గిన్నిస్ బుక్‌లో నమోదు కోసం ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో 25 గంటలపాటు నృత్యం చేశారు.
- గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం 3,750 మంది హాజరు
- ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుపతి విద్యార్థులు గిన్నిస్ బుక్‌లో నమోదు కోసం ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో 25 గంటలపాటు నృత్యం చేశారు. తిరుపతిలోని ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ నిరంతర నృత్య ప్రదర్శనలో రాష్ట్రంలోని 125 గురుకుల పాఠశాలలకు చెందిన 3,750 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ నృత్య ప్రదర్శన ఆదివారం ఉదయం 10 గంటలకు ముగిసింది. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన పాటలకు 125 బృందాలుగా విద్యార్థులు 25 గంటలు ఆపకుండా నృత్యం వేశారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకల్లో భాగంగా దీనిని నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల ఈ ప్రయత్నం ఎంతో గొప్పదని ప్రశంసించారు. 25 గంటలపాటు నృత్యం చేయడం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, క్రమశిక్షణకు నిదర్శనమన్నారు.
రెసిడెన్సియల్ పాఠశాలల అభివృదికి కృషి: రాష్ట్రంలోని రెసిడెన్సియల్ పాఠశాలల అభివృద్ధి, వాటిలో ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని మంత్రి ఆనంద్ బాబు హామీ ఇచ్చారు. వాటిని కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తయారు చేస్తామన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే మెస్ బిల్లుల పెంపునకు కృషి చేస్తానన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానాకి తాము కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి రాములు పాల్గొన్నారు.