ప్రాణాంతకమైనా పడవ ఎక్కాల్సిందే..

Special Story On Boat Accidents In East Godavari - Sakshi

రహదారికి నోచుకొని పలు గ్రామాలు

అటు ఏజెన్సీలోనూ, ఇటు కోనసీమలోనూ ఇదే దుస్థితి

ప్రత్యామ్నాయం చూపని పాలకులు

అధునాతన రహదారులు ఎన్ని అందుబాటులోకి వచ్చినా అవేమీ వారికి అక్కరకు రావు. అటు ఏజెన్సీలో కావచ్చు, ఇటు కోనసీమలో కావచ్చు.. ఇప్పటికీ అనేక  గ్రామాలకు రహదారులు లేవు. విద్య, వైద్యం, నిత్యావసరాలు.. ఇలా అవసరం ఏదైనా వారు నదులనో, నదీ పాయలనో, కాలువలనో నిత్యం దాటి వెళ్లి రావాల్సిందే. ఇందుకు నాటు పడవలే దిక్కు. వాటిలో కనీసం లైఫ్‌ జాకెట్ల వంటి రక్షణ ఏర్పాట్లు కూడా ఉండవు. పైగా పడవ సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. మార్గం మధ్యలో ఏదైనా జరగరానిది జరిగితే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే. మే 15న దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడి 19 మంది మృత్యువాత పడ్డారు. ఆ ఘటనను మరువక ముందే ఐ. పోలవరం మండలం వృద్ధ గౌతమి పాయలో పశువుల్లంక– సలాదివారిలంక మధ్య శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులతో సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ క్రమంలో జిల్లాలో నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగించే రేవుల్లో భద్రతను పరిశీలిద్దాం.

కూనవరం/వీఆర్‌పురం: కూనవరం – పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట గ్రామాల మధ్య గోదావరి నదిపై ప్రయాణికులను దాటించే ఫెర్రీ నిర్వహణ దారుణంగా ఉందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.లక్షల్లో పాట పాడుకొని ఆ సొమ్ము ఎప్పుడు రాబట్టుకుందామా అనే యావ తప్ప పాటదారుడికి ప్రయాణికుల కనీస భద్రత పట్టదు. నాలుగు విలీన మండలాల ప్రజలు, వేలేరుపాడు, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం మండలాలకు రాకపోకలు సాగించాలంటే ఈ రేవు ఒక్కటే మార్గం.  సీజన్‌లో రోజుకు సుమారు 500 నుంచి వెయ్యి మంది ఈ ఫెర్రీ పాయింట్‌ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కేవలం 20  మంది సామర్థ్యం కలిగిన  ఇంజన్‌ పడవలో పరిమితికి మించి 50 మందిని పైగా ఎక్కిస్తారు. మూడు నుంచి నాలుగు మోటార్‌ సైకిళ్లు కూడా అందులో  ఉంటాయి. గోదావరి నిండుగా ప్రవహించే సమయంలో సైతం పాటదారుడు లాంచీ ఏర్పాటు చేయడు. మర పడవలో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రేవు దాటాల్సిందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫెర్రీ పాయింట్‌లో లాంచీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో శనివారం నుంచి పడవ ప్రయాణాన్ని పాటదారుడు నిలిపి వేశాడు .అలాగే మండలంలోని పోచవరం పంచాయతీలోని  పోలిపాక – ఇంజరం గ్రామల మధ్య నడిపే మరపడవ వద్ద సైతం భద్రాతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు లేవని ప్రయాణికులు చెబుతున్నారు.

రహదారులు లేని గ్రామాలు నాలుగు
వీఆర్‌ పురం (రంపచోడవరం): వీఆర్‌ పురం మండలంలోని తుమ్మిలేరు పంచాయతీ పరిధిలోని రహదారి మార్గం లేని నాలుగు గ్రామాల్లో 661 మంది ప్రజలు జీవిస్తున్నారు.  తుమ్మిలేరులో 87 కుటుంబాలకు చెందిన 300 మంది, కొండేపూడిలో 19 కుటుంబాలకు చెందిన 70 మంది, కొల్లూరులో 32 కుటుంబాలకు చెందిన 153 మంది, గొందూరులో 30 కుటుంబాలకు చెందిన 138 మంది ఉన్నారు. ఈ నాలుగు గ్రామాల ప్రజలకు ఏ అవసరం వచ్చినా పడవ ఎక్కి గోదావరి నదిలో 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తేనే బాహ్య ప్రపంచమైన పోచవరానికి  చేరుకునేది. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్ల దూరం ఆటోలో  ప్రయాణిస్తే  మండల కేంద్రం రేఖపల్లి చేరుకుంటారు. ప్రతి సోమవారం వీఆర్‌ పురం వారపు సంతకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుంటారు. వచ్చిన పడవపైనే తిరిగి వెళుతుంటారు. దేవీపట్నం మండలం మంటూరు లాంచీ ప్రమాదం తరువాత ఈ ప్రాంతంలో రోజుకు ఒక పర్యాయం చొప్పున గోదావరి నదిలో తూర్పు ,పశ్చిమ  గోదావరి జిల్లాలోని 20 గ్రామాలను కలుపుతూ రాకపోకలు సాగించే సర్వీస్‌ బోట్‌ను అధికారులు నిలిపివేశారు. 

