ఆర్టీసీ విలీనం.. టీడీపీలో మలినం

TDP Government Not Solved The RTC Employees Problems - Sakshi

చంద్రబాబు సర్కారులో కార్మికులకు ఫిట్‌మెంట్‌ కరువు

ఆర్టీసీలో అంతా ప్రైవేట్‌మయం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి వైఎస్‌ జగన్‌ హామీ

సాక్షి, చీరాల అర్బన్‌ (ప్రకాశం): మధ్య తరగతి మనిషి ఎక్కడికి వెళ్లాలన్నా మొదటగా గుర్తొచేది ఆర్టీసీనే. ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ కొన్ని కోట్ల మందికి నేస్తంగా మారిన ఆ ప్రగతి చక్రాన్ని ప్రభుత్వంలో కలపకుండా తెలుగుదేశం ప్రభుత్వం తమను ఇబ్బందుల పాలు చేస్తుందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ వయస్సు పెంచినా కూడా తమకు పెంచకపోవడంపై కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ప్రజల కోసం పండుగ రోజలు కూడా పనిచేసే తమకు 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్న ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. రాజన్న పాలనలో ‘‘పల్లెవెలుగు’’లా ఉన్న తమ జీవితాలు ఇప్పుడు డొక్కు బస్సుల్లా తయారయ్యాయని వాపోతున్నారు. తమకు మంచి రోజులు రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని వాళ్లు ఆకాంక్షిస్తున్నారు.

ప్రజా రవాణా వ్యవస్థలో రికార్డులెక్కిన ఏపీఎస్‌ ఆర్టీసీని తెలుగుదేశం పార్టీ వంచన చేస్తూనే ఉంది. ఎన్నో యూనియన్లు సమస్యలను యాజమాన్యం వద్ద మొరపెట్టుకున్నా పరిష్కారం కావడం లేదు. ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్‌ కూడా నిలిచిపోయింది. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు పోస్టులు కూడా నిలిచిపోయాయి. ఆర్టీసీలో ఒక్కో విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. యాజమాన్యం అవలంభిస్తున్న విధానాలతో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. సరైన ఫిట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటానని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో అన్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో మొత్తం 8 డిపోలు ఉన్నాయి, 1600 మంది ఆర్టీసీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 50 ఏళ్లు పైబడిన వారు 700 వరకు ఉన్నారు. కార్మికులకు 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ యూనియన్లు తీవ్రస్థాయిలో పోరాటాలు చేశాయి. సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. ఈ దశలో మంత్రి అచ్చెన్నాయుడు నామమాత్రంగా 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. అలానే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారందరికి పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచినా ఆర్టీసీ కార్మికులకు మాత్రం పెంచలేదు.

అన్నింటా ప్రైవేటీకరణే...
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో ఉద్యోగాల భర్తీ చేయకుండా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంది. ఆర్టీసీలో నష్టాలు తగ్గించేందుకు కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా అద్దె బస్సులను తీసుకువచ్చారు. కండక్టర్‌ వ్యవస్థను కూడా పూర్తిగా తగ్గించేందుకు అద్దె బస్సు డ్రైవర్లుకే టిమ్‌లు ఇచ్చారు. డ్రైవరే టిమ్‌ల ద్వారా టిక్కెట్‌ ఇవ్వాలి. ఈ విధానాన్ని యూనియన్లు ఖండిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సులతో పాటు రిజర్వేషన్‌ కౌంటర్లు, కార్గో కూడా ప్రైవేటు వ్యక్తులకే ధారాదత్తం చేశారు. తాజాగా వీఆర్‌ఎస్‌ జీఓను తీసుకువచ్చారు. కార్మికులే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు వీలు కల్పించారు. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే తమ జీవితాలు బాగుపడతాయని కార్మికులు భావిస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రజలకు ఎంతో మేలు
ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా యూనియన్లు కోరుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థగా పేరొందిన ఆర్టీసీని ప్రభుత్వం నడిపితే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీలోని నష్టాలను కూడా ప్రభుత్వమే భరించాలి.
- టి.శ్రీనివాసరావు, ఎన్‌ఎంయూ చీరాల డిపో గౌరవాధ్యక్షుడు

పదవీవిరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలి
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచారు. అయితే ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు మాత్రం పెంచలేదు. ఫిట్‌మెంట్‌ కూడా తాత్కాలికంగా 25శాతం అందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని యూనియన్ల సమావేశాల్లో ప్రధాన డిమాండ్‌గా చెబుతున్నాం.
ఎస్‌.ఎలీషా, ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top