రాష్ట్ర విభజన పాపం యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు తీవ్రంగా విమర్శించారు.
పాయకరావుపేట/ నక్కపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు తీవ్రంగా విమర్శించారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా శనివారం పాయక రావుపేట పట్టణంలో జరిగిన షర్మిల బహిరంగ సభలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావులు విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీల తీరుపై మండిపడ్డారు.
జగన్ ప్రభంజనాన్ని ఓర్వలేకే విభజన: కొణతాల
సభకు హాజరైన వేలాది మందినుద్దేశించి కొణతాల మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని, ప్రజల్లో జగన్ మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను తట్టుకోలేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై విభనను తెరమీదకు తెచ్చాయన్నారు. రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా తయారైందని వాపోయారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సోనియా గాంధీని ఎదిరించడం వల్లే జగన్ మోహన్‌రెడ్డి జైలు పాలయ్యారన్నారు.
త్రికరణశుద్ధితో సమైక్యానికి మద్దతు: జ్యోతుల
పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ త్రికరణశుద్ధితో సమైక్యవాదానికి మద్దతిచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్సే అన్నారు. ఈ పోరాటంలో వైఎస్ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు.
ఒక్క వ్యక్తిపై ఇన్ని కుట్రలా: బాబూరావు
ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ వైఎస్ కుటుంబంపై ఉన్న విధేయతతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పాయకరావుపేట ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారన్నారు. ఒక వ్యక్తిమీద వందమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు మద్దతు పలికిన చంద్రబాబుకు పుట్టగతులుండవన్నారు.
తెలుగు కుటుంబం ఛిన్నాభిన్నం: బలిరెడ్డి
మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ వైఎస్ లేకపోవడంతో రాష్ట్రం అనాధగా మారిందన్నారు. తెలుగు కుటుంబం ఛిన్నాభిన్నమైందని వాపోయారు.
పులి కడుపున పులే పుడుతుంది: కొల్లి
పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి మాట్లాడుతూ పులికడుపున పులే పుడుతుందని చెప్పారు. జగన్ మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు వాతలుపెట్డుకుంటున్నాడన్నారు. హరికృష్ణను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలని సూచించారు.
కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం: చొక్కాకుల
పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ జగన్ మోహన్‌రెడ్డికి వస్తున్న జనాదరణ తట్టుకోలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీడీపీ వణికిపోతోందన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
బాబుది ఆత్మవంచన యాత్ర: చెంగల
పార్టీ పాయకరావుపేట నియోజవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు చేసేది ఆత్మవంచన యాత్ర అన్నారు. పాయకరావుపేట వస్తే అడ్డుకుని తగిన బుద్ధి చెబుతామన్నారు. త్వరలో జగనన్న విడుదలవుతాడని, అధైర్యపడోద్దన్నారు.
ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, కిడారి సర్వేశ్వరరావు, పార్టీ నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, రామ్మూర్తి నాయుడు, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దనిశెట్టి బాబూరావు, జానకి శ్రీను, బొలిశెట్టి గోవిందు, రామచంద్రరాజు, పి.వి.జి.కుమార్, దాడి శెట్టిరాజా, ఈశ్వరి, పీలా వెంకటలక్ష్మి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
సభలో సైడ్‌లైట్స్...
షర్మిల బస్సుయాత్ర పాయకరావుపేటకు ఎప్పుడు వస్తుందా.. రాజన్న బిడ్డను ఎప్పుడు చూద్దామా.. అని జనం ఆసక్తిగా గంటల తరబడి ఎదురు చూశా రు. మండుటెండలో ఆమె రాక కోసం నిరీక్షించారు.
షర్మిలను చూసేందుకు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏకంగా భవనాలు, సెల్ టవర్లు ఎక్కారు.
వైఎస్సార్ సీపీ జానపద కళాకారులు ఆలపించిన గీతాలు హుషారెత్తించాయి.
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం నుంచి వచ్చిన నాసిక్ డోల్ తీన్‌మార్ బృందం డప్పు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
షర్మిల ప్రసంగంలో 108 పథకం గురించి మాట్లాడుతూ కుయ్..కుయ్ అని అనడంతో జనం చప్పట్లు కొట్టారు.
జగన్, విజయమ్మ, షర్మిల ఫొటోలు, పెద్ద జెండాల తో కార్యకర్తలు సభాప్రాంగణం వద్ద వేడుక చేశారు.
గౌతం సెంటర్ నుంచి సూర్యామహాల్ సెంటర్ వరకు వేలసంఖ్యలో జనం భారీగా వాహనాలతో తరలివచ్చారు.
విశాఖ నుంచి కొణతాల రామకృష్ణ 300 వాహనాలతో వచ్చిన భారీ కాన్వాయ్ అందరీని ఆకట్టుకుంది.
బహిరంగ సభలో షర్మిల ప్రసంగించేందుకు మైక్ అందుకోగానే అభిమానులు ఉత్సాహంతో 20 నిమిషాలపాటు నిరంతరాయంగా బాణసంచా కాల్చడం తో ఆకాశంలో కాంతులు మిరుమిట్లు గొలిపాయి.
బస్సు యాత్ర సందర్భంగా తాండవ బ్రిడ్జి నుంచి గౌతం సెంటర్ వై జంక్షన్ వరకు రోడ్డుకిరువైపులా అభిమానులు ఏర్పాటు చేసిన షర్మిల, జగన్ ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి.
షర్మిలను చూసేందుకు భారీగా జనం రావడంతో రోడు ్డపక్కనున్న దుకాణాల కిక్కిరిశాయి. ఆమె ప్రసంగం ప్రారంభం కాగానే దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసి ప్రసంగం ఆలకించడానికి వచ్చారు.