మీరు చూడాల్సిన వీడియోలు చాలానే ఉన్నాయి: రోజా

మీరు చూడాల్సిన వీడియోలు చాలానే ఉన్నాయి: రోజా - Sakshi

ఏపీ కేబినెట్ సమావేశంలో నందిగామ ఘటనకు సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న చంద్రబాబు మంత్రివర్గం.. నిజానికి చూడాల్సిన వీడియో అది కాదని, ఇంకా చాలానే ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అది కేబినెట్ సమావేశమా.. సినిమా థియటేరా అని ఎద్దేవా చేశారు. విజయవాడలో స్థానిక నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని దౌర్భాగ్యమైన పని.. రేవంత్ రెడ్డిని పంపి ఎమ్మెల్సీ సీటు కొనుగోలుకు 5 కోట్లు ఇస్తూ పట్టుబడిన వీడియోలు చూడాలని, మావాళ్లు దే బ్రీఫ్‌డ్ మీ అని అడ్డమైన ఇంగ్లీష్ మాట్లాడిన వీడియో చూడాలని చెప్పారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే, ఆ రషెస్ ఇంతవరకు కనిపించవని, ఆ వీడియోలు ఏమయ్యాయో కేబినెట్‌కు తెలియదని అన్నారు. చింతమనేని ప్రభాకర్ అడ్డదిడ్డంగా దోచుకుంటుంటే అడ్డుపడినందుకు వనజాక్షి అనే అధికారిణిని ఎలా కొట్టారో ఆ వీడియో చూడాలని.. ఆమె కళ్లనీళ్లు పెట్టుకున్న వీడియో చూడాలని తెలిపారు. జానీమూన్ అనే మహిళ తన కుటుంబానికి రావెల కిశోర్ బాబు వల్ల ప్రాణభయం ఉందని భోరుమన్నారని, ఆ వీడియో చూడాలని సూచించారు. 

 

కేబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ మీద తీర్మానం చేశామని చెబుతున్నారని.. కానీ బస్సు ప్రమాదంలో మరణించిన 11 మంది కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలని ఎందుకు తీర్మానం చేయించలేదని రోజా ప్రశ్నించారు. దివాకర్ ట్రావెల్స్ మీద చర్యల గురించి ఎందుకు చర్చించలేదని అడిగారు. ఇక ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ లేనట్లుగా తీర్మానం చేసి సీఎంకు ఇచ్చామంటున్నారని, రాష్ట్రంలోనే అత్యున్నత అధికారి అయిన అజయ్ కల్లంకు జరిగిన అవమానం వారికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉండగానే మరో సీఎస్‌గా దినేష్‌ను ఎందుకు నియమించారని, ఈ విషయాన్ని అధికారులు ఎందుకు అడగలేదని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్ చేతిలోంచి పేపర్లు లాక్కుని చించేసినప్పుడు ఈ సంఘం ఎందుకు స్పందించలేదు, ఆయన మీద తీర్మానం ఎందుకు చేయలేదని అడిగారు. ఉద్యోగులకు జీతం పెరిగినా, జీవితం మెరుగైనా అది వైఎస్ హయాంలోనేనని అన్నారు. లిఫ్ట్ ఆపరేటర్ రిటైర్ అవుతున్నట్లు చెబితే సన్మానించి, బట్టలు పెట్టి, ఇల్లు ఇప్పించిన నాయకుడు వైఎస్ అని గుర్తు చేశారు. 

 

జగన్ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని, ఏనాడూ అధికారులను పన్నెత్తి మాట కూడా అనలేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, దురుసుగా ప్రవర్తిస్తే ఎవరికైనా కోపం రాదా అని అడిగారు. పక్కనే హెలికాప్టర్లలో తిరుగుతున్న సీఎం గానీ, రవాణా మంత్రి గానీ, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్ ఎవరూ అక్కడకు ఎందుకు వెళ్లలేదని అన్నారు. ఒకవైపు డాక్టర్ పోస్టుమార్టం చేయలేదని చెబుతుంటే, మరోవైపు కలెక్టర్ మాత్రం చేశామని అన్నారని, ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని అడిగారు. రిపోర్టు కాపీలు మూడు ఉన్నందున ఒకటి ఇవ్వాలని వైఎస్ జగన్ అడుగుతుంటే ఇవ్వకపోవడం ఏంటి.. దాన్ని మార్చాలనే ఉద్దేశం ఉండటం వల్లేనా అని నిలదీశారు. 

 

నారాయణ కాలేజిలో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో.. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారో చూడాలని, నారాయణ కాలేజి గుర్తింపు రద్దుచేసి, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని రోజా డిమాండ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్‌ను కాపాడితే మాత్రం ప్రజలు హర్షించబోరని అన్నారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఎలా మృతదేహాన్ని పంపారు, రెండోడ్రైవర్‌ను ఎక్కడ దాచిపెట్టారని ఆమె నిలదీశారు. లోకేష్‌కు అండగా ఉన్నాడని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో బుద్దా వెంకన్నను ఎలా కాపాడారో అంతా చూస్తున్నారని, లోకేష్ కొడుకును ఎత్తుకుని ముద్దాడినంత మాత్రాన జేసీని కాపాడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసి కూడా కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌ను కాపాడుతున్నారా? ఇది జరిగిన మర్నాడే స్కూలు పిల్లల బస్సు లోయలో పడిందంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయం చేస్తున్నది చంద్రబాబు, ఆయన ప్రభుత్వమన్నది అందరికీ తెలుసని, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో 200 సీడీలు దొరికితే ఆ నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదో ఎవరూ అడగరని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ నుంచి మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. మల్లాది విష్ణుకు చెందిన బార్‌లో కల్తీ మద్యం ఉందని యజమాని మీద కేసు పెట్టారు కదా.. మరిప్పుడు దివాకర్ ట్రావెల్స్ యజమాని మీద ఎందుకు కేసులు పెట్టరని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top