చీమల మందు తాగించి, బ్లేడ్‌తో కోసి..

Sadist Mother in Rajamahendravaram - Sakshi

కుమార్తె శరీరాన్ని  ఛిద్రం చేసిన శాడిస్ట్‌ తల్లి 

 103 కుట్లు వేసి చికిత్స అందిస్తున్న వైద్యులు

రాజమహేంద్రవరం క్రైం: పోలీసుల దర్యాప్తులో శాడిస్టు తల్లి శారద రాక్షస కృత్యాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. సినిమాల్లోని సైకో పాత్రలను మించిన ఆమె క్రూరత్వాన్ని చూసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా తూర్పు మండలం డీఎస్పీ యు. నాగరాజు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. రాజానగరం మండలం దివాన్‌ చెరువుకు చెందిన మచ్చా శారద   తన కుమార్తె మహాలక్ష్మిపై బ్లేడ్‌తో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించింది. శారద, శివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి కాగా, చిన్న కుమార్తె నాగేశ్వరి. శారద తనకు తానుగా బ్లేడ్‌తో గాయపరుచుకుని భర్త కొడుతున్నాడంటూ తల్లిదండ్రులకు చెప్పి అతడిపై పోలీసు కేసు పెట్టి విడాకులు తీసుకుంది. దివాన్‌ చెరువులోని ఒక హాటల్లో పనిచేస్తూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

 వారిద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఆ కోపాన్ని శారద తన పిల్లలపై చూపేదని ఇరుగుపొరుగు వారు పేర్కొంటున్నారు.  సోమవారం రాత్రి శారద హోటల్లో పని ముగించుకొని ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి భోజనం చేసింది. అల్లరి చేస్తున్న మహాలక్ష్మిని తిట్టి మందలించింది. మహాలక్ష్మి ఇంటి బయట వాకిట్లోని నీళ్ళ డ్రమ్ముని కాళ్ళతో తన్ని నీళ్ళు ఒలకబోసింది. దీంతో శారద కోపంతో ఆ బాలికను కొట్టగా రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. శారద బాలిక వెనుకే తల్లి ఇంటికి వెళ్లి కుమార్తెను జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకు వచ్చింది. తన మాట వినడం లేదంటూ చీమల మందు నీటిలో కలిపి, ఆ నీటిని బలవంతంగా తాగించింది.

 కుమార్తె సృహ కోల్పోయాక ఆమెను హత్య చేయాలనేది శారద ఉద్దేశం. రాత్రి 12 గంటల సమయంలో కుమార్తెను భుజంపై వేసుకొని దివాన్‌ చెరువు అంబికా లేఅవుట్‌లోని పాత బ్రాందీ షాపు దగ్గరలోని శ్మశానం వద్దకు చేరుకుంది. అక్కడి తుప్పల్లోకి తీసుకు వెళ్ళి తువ్వాలును ముక్కలుగా చేసి కుమార్తె కాళ్లు, చేతులు కట్టి బ్లేడుతో బాలిక వంటిపై గాయపరచసాగింది. సృహలోకి వచ్చిన బాలిక ‘అమ్మా కోయవద్దు’ అంటూ కేకలు వేస్తూ బతిమిలాడింది. అయినా కనికరించకుండా గుడ్డలు  నోట్లో కుక్కి ముఖంపైన, తలపైన, కాళ్లపైన, బాలిక మర్మావయవాలపైనా ఇస్టానుసారం కోసింది.  సృహ కోల్పోయి పడిపోగానే మృతి చెంది ఉం టుం దని భావించి ఎవరికీ తెలియకుండా అర్ధ రా త్రి ఒం టి గంట సమయంలో శారద ఇంటికి   చేరుకొంది.

శరీరమంతా గాయాలతో అమ్మమ్మ ఇంటికి
తెల్లవారుజామున బాలిక మహాలక్ష్మికి సృహ వచ్చింది . ఆమె అమ్మమ్మ  ఇంటికి వెళ్ళి తాతయ్యకు జరిగిన విషయం చెప్పింది. అమ్మ వద్దకు తీసుకువెళ్ళవద్దని తాతయ్యను ప్రాధేయపడింది. దీంతో తాతయ్య ఆమె శరీరంపై గాయాలను డెట్టాల్‌తో శుభ్రం చేశాడు. కాగా తెల్లవారు జాము ఐదు గంటలకు  శారద తన తండ్రి ఇంటికి వెళ్లి కుమార్తె కనిపించడం లేదంటూ చెప్పింది. దెబ్బలతో రాత్రి ఇంటికి వచ్చిందని, నిద్రపోతున్న  లక్ష్మిని చూపించాడు. దీంతో నిందితురాలు శారద జరిగిన విషయం తండ్రికి చెప్పకుండా దాచింది. ఏమీ తెలియనట్టు నటిస్తూ తన తండ్రితో కలిసి కుమార్తెకు వైద్యం చేయించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్‌కు తీసుకు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం సృహలోకి వచ్చిన బాలిక తల్లి తనపై చేసిన అఘాయిత్యం గురించి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మొదటి నుంచీ శాడిజమే
మచ్చా శారద మొదటి నుంచీ శాడిజంతో ప్రవర్తించేందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లిదండ్రులతో గొడవ పడడం, తండ్రి చెవి కొరికేయడం, చెల్లి, తమ్ముడితో గొడవలు పడి, వారిని కొట్టేది. భర్త శివ కొట్టకపోయినప్పటికీ బ్లేడ్‌తో చేతుల మీద కొసుకొని వచ్చి తల్లికి భర్త కొట్టాడని చెప్పడంలో అది నిజమని నమ్మిన తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో భర్త శివపై ఫిర్యాదు చేసి అతని నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరితో శారద వివాహేతర సంబంధం సాగించింది. 

భయంతో బాలిక బూచాడి కథ
తాను కొట్టినట్టు ఎవరికైనా చెబితే చచ్చిపోతానని శారద తన కుమార్తె మహాలక్ష్మిని భయపెట్టింది. దీంతో ముసుగు వేసుకొని బూచాడు వచ్చి తనను గాయపరిచాడని ఆ బాలిక తొలుత పోలీసులకు చెప్పింది. అనంతరం అర్భన్‌ జిల్లా ఎస్పీ రాజకుమారి దర్యాప్తు చేపట్టి బాలిక నుంచి అసలు విషయం రాబట్టారు.  బాలికకు వైద్యులు 103 కుట్లు వేశారు. విలేకరుల సమావేశంలో బొమ్మురు సీఐ మోహన్‌ రెడ్డి, ఎస్సై నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. నిందితురాలు శారదను ఏడో ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top