
భూ ఆక్రమదారులపై చర్య తీసుకోండి
అనంతపురం సిటీ: ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, వారిపై చర్యల తీసుకుని తమకు న్యాయంచ చేయాలని...
ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో బాధితులు
అనంతపురం సిటీ:
ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, వారిపై చర్యల తీసుకుని తమకు న్యాయంచ చేయాలని శింగనమల మండలం నాయనపల్లికి చెందిన వసుంధర, కనగానపల్లి మండలం కొండపల్లికి చెందిన గంగమ్మ వేరువేరుగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీ గ్రీవెన్స్‌లో కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు వారు వినతిపత్రాలు అందజేశారు. బాధితురాలు వ సుంధర మాట్లాడుతూ ఆరో విడత భూ పంపిణీలో భాగంగా తనకు పట్టా ఇచ్చిన 3.60 ఎకరాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వాపోయింది. తనకు కేటాయించిన ఐదెకరాలను ఆక్రమించుకున్నారని గంగమ్మ ఆవేదన వ్యక్తం చే సింది. గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ ఖాజామోహిద్దీన్, సోషియల్ వెల్ఫేర్ డీడీ రమణమూర్తి, డీఆర్‌ఓ హేమసాగర్, డీఎస్‌ఓ ఉమామహేశ్వర్‌రావు, ట్రైబల్ వెల్ఫేర్ జయరాం, గృహనిర్మాణశాఖ డీఈ లక్ష్మినారాయణమ్మ అర్జీలు స్వీకరించారు.
దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోండి..
పాత కక్షలతో నాలుగు నెలల కిందట తనపై కొందరు దాడి చేశారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేద ని కనగానపల్లి మండలం కొండపల్లికి చెందిన ముత్యాలన్న అధికారులకు విన్నవించుకున్నారు.
గిరిజన భవన్ నిర్మించండి ..
జిల్లాలో 3 లక్షల మంది ఎరికలు, గిరిజనలు నివసిస్తున్నారని వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నగర డెప్యూటీ మేయర్ గంపన్న, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత వీరాంజి తదితరులు కలెక్టర్‌ను కోరారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు గిరిజనభవన్‌ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థలాలు చూపండి..
బెళుగుప్ప మండలం శీర్పి గ్రామంలోని 69 మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, స్థలాలు మాత్రం చూపించలేదని దండోరా నాయకులు అక్కులప్ప, రాజు, తదితరులు అధికారులకు తెలిపారు. వెంటనే స్థలాలు చూపాలని కోరారు.
నాణ్యమైన దుస్తులు పంపిణీ చేయండి..
జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన దస్తులను పంపిణీ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అంజి, రాజేష్‌గౌడ్, మనోహర్‌లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సక్రమంగా కుట్టకపోవడం వల్ల దుస్తులు పాడవుతున్నాయని వారు వివరించారు.
వైద్య సేవలందించండి...
ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సక్రమంగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్నపెద్దన్న, రామక్రిష్ణ, రమణ, తదితరులు వినతిపత్రం అందజేశారు. వైద్యు లు సొంత క్లినిక్‌లు నిర్వహిస్తూ ఆస్పత్రి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిం చారు. ప్రతి చిన్న సమస్యకు కర్నూలు కు సిఫారసు చేస్తున్నారని పేర్కొన్నారు.
సొంత భవనాలు నిర్మించండి
గిరిజన బాల, బాలికల స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేక అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, సొంత భవనాలు నిర్మించి, సౌకర్యాలు కల్పించాలని గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జుననాయక్ కోరారు.