ఉహూ.. అంటే! ఓటు ఊస్టింగే!!

TDP government Fake Survey Favouring Srikakulam - Sakshi

ఓటుహక్కు... ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ దక్కాల్సిన హక్కు! ఈ హక్కును హరించడానికి అధికార టీడీపీ కొత్త గిమ్మిక్కులు మొదలెట్టింది. ఐదేళ్ల పాలనలో ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం జిల్లాలో పలుచోట్ల బోగస్‌ సర్వేలకు తెరలేచింది. పొరుగు జిల్లాల నుంచి యువతను ఇందుకోసం రంగంలోకి దించారు. సాధారణ సర్వే మాదిరిగా ప్రశ్నలు వేస్తూనే అవతలివారు ఏ పార్టీ సానుభూతిపరులో ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఏమాత్రం వైఎస్సార్‌ సీపీ వైపు మొగ్గు చూపించినా, చంద్రబాబు పాలన బాగోలేదన్నా వారి పేరు వెంటనే ట్యాబ్‌ల్లోకి చేరిపోతుంది. ఓటర్ల జాబితాలో వారి పేరు ఎక్కడ ఉందో చూసి, తొలగించేయడానికి ప్రాథమికంగా రంగం సిద్ధమైపోయినట్లే మరి!    

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అధికార పార్టీకి ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారి ఓట్లను ఎలాగైనా గల్లంతు చేసేందుకు కుట్ర పన్నుతోంది. తాజాగా నరసన్నపేటలో కొన్ని బృందాలు సర్వే పేరుతో సంచరించి హడావుడి చేశాయి. వీరిని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగిం చారు. వివిధ రకాల ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళితో కూడిన ట్యాబ్‌లతో ఎవరైనా సర్వేలకు ఇంటింటా వస్తే జాగ్రత్త వహించాలని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజలకు చెబుతూనే ఉన్నారు.

కానీ టీడీపీకి మద్దతుదారులైన కొంతమంది తెరచాటుగా పావులు కదుపుతున్నారు. కాస్త కంప్యూటరు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన యువతను సర్వే కోసం భారీ ఎత్తున నియమించారు. జలుమూరు, నరసన్నపేట, కొత్తూరు, పలాస తదితర మండలాల్లో శనివారం ఈ బృందాలు సర్వే చేశాయి. జలుమూరు మండలం పెద్దదూగాం, టి.లింగాలుపాడు, నరసన్నపేట మండలం పారిశిల్లి, బసివలస, సుందరాపురం, బాలసీమ తదితర గ్రామాల్లో సర్వే చేస్తుండగా వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్మాన కృష్ణచైతన్య, మూకళ్ల సత్యం, వాన నాగేశ్వరరావుతోపాటు జెడ్పీటీసీ ప్రతినిధి రాంబాబు, పి.రాజప్పలనాయుడు, తంగి మురళీకృష్ణ, వాన గోపి, కోన దామోదరావు, పి.విజయ్‌ తదితరులు ఈ బృందాలను అడ్డుకున్నారు. అటు నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు.

ఎంతో ధీమాగా సమాధానాలు...
తప్పుడు సర్వేలతో తమ ఓట్లకే ఎగనామం పెట్టడానికి వచ్చిన బృందాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా బృందాల్లో మాత్రం ఎలాంటి సంకోచం కనిపించట్లేదు. జలుమూరులో సర్వేకు నేతృత్వం వహించినా భాస్కర్‌ అయితే తమకు ఎలాంటి సమస్య వచ్చినా తమ బాస్‌ చూసుకుంటారని చెప్పడం గమనార్హం. 

ఎన్నికల కమిషన్‌ చర్యలు అవసరం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలపై నమ్మకం అవసరం. ప్రస్తుతం సర్వేల పేరుతో ఓటర్లను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇవ్వాలి. ప్రజలకు ఎన్నికలపై నమ్మకం పోతే ఆ ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థపై పడుతుంది. గెలుపు ఓటములు అశాశ్వతం. కాని ఎన్ని కలపై నమ్మకం ఉండాలి. ఆ దిశగా ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టాలి.   –ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ 

సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తే తప్పే 
సర్వే చేస్తున్నట్లు చూపించి నిజంగా ఓట్లను జాబితా నుంచి తొలగిస్తే అది క్షమించరాని తప్పు. ఇది నిజమైతే ఓటరుకు ఉన్న హక్కును హరిస్తున్నట్లే. ఓటరు తనకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్చ, ఎదుటి వ్యక్తిపై వున్న అభిప్రాయం నిర్భయంగా వెల్లడించే హక్కు ఉంది. సర్వే పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి పేర్లను తొలగిస్తే మాత్రం అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. –నటుకుల మోహన్, జెసిస్‌ ప్రతినిధి

ప్రజాస్వామ్యంలో ఓటర్‌ జాబితా కీలకం
ప్రజాస్వామ్యంలో ఓటర్‌ జాబితా కీలకం. అధికార పార్టీకి అనుకూ లండా ఓటర్‌ జాబితా ఉండటం, ప్రతిపక్షం పార్టీకి అనుకూలంగా, సానుభూతి పరులు ఓట్లు తోలగింపు వంటివి అప్రజాస్వామికం. ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.   దష్టి పెట్టారు. – ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య, బీఆర్‌ఏయూ పూర్వపు ఇన్‌చార్జి వీసీ  

బూత్‌కు 50 ఓట్లయినా తొలగించాలని...
అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించాలనేదీ మాపని. మా బృందంలో 16 మందిమి ఉన్నాం. బూత్‌కు 25 నుంచి 50 ఓట్లు చొప్పున తొలగించేలా సర్వే చేస్తే మాకు ఒక్కొక్కరికి రూ.900 చెల్లిస్తారు. మాకు ఇచ్చిన ట్యాబ్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఈ సర్వేలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు గుర్తిస్తాం.  –బి.భాస్కర్, సర్వే బృంద నాయకుడు 

మోసకారి చంద్రబాబు చివరి ప్రయత్నం...
ప్రజాసంకల్ప పాదయాత్రతో జగన్‌కు, మా పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణ చూసి ఓర్వలేకే మోసకారి చంద్రబాబు చేస్తున్న చివరి ప్రయత్నమే  ఇది. సర్వే పేరుతో వైఎస్సార్‌ సీపీ ఓట్లును గుర్తించి తొలగించడం ఈ సర్వేల లక్ష్యం. చంద్రబాబు, అధికార పార్టీ నాయకులు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగింపు ఎంతో దుర్మార్గమైన ఆలోచన. ప్రజాక్షేత్రంలో ఇక గెలవలేమనే భయంతో చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు అన్నదానికి ఇదే నిదర్శనం.  –ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు

ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టి సారించాలి
ఓట్ల తొలగింపు విషయంపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలి. రాష్ట్రంలో 55వేల ఓట్లు తొలగించినట్లు ప్రచా రం జరుగుతోంది. ఇప్పటికీ పలువురు యువకులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నట్లు వారి ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా వుంటున్నట్లు పలువురు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు ఓటర్లుగా చేరేందుకు అవకాశం కల్పించాలి. –పైడి వేణుగోపాలం, పోర్టు ట్రస్ట్‌ సభ్యుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top