సుప్రీం తీర్పు: విలపించిన 'ఫాతిమా' విద్యార్థులు

supreme court judgment on fathima medical college-issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కడప ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థుల కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కేసు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సీట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఫాతిమా కాలేజ్‌ లోనే సీట్లు సర్దుబాటు చేయాలన్నఏపీ ప్రతిపాదనలను ఎంసీఐ తిరస్కరించింది. దీనిపై ఎంసీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు కేసును డిస్మిస్‌​ చేస్తూ తీర్పు వెలువరించింది. వంద సీట్ల సర్దుబాటుతో వచ్చే ఏడాది మెరిట్‌ విద్యార్థులకు నష్టం కలుగుతుందని న్యాయం స్థానం వెల్లడించింది. ఈ పిటిషన్‌లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు నిర్ణయంతో 'ఫాతిమా' విద్యార్థులు బోరున విలపించారు. వందసీట్లను తగ్గించుకుంటామని ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వంగా అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంతోనే కేసును కొట్టేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లు రీలొకేట్‌ చేయకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, మంత్రి కామినేని అసమర్థత వల్లే తమకు న్యాయం జరగలేదన్నారు. ఇకనైనా విద్యార్థుల సమస్యలపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తామంతా ఆత్మహత్యలు చేసుకుంటామని  తెలిపారు.

కాగా కనీస వసతులు లేని కారణంగా ఫాతిమా ప్రైవేటు వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వలేమని, 2014-15 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు భారత వైద్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే.  కళాశాల యాజమాన్యం తప్పిదానికి తమ భవిష్యత్తును ఫణంగా పెట్టడం బాధాకరమని, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top