తీరంపై డేగకన్ను

State Government Has Alerted By Central Intelligence Agencies Warning That Terrorists Coming To Andhrapradesh - Sakshi

తీరం అప్రమత్తమైంది. ఉగ్రమూకల చొరబాట్లను అడ్డుకునేందుకు.. ఎగిసి పడుతున్న అలల మధ్య డేగ    కళ్లతో పహారా కొనసాగుతోంది. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను అలర్ట్‌ చేసింది. ఈ క్రమంలో పోర్టులు, హార్బర్లకు పడవల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్జన ప్రదేశాల్లో సైతం పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మెరైన్‌ పోలీసులు సముద్ర వేటకు వెళ్లే జాలర్లకు అవగాహన కల్పిస్తూ నిరంతరం గస్తీ కాస్తున్నారు. 

సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల కోస్ట్‌గార్డ్, పోలీస్‌ ఉన్నతాధికారులను నిఘా వర్గాల సూచనల మేరకు తీర ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల మేరకు రేంజ్‌ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సముద్రతీర ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మెరైన్‌ పోలీసులను ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలని రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆదేశించారు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిరంతర పహారా..
తీర ప్రాంతలో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు చొరబాట్లుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత నిఘా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. నిర్జీవన ప్రదేశాలపై కూడా నిఘా ఉంచారు. ఆధునిక మరబోట్లపై సముద్రంలో గస్తీ నిర్వహిస్తూ జాలర్లను అప్రమత్తం చేసి వారికి అవగాహన కల్పించే మెరైన్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. 

రాకపోకలపై ప్రత్యేక దృష్టి..
పోర్టులు, హార్బర్‌లకు రాకపోకలు కొనసాగించే  పడవలు, బోట్లు, సముద్రంలో లంగరు వేసి ఉంచిన నౌకలపై కూడా దృష్టి సారించారు. ప్రసుత్తం ఉన్న బలగాలతో పాటుగా ఉగ్రవాదుల సమాచారం సేకరించే కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం రంగంలోకిదిగింది. మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది విధిగా వారికి కేటాయించిన పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా సమాచారం సేకరించుకోవాలని నిఘా వర్గాలు సూచనల మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు ముందస్తు చర్యల గురించి ఆరా తీశారు.

జాలర్లకు అవగాహన.. 
గతంలో మన జాలర్ల ఇచ్చిన సమాచారం మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు అక్రమంగా దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు గుర్తించిన కోస్ట్‌గార్డ్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని జాలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎలాంటి ఆనవాళ్లు గుర్తించినా వెంటనే తమకు సమాచారం అదించాలని సూచిస్తున్నారు. గుంటూరు రేంజ్‌ పరిధిలో సుమార్‌ 190 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా జిల్లాలో 43 కిలోమీటర్లు ఉంది. సూర్యలకం, నిజాంపట్నంలో మెరైన్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్క నిజాంపట్నం హార్బర్‌లో 218 బోట్లు ఉంటే దాదాపు 200 బోట్లు నిత్యం చేపల వేటలో ఉంటాయి. ఇందులో 20 నుంచి 25 బోట్లు డైలీ సముద్రంలో వేట ముగించుకుని హార్బర్‌కు వస్తుంటాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top