తవానికి టీఆర్‌ 27 బిల్లును విపత్తుల సమయంలో మాత్రమే వాడాలి. అయి తే అత్యవసర సహాయ, పునరావాస చర్యలకు ఆటంకం కలగకుండా ఈ పద్దులో అవసరమైన నగదును ఖజానా శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఆ ఖర్చుకు సంబంధించి డీటెయిల్డ్‌ కంటింజెంట్‌ (డీసీ) బిల్లు పెట్టడానికి సాధ్యం కాదు కాబట్టి అబస్టాట్‌ కంటింజెన్సీ (ఏసీ) బిల్లులను పెడతారు. వాటిపై జిల్లా కలెక్టరు సిఫారసు ఉండాలి. ఆ బిల్లులను విపత్తు తర్వాత ఒకటీ రెండు వారాల గడువులోనే ఖజానా శాఖకు పంపాలి. ఆ తరువాత ఏసీ బిల్లులు పెట్టడం కుదరదు. 

ఆర్నెల్ల తర్వాత కుతంత్రం తెరపైకి...
తిత్లీ తుపాను పోయిన ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు జిల్లా కలెక్టరేట్‌ కేంద్రంగా దాదాపు రూ.3.10 కోట్ల మేర ఏసీ పద్దు కింద దొంగ బిల్లులు సృష్టించారు. వాస్తవానికి ఈ బిల్లులు పెట్టినప్పుడు అక్కడ డ్రాయింగ్‌ అధికారి (డీడీవో)గా ఉన్న కలెక్టరేట్‌ పరిపాలనాధికారి (ఏవో) వాటిని రూపొందించి, దానిపై సంతకం చేసి ఖజానా శాఖకు అందజేయాల్సి ఉంది. అయితే ఆర్నెల్ల తర్వాత పెడుతున్న రూ.3.10 కోట్ల ఏసీ బిల్లులపై ఎవరు సంతకం చేయాలి? నిబంధనల ప్రకారం ఖజానా శాఖకు బిల్లు పెట్టిన సమయంలో ఉన్న జిల్లా కలెక్టరు, డీడీవో సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రూ.3.10 కోట్ల ఏసీ బిల్లులపై ఎవరు సంతకం చేశారనేదీ బయటకు తెలియనీయట్లేదు. తిత్లీ తుపాను సమయంలో జిల్లా కలెక్టరుగా ఉన్న కె.ధనంజయరెడ్డి ఫిబ్రవరి 8వ తేదీన బదిలీపై అమరావతికి వెళ్లిపోయారు. తర్వాత ఆయన స్థానంలో వచ్చిన ఎం.రామారావు కూడా పదిహేను రోజులకే బదిలీ అయ్యారు.

ఆ తర్వాత జిల్లా కలెక్టరుగా వచ్చిన జె.నివాస్‌ వచ్చే సమయానికి ఎన్నికల హడావుడి మొదలైంది. ఈయన ఏ శాఖకు సంబంధించిన ఫైళ్లు కూడా పరిశీలించే తీరికలేని పనుల్లో ఉన్నారు. తిత్లీ బిల్లులను ఆయన పరిశీలించే అవకాశం లేదని కలెక్టరేట్‌ వర్గాల భోగట్టా! అయితే ఏసీ బిల్లుల సృష్టికి కలెక్టరేట్‌లోని ‘ఎ సెక్షన్‌’ కేంద్రంగా ఉంది. కానీ అడ్డగోలుగా పాత అ«ధికారుల పేరిట ఈ బిల్లులు పెడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ బిల్లుల కుట్ర వెనుక ఓ జిల్లా ఉన్నతాధికారి హస్తం ఉందనే ఆరోపణలతో కలెక్టరేట్‌ మార్మోగుతోంది. ఒకవైపు అధికార యంత్రాంగమంతా ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలై ఉంటే మరోవైపు ఈ దొంగ ఏసీ బిల్లులతో ప్రజాధనానికి ఎసరు పెట్టడానికి సిద్ధమవడం గమనార్హం. అలాగే తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను చిత్రీకరించేందుకు అప్పట్లో డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించారు. వీటికి బిల్లులు కూడా అధిక మొత్తంలో ఉండటంతో అప్పటి కలెక్టరు వాటిని సిఫారసు చేసేందుకు నిరాకరించారు. కానీ ఇప్పుడు డ్రోన్‌ కెమెరాల అద్దె నిమిత్తం రూ.42 లక్షలు చెల్లించేలా కొత్త బిల్లులను తయారుచేసినట్లు తెలిసింది. 

ఖజానా శాఖలోనే ఆగాలి...
సాధారణంగా టీఆర్‌ 27 ఏసీ బిల్లుల విషయంలో ఖజానా శాఖ అధికారులు జాగ్రత్తగానే ఉంటారు. నిబంధనల ప్రకారం లేనిదే ఏ బిల్లునూ ఆమోదించరనే పేరుంది. ఈ నేపథ్యంలో రూ.3.10 కోట్ల తిత్లీ తుపాను ఏసీ బిల్లులు సోమవారం ఖజానా శాఖకు చేరే అవకాశం ఉంది. మరి వాటిని తిప్పి పంపుతారా? లేదంటే టీడీపీ నాయకులు, సంబంధిత జిల్లా ఉన్నతాధికారి ఒత్తిళ్లకు లొంగి ఆమోదిస్తారా? అనేది వేచిచూడాలి!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top