కోవిడ్‌పై పోలీసులు అప్రమత్తం

SPSR Nellore Police Awareness on Face Masks - Sakshi

స్టేషన్లలో కరోనా సోకకుండా చర్యలు

భౌతిక దూరం పాటిస్తూ ఫిర్యాదుల స్వీకరణ

నెల్లూరు(క్రైమ్‌): పోలీస్‌ శాఖలో కరోనా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారినపడి ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌ ఉన్నతా«ధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించడంతో పాటు పోలీస్‌స్టేషన్లలో కరోనా సోకకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

ద్రావణం పిచికారీ
లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వర్తించారు. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, పలువురికి కరోనా సోకడంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. ప్రతి పోలీస్‌స్టేషన్లో సోడియం హైపోక్లోరైట్‌తో పిచికారీ చేయిస్తున్నారు. విధి నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

జాగ్రత్తలు పాటిస్తూ విధులు
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్‌ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. స్టేషన్లలో శానిటైజర్లను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, ఇతరులు విధిగా చేతులను శుభ్రం చేసుకున్నాకే అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారి సమస్యలను వినడం, ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా వివిధ కేసుల్లో నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చిన వెంటనే అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్ల వద్ద మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. స్టేషన్‌ బయటే షామియానాలు, కుర్చీలు వేసి ఫిర్యాదుదారులను కూర్చోబెడుతున్నారు. అక్కడే వారి సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో తగు జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు.

మాస్క్‌ల వినియోగంపై విస్తృత అవగాహన
కరోనా విస్తరించకుండా ప్రణాళికలు రూపొందిస్తూనే ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాస్కుల్లేకుండా రోడ్లపైకి వచ్చే పాదచారులు, వాహనదారులకు  జరిమానాలు విధించడంతో పాటు వారికి మాస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వేళ తగు జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము రక్షించుకోవడంతో పాటు ప్రజారక్షణలో పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top