పిల్లిమొగ్గలు | Somersaults | Sakshi
Sakshi News home page

పిల్లిమొగ్గలు

Oct 2 2014 2:27 AM | Updated on Sep 2 2017 2:14 PM

పిల్లిమొగ్గలు

పిల్లిమొగ్గలు

అక్టోబర్ 2వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు చివరి సమయంలో వాయిదా వేశారు.

ప్రొద్దుటూరు:
 అక్టోబర్ 2వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు చివరి సమయంలో వాయిదా వేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకాన్ని గురువారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ముందుగా స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎమ్మెల్యేలకు సమాచారం అందించగా చివరి సమయంలో మీరు ప్రారంభోత్సవానికి రావద్దని తమకే ఇంత వరకు స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 8, 2014న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన రోజు. ఆ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారోత్సవ సభలో ప్రధానంగా 5 అంశాలపై హామీ ఇచ్చారు.

1. రుణమాఫీ విధివిధానాలపై కమిటీ, 2. వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల పెంపు, 3. గ్రామాల్లో రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్, 4. ఆంధ్రప్రదేశ్‌లో బెల్టుషాపుల రద్దు, 5. రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు.  ప్రస్తుతం ఆచరణలో ఈ హామీల అమలు తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ హామీల్లో భాగంగా ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కే జవహర్‌రెడ్డి గత నెల 30న జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 127 ప్రకారం ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని అక్టోబర్ 2న ప్రారంభించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కనీసం 300 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని ప్రారంభించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయితే ప్రభుత్వం ఇందుకు నిధులు కేటాయించకపోగా కేవలం దాతల సహకారంతో వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. అత్యధిక గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ నేతలతో సహా దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కొన్ని సంస్థల సహకారంతో ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. జిల్లాకు సంబంధించి 14 ప్లాంట్లను ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఈ పథకాన్ని సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ముందుగా బ్లూకలర్‌లోఉన్న బ్యానర్‌ను బుధవారం టీడీపీకి చెందిన పసుపుపచ్చ రంగులో తయారు చేశారు.

కాగా ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఎక్కడ వైఎస్సార్‌సీపీలకు మంచి పేరు వస్తుందోనని తాత్కాలికంగా జిల్లాలో ఈ ప్రారంభోత్సవాలను వాయిదా వేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డిలు వేంపల్లి, కడప, రాజంపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఈ వాటర్ ప్లాంట్లను ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వాటర్ ప్లాంట్లను సిద్ధం చేసుకోవాలని ఎప్పుడు ప్రారంభించాల్సింది.. ఎలా ప్రారంభించాల్సింది తామే చెబుతామని ఉన్నతాధికారులు చెప్పినట్లు  ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పలువురు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement