ఉప‘కారం’..! 

Students Scholarships Are Pending In Srikakulam - Sakshi

ఉపకార వేతనాలపై ‘పల్స్‌’ ప్రభావం

గతంలో జిల్లా వ్యాప్తంగా 12, 236 మంది విద్యార్థులపై ప్రభావం

ఈ ఏడాది పెరగనున్న బాధిత విద్యార్థుల సంఖ్య

ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  

సంక్షేమ పథకాలకు కత్తెర వేసుకుంటూ వస్తున్న సర్కారు తన కత్తిని మరోమారు విద్యార్థుల వైపు తిప్పింది. విద్యార్థులకు సాయం చేయడానికి అందించే ఉపకార వేతనాలను వీలైనన్ని తీసేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు పల్స్‌ సర్వేను సాకుగా చూపిస్తున్నారు. ఇదివరకు చేసిన పల్స్‌ సర్వే ఆధారంగా దాదాపు 19 వేల మంది విద్యార్థులకు స్కాలర్‌ రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. గత ఏడాది దాదాపు 12 వేల మందికి ఇలాగే సాయాన్ని దూరం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. సాయం చేయాల్సింది పోయి ఇలా కక్షపూరితంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

రాజాం/పాలకొండరూరల్‌ : ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తీసేసి.. ప్రజా సంక్షేమ పథకా లను తగ్గిస్తూ వస్తున్న టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఉపకార వేతనాలపై మళ్లీ గు రి పెట్టింది. నిబంధనలను మార్చుతూ కోత వేయడానికి సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 2015–16 ఆర్థిక సంవత్సరం వరకూ అన్ని గ్రామాల్లోని మహిళా సం ఘాలకు సంబంధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేవి. 2016–17 విద్యాసంవత్సరంలో మాత్రం పల్స్‌ 

సర్వే ప్రామాణికంగా స్కాలర్స్‌ ఇచ్చారు. ఫలితంగా ఆ ఏడాది 9–12 తరగతుల విద్యార్థులు 12 వేల మందికి మొండిచేయి ఎదురైంది. వీరంతా పల్స్‌ సర్వేలో లేరని సర్కారు చెప్పింది. అయితే మహిళా సంఘాల సభ్యులు అప్పట్లోనే దీనిపై మండిపడ్డారు. సంఘాల్లో ఉన్నా స్కాలర్లు ఇవ్వలేదని బహిరంగంగానే ఆరోపించారు.

పెరగనున్న సంఖ్య..
నెలరోజుల కిందట విద్యార్థులకు ఇచ్చిన ఉపకార వేతనాలు నిజానికి 2016–17 విద్యాసంవత్సరం చివరిలో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఏడాది కాలంపాటు తాత్సారం చేశారు. చివరకు 12 వేలమందిని రిజెక్ట్‌లో పెట్టేశారు. తాజాగా ఈ ఏడాది (2017–18) విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంతవరకూ ఉపకార వేతనాలు అందించలేదు. ఈ ఉపకార వేతనాలు వచ్చే విద్యాసంవత్సరంలో అందించనున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరంలో 12 వేల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులను బాధితులుగా చేయనున్నారు. దీనికి కూడా మళ్లీ ‘పల్స్‌’నే సాకుగా చూపెట్టనున్నారు.  

ఆందోళనలో విద్యార్థులు..
ఏటా అర్హత గల విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తూ పోతుండడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఊడుతుందో తెలీకపోవడం, అనర్హతకు నిర్దిష్టమైన కారణాలు చూపకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. మహిళా సంఘాల సభ్యులు తాము సంఘాల్లో ఉన్నా పిల్లలకు స్కాలర్‌ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా ఉపకార వేతనాలు అందాల్సిన మొత్తం విద్యార్థులు                        :     1,04,698 మంది 
వీరికి అందించాల్సిన మొత్తం                                                                        :     రూ. 12,56,37,600 
2016–17 విద్యాసంవత్సరంలో గుర్తించిన విద్యార్థులు                                        :     92,462 మంది. 
వీరికి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది                                                               :     రూ.11,09,54,400
2016–17 విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలకు నోచుకోని బాధిత విద్యార్థులు     :     12,236,
వీరికి చెల్లించాల్సిన మొత్తం                                                                           :     రూ. 1.46,83,200 
ఉపకార వేతనాలు అందించే తరగతులు                                                           :     9 నుంచి 12వ తరగతి వరకూ 
ఒక్కో విద్యార్ధికి ఏడాదికి ఇచ్చేది                                                                     :     రూ. 1200లు 
2017–18 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఈ పధకానికి అర్హులైన విద్యార్థులు  : 1,12,384 మంది (అంచనా వివరాలు).
పల్స్‌ సర్వేలో ప్రస్తుతం అంచనాల ప్రకారం స్కాలర్‌ రాని విద్యార్థులు                         :     19 వేల మంది 

ఉపకార వేతనం రాలేదు..
నాకు ఉపకార వేతనం రావాల్సి ఉంది. కానీ రాలేదు. మా అమ్మ మహిళా సంఘంలో ఉంది. అయినా ఎందుకు ఇవ్వలేదని అర్థం కాలేదు. అడిగితే ఇప్పుడు నెట్‌లో అప్లై చేయమంటున్నారు.         - సీహెచ్‌.జీవన్‌కుమార్, 9వ తరగతి విద్యార్థి

మాకు రాలేదు.. 
మాకు ఉపకార వేతనం ఇంతవరకూ రాలేదు. దీంతో ఇబ్బందిగా ఉంది. ఈ ఉపకార వేతనం వస్తే పదో తరగతి పుస్తకాలు కొనుక్కుందామని అనుకున్నాను. ఇంతవరకూ ఇవి రాలేదు. నాపేరు కూడా లిస్టులో లేదని అంటున్నారు. 
– ఆబోతులు గణేష్, పాలకొండ. 

పేరు ఉన్నా డబ్బులు రాలేదు..
ఉపకార వేతనాలకు సంబంధించి నాకు ఈ ఏడాది డబ్బులు రాలేదు. మా స్నేహితులకు వచ్చాయి. ఈ వేతనాలకు సం బంధించి నెట్‌లో నా పేరు ఉంది. కానీ డబ్బులు రాలేదు. 
– వారణాశి పావని, కాకరాపల్లి, సంతకవిటి మండలం.

చర్యలు తీసుకుంటున్నాం..
మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు చెందిన విద్యార్థులకు ఏటా అందిస్తున్న ఉపకార వేతనాల్లో ఈ ఏడాది కొంతమందికి రాని విషయం వాస్తవమే. పల్స్‌ సర్వేను ప్రామాణికంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. బాధిత విద్యార్థులు 12 వేల మందికి పైబడి ఉన్నారు. వీరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.                           
– డి.సీతారామయ్య, వెలుగుశాఖ డీపీఎం, శ్రీకాకుళం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top