కన్నవారి ఆశలను కాటేసిన మృత్యువు | sondier dide in road accidents | Sakshi
Sakshi News home page

కన్నవారి ఆశలను కాటేసిన మృత్యువు

Jan 16 2014 1:13 AM | Updated on Sep 28 2018 3:39 PM

కుటుంబసభ్యుల మధ్య సంతోషంగా పండగ జరుపుకోవాలని వచ్చిన ఒక జవాన్‌ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది.

గొల్లప్రోలు, న్యూస్‌లైన్ :కుటుంబసభ్యుల మధ్య సంతోషంగా పండగ జరుపుకోవాలని వచ్చిన ఒక జవాన్‌ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. అందివచ్చిన కొడుకు ఆదుకుంటాడని కొండంత ఆశతో ఉన్న పేద తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది. ఊరంతా పెద్ద పండగ కోలాహలం నెలకొంటే ఆ ఇంట మాత్రం విషాదమే కొలువైంది. గొల్లప్రోలు పాపయ్యచావిడి వీధికి చెందిన రిక్షా కార్మికుడు వేమగిరి ఏసు, యశోదమ్మలకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన సుబ్రహ్మణ్యం(24) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సుబ్రహ్మణ్యం చత్తీస్‌గఢ్‌లోని కొరబాలో సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీఫోర్స్)లో జవాన్‌గా రెండేళ్ల నుంచి పని చేస్తున్నాడు. సంక్రాంతి పండగకు అతడు స్వగ్రామం గొల్లప్రోలు వచ్చాడు.
 
 తన అక్క కొడుక్కి జ్వరం రావడంతో పిఠాపురం ప్రైవేట్ హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకునేందుకు మంగళవారం ఉదయం బైక్‌పై బయలుదేరాడు. గొల్లప్రోలు పాత బస్టాండ్ వద్ద ఆవు అడ్డు రావడంతో మోటార్‌బైక్ అదుపు తప్పింది. దీంతో సుబ్రహ్మణ్యం రోడ్డుపై పడిపోగా పిఠాపురం వైపు వెళ్తున్న లారీ అతని మీద నుంచి వెళ్లిపోయింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. గొల్లప్రోలు ఎస్సై ఎన్‌ఎస్ నాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రిక్షా కార్మికుడు వేమగిరి ఏసు, యశోదమ్మ  సంఘటన స్థలానికి చేరుకుని కొడుకు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. పండగ కోసం వచ్చి మాకు దూరమయ్యావా నాయనా.. అంటూ విలపించారు. ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాడని వారన్నారు.తమను ఆదుకుంటాడని ఎంతో ఆశతో ఉన్నామని, ఇంతలోనే మృత్యువు అర్ధాంతరంగా అతడ్ని కబళించిందని కుమిలిపోయారు.ఈ దుర్ఘటనతో పాపయ్యచావిడి వీధిలో విషాదం అలముకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement