విశ్వవిద్యాలయం.. వేదనాలయం

SK University Students Worried About Classes - Sakshi

ప్రారంభం కాని ఎంపీఈడీ తరగతులు

క్లాసుల కాలయాపనపై విద్యార్థుల కన్నెర్ర

ఎస్కేయూ ఇన్‌చార్జ్‌     వీసీ కారు అడ్డుకుని నిరసన

అనంతపురం, ఎస్కేయూ: ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని విశ్వవిద్యాలయంలో చేరితే తరగతులే నిర్వహించకుండా వేదనకు గురి చేస్తారా అంటూ ఎంపీఈడీ విద్యార్థులు ఆగ్రహించారు. వర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎస్కేయూ క్యాంపస్‌ కళాశాలలో ఎంపీఈడీ కోర్సులో చేరిన విద్యార్థులకు తరగతులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. క్లాసులు ప్రారంభించాలని విద్యార్థులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు, ఫిర్యాదుల ద్వారా అందజేశారు. అవన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. నెల రోజులైనా అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల్లో ఓపిక నశించింది. అధికారుల నిర్లక్ష్యంపై కన్నెర్రజేశారు. బుధవారం ఉదయం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. 

ఇన్‌చార్జ్‌ వీసీ వాహనం అడ్డగింత
అదే సమయంలో క్యాంపస్‌లోకి వెళుతున్న ఇన్‌చార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ ఎంసీఎస్‌ శుభ వాహనాన్ని అడ్డుకున్నారు. గంట పాటు వాహనాన్ని ముందుకు కదలనీయకుండా ఆపేశారు. దీంతో ఇన్‌చార్జ్‌ వీసీ స్పందిస్తూ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీసీ వెళ్లిన అనంతరం రిజిస్ట్రార్‌ వాహనం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌బాబు వాహనం దిగి ధర్నా చేస్తున్న ఎంపీఈడీ విద్యార్థుల వద్దకు చేరుకుని గేటు దాటి ముందుకు వెళుతున్న క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

సస్పెన్షన్‌ పేరుతో భయపెడతారా?
తరగతులు నిర్వహించండని కోరడానికి మీ చాంబర్‌కు వస్తే సస్పెండ్‌ చేస్తామంటూ భయపెడతారా.. ఎంతమందిని సస్పెండ్‌ చేస్తారో చేసుకోండి అంటూ ఎంపీఈడీ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రిజిస్ట్రార్‌ కె.సుధాకర్‌బాబును సూటిగా ప్రశ్నించారు. దీంతో ప్రాక్టికల్‌ తరగతులు ఒక ఫ్యాకల్టీకి, థియరీ తరగతులను మరొక ఫ్యాకల్టీకి అప్పగిస్తామని రిజిస్ట్రార్‌ హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు. ఎంపీఈడీ విద్యార్థుల ఆందోళనలకు వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, అంకే శ్రీనివాస్, హేమంత్‌కుమార్, రాధాకృష్ణ, భానుప్రకాష్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు శ్రీధర్‌గౌడ్‌ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఈడీ విద్యార్థి నాయకులు పక్కీరప్ప, సునీల్, నరేంద్ర పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top