లంక గ్రామాల వారిదీ అదే దుస్థితి
పి.గన్నవరం: నియోజకవర్గంలో నదీ పాయలపై వంతెనలు లేకపోవడంతో లంక గ్రామాల ప్రజలు ప్రమాదం అంచున పడవలపై ప్రయాణిస్తున్నారు. పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవులో వరద ఉద్ధృతికి రహదారి కొట్టుకుపోవడంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారి లంకల ప్రజలు ప్రమాదకర స్థితిలో పడవలపై వెళుతున్నారు. ఈ గ్రామాల్లో ఐదు వేల మంది నివశిస్తున్నారు. వరదల సీజన్లో మూడు నెలల పాటు విద్యార్థులు రోజూ పడవలపై ప్రయాణించి పాఠశాలలు, కళాశాలలకు వెళతారు. విద్యార్థులు ఇళ్లకు తిరి గి వచ్చేవరకూ తల్లిదండ్రులు ఆందోళనతో ఉంటున్నారు.  వంతెన నిర్మించేందుకు 2014లో శంకుస్థాపన చేసిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మామిడికుదురు మండలంలో కరవాక–ఓడలరేవు, గోగన్నమఠం–బెండమూర్లంక, పెదపట్నంలంక–కె.ముంజవరం, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం–కోటిపల్లి రేవుల్లో నిత్యం వేలాది మంది ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులోని అయోధ్యలంక, ఆనగర్లంక, పెదమల్లంక గ్రామాల ప్రజలు కూడా వరదల సమయంలో పడవలను ఆశ్రయిస్తున్నారు.

2012లో ఐదుగురి మృతి
పి.గన్నవరం మండలం ఎల్‌.గన్నవరం వద్ద వశిష్ట నదీ పాయలో 2012 నవంబర్‌ 18వ తేదీ సాయంత్రం ఇంజన్‌ బోటు అదుపుతప్పి మత్స్యకార కుటుంబాలకు చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు.

ప్రయాణం.. ప్రమాదం
చింతూరు (రంపచోడవరం): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య సీలేరు నదిలో ప్రజలు ప్రాణాంతక పరిస్థితుల్లో నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు.  చింతూరు మండలంలోని పొల్లూరుకు ఆవలి ఒడ్డున ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలోని తగరికోట, తొంగూడెం, పూసగూడెం, మన్నెంకొండ, పొల్లూరు గ్రామాల ప్రజలు నాటు పడవలపై సీలేరు నదిని దాటుతున్నారు. పొల్లూరు, మోతుగూడేల్లో నివాసముంటున్న చాలామంది నదిని దాటి ఒడిశాకు వెళుతుంటారు. ఆయా గ్రామాల ప్రజలకు ఎలాంటి పని ఉన్నా పొల్లూరు, మోతుగూడెం రావాల్సిన పరిస్థితి తప్పడం లేదు. వారు రాజమహేంద్రవరం, భద్రాచలం వంటి పట్టణా లకు వెళ్లాలన్నా పడవలపై నదిని దాటాల్సిందే. కాగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు తోడు పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం నుంచి వదులు తున్న నీటితో సీలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ఉద్ధృతిని కూడా లెక్కచేయకుండా నాటు పడవల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. 

దినదిన గండంగా..
దేవీపట్నం (రంపచోడవరం): దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలోని మంటూరు, తున్నూరు, కొండమొదలు పంచాయతీల పరిధిలోని 20 గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం లేదు. ఏడు వేల జనాభా కలిగిన ఈ గ్రామాల ప్రజలు తెల్లవారితే పడవ ప్రయాణం చేయాల్సిందే. వీరంతా గిరిజనులే.  దేవీపట్నం రావాలంటే కనీసం మూడు గంటల పాటు పడ వ ప్రయాణించాలి. ఈ గ్రామాల ప్రజలు రహదారి ప్రయాణం చేయాలంటే కొండమొదలు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వైపున గల శివగిరికి, మంటూరు నుంచి వాడపల్లికి పడవపై దాటుకుని వెళ్లాలి. ఆయా తీర గ్రామాలకు లింకు రోడ్లు కూడా లేనందున పక్క గ్రామానికి పోవా లన్నా పడవ ప్రయాణమే దిక్కు. దేవీపట్నం నుంచి అవతల ఒడ్డున గల సింగనపల్లికి తిరిగే ఫెర్రీ రేవు పడవ ద్వారా రోజూ 500 మంది వరకూ నాటు పడవ ద్వారానే ప్రయాణం చేస్తా రు. దేవీపట్నం వైపు నుంచి పోలవరం ప్రాజెక్టులో పనిచేసేందుకు రోజూ సుమారు 300 మంది రోజువారీ కూలీలకు పడవ ప్రయాణమే దిక్కు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top