వెలిగొండ పనులు వేగవంతం

Speed up of Veligonda Project Works - Sakshi

సీఎం దిశానిర్దేశంతో జూలై నాటికి తొలిదశ పనుల పూర్తికి కార్యాచరణ 

మొదటి టన్నెల్‌లో రోజుకు సగటున 7.5–8 మీటర్ల చొప్పున పనులు..  

రేపటి నుంచి హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు

సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. మొదటి టన్నెల్‌లో రోజుకు సగటున 7.5–8మీటర్ల చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన ఇందులో మిగిలిన 940 మీటర్ల పని 117 రోజుల్లో పూర్తవుతుంది. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 836.20 అడుగులకు తగ్గిపోవడంతో వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను సోమవారం ప్రారంభించనున్నారు. మూడున్నర నెలల్లో వీటిని పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. అంతేకాక.. 
- టన్నెల్‌ నుంచి ప్రధాన కాలువకు నీటిని తరలించే లింక్‌ కెనాల్‌ పనులను  వేగవంతం చేశారు.  
- 53.85 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల పరిధిలోని 4,617 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులపై కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు.  
- జూలై నాటికి వీటిని పూర్తిచేసి ఆగస్టులో కృష్ణా వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టి వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు.  
- రెండో టన్నెల్‌ పనులకు సంబంధించి టీడీపీ హయాంలో కాంట్రాక్టర్‌కు దోచిపెట్టిన రూ.61.76కోట్లను వైఎస్‌ జగన్‌ సర్కారు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖజానాకు ఆదా చేసింది. 

పునరావాసంపై ప్రత్యేక దృష్టి 
ఇక నల్లమలసాగర్‌ ముంపు గ్రామాల్లోని 4,617 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిర్వాసితులకు పరిహారం అందించి.. వారిని పునరావాస కాలనీలకు తరలించే పనులను జూలైలోగా పూర్తిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సకాలంలో పనులను పూర్తిచేయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరదను రోజుకు 11,581.68 క్యూసెక్కుల చొప్పున 45 రోజుల్లో 43.50 టీఎంసీలను తరలిస్తారు. తద్వారా దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. అలాగే, 15.25 లక్షల మంది దాహార్తిని తీరుస్తారు.   

సీఎం పర్యటనతో పనులు మరింత వేగం 
వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే.. 
- గడువులోగా పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి.. జూలై నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలన్నారు. 
- నిజానికి మొదటి టన్నెల్‌లో ఫిబ్రవరి 20 వరకు రోజుకు 6.5–7 మీటర్ల చొప్పున పనులు జరిగేవి. సీఎం పర్యటన తర్వాత అవి వేగం పుంజుకున్నాయి. రెండో టన్నెల్‌ను కూడా 2021కి పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top