రాయలసీమలో విజయవంతంగా జరుగుతున్న బంద్ | samaikya bandh successful in rayalaseema districts | Sakshi
Sakshi News home page

రాయలసీమలో విజయవంతంగా జరుగుతున్న బంద్

Dec 6 2013 8:23 AM | Updated on May 29 2018 4:06 PM

రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల్లో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది.

రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల్లో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఒక్క దుకాణం కూడా తెరుచుకోలేదు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయాయి. విభజన ప్రక్రియను ఆపేవరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

వైఎస్సార్ జిల్లాలో విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్చందంగా మూసేశారు. బస్సులేవీ డిపోల నుంచి బయలకు రాలేదు. పలు నియోజకవర్గాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కడప అప్సర సర్కిల్‌లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. కడప సెవన్‌ రోడ్డులో ఇంఛార్జ్ అంజాద్‌ బాషా ఆధ్వర్యంలో బంద్‌ చేయగా, పులివెందులలో వైఎస్ అవినాష్‌ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు.
కర్నూలు జిల్లాలో బస్టాండ్‌లో బస్సులను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పలు నియోజకవర్గాల్లో నాయకులు రాస్తారోకోలు, ధర్నాలకు శ్రీకారం చుట్టారు.

చిత్తూరు జిల్లాలో కూడా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాచేశారు. నారాయణవనం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నేత ఆదిమూలం ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ధర్మవరం, హిందూపురం, రాప్తాడు, పుట్టపర్తి నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దుకాణాలు, విద్యాసంస్థలు పూర్తిగా మూసేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement