ట్రిపుల్‌ ఐటీని వీడని కష్టాలు!

Srikakulam IIIT Building Constructions Still Pending - Sakshi

అద్దె భవనాల్లోనే తరగతులు

నత్తనడకన పక్కా భవనాల నిర్మాణాలు

మరో ఇంజినీరింగ్‌ కళాశాలను అద్దెకు తీసుకునే ప్రయత్నం

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ప్రగతిపై దృష్టిపెట్టని పాలకులు

రాష్ట్ర విభజన సమయంలో శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన ఏకైక విద్యా సంస్థ ట్రిపుల్‌ ఐటీ ప్రగతిపై పాలకులు దృష్టిపెట్టలేదు. ఈ విశ్వవిద్యాలయాన్ని కష్టాలు వీడలేదు. ప్రధానంగా భవనాల కొరత వెంటాడుతోంది. ఏళ్ల తరబడి భవనాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. దీంతో అద్దెభవనాలే విద్యార్థులకు దిక్కయ్యాయి.  

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌:శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాన్ని 2016 అక్టోబర్‌ పదో తేదీన ఎస్‌.ఎం.పురంలో ఉన్న 21వ శతాబ్ది గురుకుల భవనాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రారంభించారు. అలాగే 199.08 ఎకరాల స్థలాన్ని ట్రిపుల్‌ ఐటీ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పటికీ విద్యా సంస్థకు సరిపడే వసతిని మా త్రం సర్కార్‌ కల్పించలేకపోయింది. ప్రస్తుతం 2001లో నిర్మించిన గురుకుల భవనాల్లోనే విద్యార్థినులకు వసతి, తరగతులు నిర్వహిస్తున్నారు.

పరిస్థితి ఇలా..
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో మూడు వేల మంది విద్యార్థులతో తరగతులు కొనసాగాలి. మొదటి బ్యాచ్‌ 2016–17 విద్యా సంవత్సరంలో 1000 మందికి ప్రవేశాలు  కల్పించి.. నూజివీడులోతరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) పూర్తి చేసుకొని నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ మొదటి ఏడాదిలో  ప్రవేశించారు. న్యూజివీడులోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఈ విద్యార్థులను శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీకి తరలించే అవకాశాలు కనిపించడం లేదు. నూజివీడులోనే విద్యార్థులను విడిచి పెట్టే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఎలాంటి చర్యలు అధికారులు తీసుకుంటారో తెలియని పరిస్థితి.

2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో వెయ్యి మందికి ప్రవేశాలు కల్పించారు. 2017 ఆగస్టులో వీరికి ప్రవేశాలు కల్పించగా, 2018 జనవరిలో ఈ బ్యాచ్‌ను శ్రీకాకుళం షిప్టు చేశారు. ఎస్‌.ఎం.పురం క్యాంపస్‌లో బాలికలకు, అద్దెకు తీసుకున్న చినరావుపల్లి మిత్రా ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లో పురుషులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ పీయూసీ రెండో ఏడాది తరగతులు రెండు క్యాంపస్‌ల్లో జరుగుతున్నాయి.

2018–19 ఏడాదికి గత ఏడాది ఆగస్టులో 1000 మందికి  పీయూసీ మొదటి ఏడాదిలో ప్రవేశాలు కల్పించారు. ప్రస్తుతం ఈ వెయ్యి మందికి నూజివీడులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో మూడు వేల మందితో ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది, పీయూసీ మొదటి, రెండో ఏడాది తరగతులు నిర్వహించాలి. అయితే తగినన్ని భవనాలు లేకపోవడంతో కేవలం రెండో ఏడాది పీయూసీ తరగతులు మాత్రమే ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీటిని కూడా రెండు క్యాంపస్‌ల్లో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎస్‌.ఎం.పురం పంచాయతీ పరిధిలోని 112 సర్వే నంబర్‌లో 8 బ్లాక్‌తో కూడిన గురుకుల భవనాలతో పాటు స్థలాలను కలిపి 199.08 ఎకరాలను ట్రిపుల్‌ ఐటీ కోసం సర్కార్‌ కేటాయించింది. గత ఏడాది ఆగస్టు నాటికి కనీసం 2000 మందికి సరిపడా వసతి, తరగతి నిర్వహణ ఏర్పాట్లు పూర్తచేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భవన నిర్మాణ పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది తరగతులకు సైతం ఇబ్బందులు తప్పేలాలేదు.

బిల్లుల చెల్లింపులో సమస్యలు!
భవనాల నిర్మాణం నత్తనడకన సాగడానికి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం కూడా కారణంగా తెలిసింది. ప్రస్తుతం రూ.86.74 కోట్లుతో భవనాల నిర్మాణం జరుగుతోంది. అయితే శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ కోసం అంటూ ప్రత్యేక నిధులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో నూజివీడు నుంచి నిధులు తెచ్చి ఖర్చు చేస్తున్నారు.

అద్దె భవనాల్లో తరగతులు
ప్రస్తుతం చినరావుపల్లి సమీపంలో మూత పడిన మిత్రా ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలను అద్దెకు తీసుకోని పీయూసీ రెండో ఏదాది పురుషుల తరగతులను అందులో నిర్వహిస్తున్నారు. నెలకు రూ. 4.20 లక్షలు అద్దెగా చెల్లిస్తున్నారు. రెండేళ్ల లీజు పూర్తయ్యింది. ప్రస్తుతం నూజివీడులో ఉన్న మొదటి పీయూసీ 1000 మంది విద్యార్థులను శ్రీకాకుళం తరలించే కసరత్తులు అధికారులు చేస్తున్నారు. అయితే వసతి కొరత ఉండడంతో  చిలకపాలెంలో మూతపడిన శివానీ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ భవనాలను పరిశీలిస్తున్నారు. టెండర్ల ఆహ్వానం కూడా పూర్తయ్యింది. అయితే వెయ్యి మందికి తరగతులు, వసతికి సరిపడుతోందా..లేదా అనేది నిపుణల కమిటీ నిర్థారించాల్సి ఉంది. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉంటే నెలకు రూ. 5 లక్షలు అద్దెగా చెల్లించి ఫిబ్రవరిలో నూజివీడు నుంచి ఇక్కడకు విద్యార్థులను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీ భవనాల నిర్మాణాలు మాత్రం అనుకున్న స్థాయిలో జరగటం లేదు. మరో క్యాంపస్‌ అద్దెకు తీసుకుంటే మూడు క్యాం పస్‌లు నిర్వహించ వల్సి ఉంటుంది. 2016 నుంచి ముందు చూపుతో వ్యవహరిస్తే పూర్తిస్థాయి తరగతులు నిర్వహనకు భవనాలు సిద్ధమయ్యేవి. అద్దెభవనాలు తీసుకున్నా ఇంజినీరింగ్‌ మొదటి బ్యాచ్‌ మాత్రం పూర్తిగా రిలీవ్‌ అయ్యే వరకు నూజివీడులోనే వదిలేసే అవకాశాలు కపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top