పంచుకుందాం.. ఫైబర్‌ గ్రిడ్‌ | State Govt Scam in the Fiber grid | Sakshi
Sakshi News home page

పంచుకుందాం.. ఫైబర్‌ గ్రిడ్‌

Jun 17 2018 3:19 AM | Updated on Nov 9 2018 5:56 PM

State Govt Scam in the Fiber grid - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవినీతి విశృంఖలంగా విజృంభిస్తోంది. ఏ ప్రాజెక్టు చేపట్టినా కోట్లాది రూపాయలు కొల్లగొట్టేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. తాజాగా ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టులో భారీ దోపిడీకి తెరతీశారు. కేంద్ర నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వందల కోట్లు కొట్టేయడానికి పావులు కదిపారు. టెండర్‌ నిబంధనలు నుంచి కాంట్రాక్టు ఖరారు వరకు తమ అస్మదీయ, బినామీ సంస్థలకు అనుకూలంగా ముఖ్య నేత కథ నడిపారు. మూడు సంస్థలకు రూ. 2,200 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టి.. తద్వారా వందల కోట్లలో కమీషన్లు వెనకేసుకునేందుకు ప్రణాళిక రచించారు. ఇలాంటి కాంట్రాక్టు విషయంలో మహారాష్ట్ర  కంటే 50 శాతం అధికంగా టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయించారు. దీంతో రూ.765.31 కోట్లు పచ్చ చొక్కాల జేబుల్లోకి వెళ్లనున్నాయి. 

సొమ్ము కేంద్రానిది.. అవినీతి ముఖ్యనేతది
దేశంలో గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్‌ కార్యక్రమాన్ని రూపొందించింది. హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు ఫోన్, కేబుల్‌ టీవీ సేవలను కలిపి అందించాలన్నది ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశంలో ప్రజలు చెల్లిస్తున్న సెల్‌ఫోన్‌ బిల్లులో 5 శాతం సెన్సును భారత్‌నెట్‌ పథకానికి మళ్లిస్తున్నారు. అలా వసూలు చేస్తున్న సెస్సు మొత్తం రూ. 48 వేల కోట్లతో భారత్‌నెట్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఏ రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న సెస్సును ఆ రాష్ట్రాలకే కేటాయించనున్నారు. ఫైబర్‌గ్రిడ్‌ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) ఏర్పాటు చేసింది. ఫైబర్‌గ్రిడ్‌ మొదటి దశలో ప్రయోగాత్మకంగా జిల్లా, మండల కేంద్రాలను అనుసంధానిస్తూ ఫైబర్‌ గ్రిడ్‌ కేబుళ్లు వేసేందుకు టెండర్లు పిలిచారు. రెండో దశ కింద రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల కి.మీ. మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు వేయాలని రాష్టప్రభుత్వం నిర్ణయించింది. 2 వేల కి.మీ. మేర భూగర్భ కేబుళ్లు, 58 వేల కి.మీ. మేర విద్యుత్తు స్తంభాల మీదుగా ఏరియల్‌ కేబుళ్లు వేయాలన్నది ప్రణాళిక. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 12,281 గ్రామ పంచాయతీల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు వేయాలని నిర్ణయించారు. ఈ పనుల కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపట్టింది.

మూడు సంస్థలకు అనుకూలంగా... 
అన్నింటికీ అంతర్జాతీయ ప్రమాణాలు అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టుకు మాత్రం దేశీయ మంత్రాన్ని జపించారు. విదేశీ సంస్థలు రాకుండా అడ్డుకట్ట వేశారు. ఇప్పటికే ఫైబర్‌ గ్రిడ్‌ మొదటి దశ పనులు చేస్తున్న తమ అస్మదీయ సంస్థలకే రెండో దశ టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారు. ఏదైనా సంస్థ తనకుతాను గానీ గరిష్టంగా మూడు సంస్థలు కన్సార్టియంగా గానీ ఏర్పడి టెండరు దాఖలు చేయొచ్చంటూ నిబంధనల్లో పేర్కొన్నారు. ఒక్క సంస్థే అయితే కనీసం ఐదేళ్లలో, కన్సార్టియం అయితే రెండేళ్లలో దేశంలో ఫైబర్‌ కేబుళ్లు వేసిన అనుభవం ఉండాలన్నారు. టెండరు దాఖలు చేసేనాటికి కనీసం 8 వేల కి.మీ. మేర కేబుళ్లు వేసిన అనుభవం కావాలని పేర్కొన్నారు. టెలికాం, ఐసీడీ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి కనీసం రూ.1,500 కోట్ల టర్నోవర్‌ ఉండాలి.. అనే నిబంధనల ద్వారా అంతర్జాతీయ సంస్థలను. అస్మదీయ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారు. 

మూడు సంస్థలకు పనుల సర్దుబాటు
ముఖ్యనేత ఆశీస్సులతో ఆయన సన్నిహితులు, బినామీలకు చెందిన మూడు సంస్థలే ఫైబర్‌ గ్రిడ్‌ రెండో దశ పనులకు టెండర్లు దాఖలు చేశాయి. వాటిలో ఒకటి ముఖ్యనేతకు సన్నిహితమైన బడా కార్పొరేట్‌ సంస్థ. ఆ సంస్థ మూడు ప్యాకేజీలకు కలిపి రూ. 2,200 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచింది. ఇక రెండో సంస్థ ప్రభుత్వ ముఖ్యనేతకు.. దేశంలోనే బడా కార్పొరేట్‌ సంస్థకు అనుసంధానకర్తగా వ్యవహరించే కార్పొరేట్‌ ప్రముఖుడిది. ఈ సంస్థ మూడు ప్యాకేజీలకు కలిపి రూ. 2,400 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి ఎల్‌–2గా నిలిచింది. మూడో సంస్థ ముఖ్యనేత బినామీగా హైదరాబాద్‌లో ఉండే వారిది. ఆ సంస్థ మూడు ప్యాకేజీలకు కలిపి రూ. 2,500 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి ఎల్‌–3గా నిలిచింది. దీంతో కాంట్రాక్టును రూ. 2,200 కోట్లుగా నిర్ణయించి.. అస్మదీయ సంస్థలు మూడింటికి ఒక్కో ప్యాకేజీ పనులు ఇవ్వాలని ఒప్పందానికి వచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పిన ఓ ఉన్నతాధికారిని తప్పించి ఆయన స్థానంలో తమకు అనుకూలంగా ఉండే మరో ఉన్నతాధికారిని నియమించారు. అస్మదీయ సంస్థలకు ఆ కాంట్రాక్టును ఖరారు చేస్తూ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement