నీరుగారిపోయిన సూసైడ్ నోట్ | suicide note | Sakshi
Sakshi News home page

నీరుగారిపోయిన సూసైడ్ నోట్

Feb 13 2016 1:42 AM | Updated on Nov 6 2018 8:22 PM

నీరుగారిపోయిన    సూసైడ్ నోట్ - Sakshi

నీరుగారిపోయిన సూసైడ్ నోట్

తీవ్ర మనో వేదనకు గురైన ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి రెండున్నరేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య    రెండున్నరేళ్లుగా ముందుకు సాగని కేసు
రైల్వే, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం    న్యాయం కోసం తండ్రి ఎదురుచూపు

  
 నరసరావుపేట టౌన్ : తీవ్ర మనో వేదనకు గురైన ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి రెండున్నరేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఎందుకు చనిపోతోంది.. అందుకు కారకులైన వారి పేర్లను ఆ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ ఘటన జరిగి రెండున్నర సంవత్సరాలు గడచిపోయినా ఆ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఇతర ఏ సాక్షాధారాలు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సూసైడ్‌నోట్ ఆధారంతో శిక్షలు వేయవచ్చని చట్టాలు చెబుతున్నాయి. అలాగే అమలు చేస్తున్నాయి.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తండ్రి దోషులను శిక్షించాలని కోరుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.స్థానిక క్రిస్టియన్‌పాలెంకు చెందిన వజ్రగిరి మోజోస్‌కు, ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరుకు చెందిన మహిళతో 2011లో వివాహమైంది. కొన్ని నెలల తరువాత భార్య, భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లి ఉంటోంది. భార్యను కాపురానికి తీసుకువచ్చేందుకు భర్త వెళ్లగా అక్కడ మరో యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ కనిపించింది. దీనిపై భర్త ప్రశ్నించగా భార్యతరఫు బంధువులు మోజెస్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన మోజెస్ 22 జులై 2013న పట్టణంలోని బాబాపేట దగ్గర గల క్రైస్తవ శ్మశానవాటిక వద్ద రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి జేబులో ఉన్న సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తన ఆత్మహత్యకు భార్య, ఆమె తల్లిదండ్రులు, మరో ఇద్దరు బంధువులు కారణమంటూ స్పష్టంగా వారి పేర్లను సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నట్లు అధికారులు గుర్తించారు.

కేసు విచారణ, నిందితులు అరెస్ట్‌కు సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో రైల్వే పోలీసులు అదే ఏడాది ఆగస్టు 8వ తేదీన కేసును సివిల్ పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేయాలని రైల్వే ఎస్పీ ద్వారా జిల్లా రూరల్ ఎస్పీకి నివేదిక పంపారు. సంఘటన చోటుచేసుకున్న ప్రాంతం టుటౌన్ పరిధిలోకి రావడంతో రూరల్ ఎస్పీ అదే నెల 20వ తేదీన ఆ స్టేషన్‌కు కేసును బదలాయించారు. అప్పటి నుంచి నేటి వరకూ కేసులో ఎటువంటి పురోగతి లభించలేదు. మృతుడి తండ్రి జయరావు ఇప్పటికే రెండు పోలీసు శాఖల ఉన్నతాధికారులను కలిసి, తన కుమారుడి ఆత్మహత్య విషయంలో న్యాయం చేయాలని విన్నవించాడు. అతని గోడు విని మిన్నకున్నారే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉన్నవారికో న్యాయం, లేనివారికో న్యాయం అన్న చందంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
 
  సూసైడ్ నోట్‌కు విలువ లేదా?
చట్టంలో సూసైడ్ నోట్‌కు ఉన్న ప్రాధాన్యతపై అనేక తీర్పులు ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకుని వేలాది కేసుల్లో శిక్షలు అమలు చేశారు. ఇంతటి బలమైన ఆధారం ఉన్న కేసులో అధికారులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. కేసు నమోదు మినహా నేటి వరకూ ఎటువంటి పురోగతి లేకపోవడం మృతుడి కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. అధికారుల నిర్లక్ష్యపు చర్య చట్టాలపై ప్రజలకు నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
 
  కేసు విచారణతో మాకు సంబంధం లేదు
సూసైడ్ నోట్ రాసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడటంతో కేసు నమోదు చేసి సాంకేతిక కారణాల వల్ల కేసును సివిల్ పోలీసులకు అప్పగించామన్నారు. కేసు విచారణ, నిందితుల అరెస్ట్ మొత్తం సివిల్ పోలీసులే చూసుకుంటారు.    - రైల్వే ఎస్‌ఐ సత్యనారాయణ
 
 ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అనంతరం చర్యలు
 మృతుడి వద్ద లభ్యమైన సూసైడ్ నోట్‌ను, అతని చేతిరాత గల పుస్తకాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. అక్కడ నుంచి నివేదిక వచ్చా చర్యలు తీసుకుంటాం.   - టూటౌన్ సీఐ సాంబశివరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement