గ్రామ సమాఖ్యలకు పచ్చదనం! | Sakshi
Sakshi News home page

గ్రామ సమాఖ్యలకు పచ్చదనం!

Published Wed, Jan 7 2015 2:40 AM

గ్రామ సమాఖ్యలకు  పచ్చదనం! - Sakshi

ఎచ్చెర్ల రూరల్: గ్రామస్థాయిలో వీలున్న అన్ని పదవులను తెలుగుదేశం కార్యకర్తలతో నింపేయాలని ఆ పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారు. ఇందుకోసం దొంగ సంతకాలు వంటి చర్యలకు సైతం దిగజారుతున్నారు. ఎచ్చెర్ల మండలంలో పొన్నాడ, ధర్మవరం సీఎఫ్(కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు)లను ఇదే రీతిలో తొలగించారు. పొన్నాడ సీఎఫ్ శ్రీనివాసరావును ఇప్పటికే తొలగించగా, తాజాగా ధర్మవరం సీఎఫ్ చెక్కా పార్వతి తొలగింపు వ్యవహారం సభ్యులంతా ఎదురు తిరగడంతో రచ్చకెక్కింది. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు గుండా కృష్ణవేణి దొంగ సంతకాలతో రూపొందించిన తీర్మానాన్ని ఎంఎంఎస్‌కు అందజేసి పార్వతిని తొలగించారని ధర్మవరం స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు ఆరోపించారు. కేశవరావుపేటలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి మంగళవారం వారంతా వచ్చి  పార్వతిని విధుల్లోకి తీసుకోవాలని, దొంగ సంతకాలతో తీర్మానాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వైఎస్‌ఆర్  కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వారిని తొలగించాలని టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలకు ఇన్నాళ్లు కష్టపడి పని చేసిన సీఎఫ్‌లు బలి అవుతున్నారని ఆరోపించారు. తొలగింపునకు గురైన కృష్ణవేణి మాట్లాడుతూ ధర్మవరం క్లస్టర్‌లో ఉన్న 37 సంఘాల్లో 31 సంఘాలు తనకు మద్దతిస్తున్నాయని, అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 సంక్షేమ పథకాల ఎరతో సంతకాలు
 తమ నుంచి సంతకాలు తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే సీఎఫ్ తొలగింపు కోసమని చెప్పలేదని సంఘాల అధ్యక్షులు స్పష్టం చేశారు. గ్యాస్ కనెక్షన్లు, రుణాలు ఇప్పిస్తామని, రుణమాఫీ వర్తింపజేస్తామని ఆశ చూపి తమ నుంచి సంతకాలు సేకరించారని ఆరోపించారు. ఉన్న పళంగా పార్వతిని తొలగించడం.. దీనికి ఆమె ఎదురుతిరిగి గత నెల 22వ తేదీన సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి ఆరా తీయడంతో ఈ విషయం బయటపడింది. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు గుండ కృష్ణవేణి గైర్హాజరైన ఈ సమావేశంలో పార్వతి మాట్లాడుతూ ఁనన్ను తొలగించాలని కోరుతూ మీరంతా సంతకాలు చేశారట.. నిజమేనా?రూ. అని ప్రశ్నించడంతో వారంతా అవాక్కయ్యారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి సంతకాలు తీసుకున్నారని వారు వివరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ పార్వతి పలువురిని కలిసినా ఫలితం లేకపోయింది. దాంతో మంగళవారం సంఘాల అధ్యక్షులతో మళ్లీ సమావేశం నిర్వహించారు. దీనికి కూడా కృష్ణవేణి హాజరుకాలేదు.
 
 కాగా సమావేశానంతరం పార్వతితోపాటు సభ్యులందరూ మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి వచ్చారు. వారు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న ఐకేపీ ఏపీఎం భాగ్యలత అక్కడి నుంచి జారుకున్నారు. ఐకేపీ ఏసీ రవికుమార్‌కు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కృష్ణవేణి కార్యాలయంలోనే ఉన్నా బయటకు రాలేదు. దీంతో కార్యాలయం బయట సంఘాల అధ్యక్షులతో కలిసి పార్వతి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్సై ఉదయకుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఏం తప్పు చేసిందని పార్వతిని తొలగించారో చెప్పాలని, గ్రామంలో నిర్వహించిన సమావేశాలకు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఎందుకు హజరుకావటం లేదని ఆందోళనకారులు నిలదీశారు. సమాధానం చెప్పేంతవరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని కార్యాలయంలోనే ఉన్న గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కృష్ణవేణిను బయటకు తీసుకువచ్చారు. ఆమె వచ్చి గ్రామ పెద్దలతో చర్చించి, సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మా గోడును వినడానికి అధికారులు లేకుండా పోయారని.. ఎవరితో చెప్పుకోవాలని సభ్యులంతా వాపోయారు.  ఈ విషయం సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎస్సై హమీ ఇవ్వటంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement