టీచర్‌ సెలవైతే బడి మూతే

Single Teacher Schools Suffering With Staff Shortage - Sakshi

 ఏకోపాధ్యాయులతో పాఠశాలల్లో అవస్థలు

ప్రశ్నార్థకంగా చిన్నారుల భవితవ్యం

జిల్లాలో 186 ఏకోపాధ్యాయ పాఠశాలలు

ప్రకాశం  , పర్చూరు: గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది. ఏకోపాధ్యాయ పాఠశాలలే అందుకు నిదర్శనం. సరిపడినంత మంది సిబ్బంది ఉన్న పాఠశాలల్లోనే బోధన అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఏకోపాధ్యాయుడు సెలవు పెడితే పాఠశాలనే మూసేసే పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు సక్రమంగా లేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెడుతున్నారు.  జిల్లా వ్యాప్తంగా 4,421 పాఠశాలుండగా, అందులో 4,70,600 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 186 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి.  ఏదైనా అవసరం ఉండి టీచర్‌ సెలవు పెడితే బడిని మూసేయాల్సిందే. ఉపాధ్యాయ పోస్టులు సరిపడా మంజూరు కాకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఏళ్ల తరబడి పాఠశాలలు ఏకోపాధ్యాయునితోనే నడుస్తున్నాయి.

భవన వసతులున్నా...
దాదాపు అన్ని పాఠశాలలకు భవనాల వసతి ఉన్నా ఉపాధ్యాయ నియామకం జరగకపోవడంతో అన్ని తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చుండబెట్టి పాఠాలు చెబుతున్నారు. మండలంలో  అడుసుమల్లి, అన్నంభొట్లవారిపాలెం గ్రామాల్లో అదనపు తరగతుల కోసం భవనాలు ఉన్నా, వీటిలో ఒకదానిలో బడి నిర్వహిస్తుండగా మరొకటి నిరుపయోగంగానే ఉండిపోతోంది.

అదనపు పనులతో ఏకోపాధ్యాయులకు అవస్థలు:
ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు బోధన జరిగే ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు శతావధానం చేయాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పరిపాలన, పాఠశాలలు మన ఊరు–మనబడి, మధ్యాహ్న భోజనం తదితర రికార్డుల నిర్వహణకే ఉపాధ్యాయుని సమయమంతా సరిపోతోంది.

ఇక పాఠాలు ఎలా చెబుతారు. దీంతో విద్యార్థులు ఉదయం నుంచీ సాయంత్రం వరకు కూర్చొని కాలక్షేపం చేసి ఇళ్లకు వస్తున్నారు. ఇక విద్యా ప్రగతి ఏం బాగుపడుతుందో పరమాత్మకే ఎరుక. వీటిలో పనిచేసే ఉపాధ్యాయులు సెలవు పెట్టాలంటే ముందుగా ఎంఈఓకు సమాచారం ఇవ్వాలి. ఆయన ఎవరినైనా డిప్యుటేషన్‌ మీద పంపాలి. ఒక వేళ డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయుడు రాకపోతే పాఠశాల మూతపడాల్సిందే. ఫలితంగా విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు

ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పాఠశాలల్లో విద్యా ప్రగతి కుంటుపడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.– కె.డి.వి.ప్రసాద్,యుటీఎఫ్‌ మండల అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top