రైట్.. రైట్ | RTC employees end of strike | Sakshi
Sakshi News home page

రైట్.. రైట్

May 14 2015 1:06 AM | Updated on Apr 7 2019 3:24 PM

రైట్.. రైట్ - Sakshi

రైట్.. రైట్

ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సర్కారుతో చర్చలు ఫలించడంతో కార్మికులు బుధవారం మ ద్యాహ్నం విధుల్లో

ఆర్టీసీ కార్మికుల సమ్మె సమాప్తం
విధుల్లో చేరిన సిబ్బంది
డిపోలలో సంబరాలు
 రోజూ కోల్పోయిన ఆదాయం  రూ.70లక్షల నుంచి 85లక్షలు

 
విశాఖపట్నం: ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సర్కారుతో చర్చలు ఫలించడంతో కార్మికులు బుధవారం మ ద్యాహ్నం విధుల్లో చేరిపోయారు.  దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.  సమ్మె ముగిసినా భారీ నష్టాన్ని మాత్రం మిగిల్చిం ది. ప్రయాణీకులకు నరకం చూపించింది.  విశాఖ నగరం, రూరల్ పరిధిలో 5312 మంది ఆర్టీసీ కార్మికులు ఈ నెల 6వ తేదీన సమ్మె బాటపట్టారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో 1016 బస్సుల సేవలు స్తంభించా యి. ప్రైవేటు రవాణా వాహనాల యజమానులు ఇదే అదునుగా ప్రయాణీకులను నిలువుదోపిడీ చేశారు. టిక్కెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకున్నారు.అధికారులు రోజుకి రూ.1000 చెల్లించి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకున్నారు. రోజుకి దాదాపు 500 సర్వీసులు నడిపారు. వారు కూడా ప్రయాణీకుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరోక్షంగా నలుగురు, ప్రత్యక్షంగా ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఏజెన్సీలోని  జర్రెలఘాట్‌లో జీపు బోల్తాపడి నలుగురు చనిపోయారు. గాజువాక వద్ద బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత పడ్డారు.

ఇక ఈ ఎనిమిది రోజుల్లో వాహన ప్రమాదాల్లో అనేక మంది గాయాలపాలయ్యారు. సమ్మె వల్ల సాధారణ ప్రయాణీకులతో పాటు ఎంసెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు హాజరయ్యే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా ఆర్టీసీకి రోజుకి రూ.70 లక్షల నుంచి రూ.85 లక్షల వరకూ ఆర్ధిక నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు బుధవారం సమ్మె విరమించడంతో సాయంత్రం నుంచే సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో మళ్లీ నగర వీధులు బస్సులతో కళకళలాడాయి. కార్మికులు ఆర్టీసీ డిపోలకు చేరుకుని తమ విధులను చేపట్టారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తమకు కేటాయించిన బస్సులు తీసుకుని ప్రయాణీకుల సేవకు బయలుదేరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి 43 శాతం ఫిట్‌మెంట్‌కు ఒప్పుకోవడం సంతోషమని సమ్మెకు నేతృత్వం వహించిన కార్మిక సంఘాలు తెలిపాయి. సమ్మె కాలంలో తమకు సహకరించిన ప్రయాణికులు, మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు కార్మిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది.పలు డిపోల్లో ఆందోళనలు జరిగాయి. మద్దిలపాలెం డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏజెన్సీలో శిరోమండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రానికి తీపి కబురు అందడంతో సంబరాల్లో మునిగితేలారు.
 
కార్మిక విజయం..

మండుటెండను కూడ లెక్కచేయకుండా, కుటుంబాల యోగక్షేమాలు పట్టించుకోకుండా అహర్నిశలు రోడ్లపై ఉద్యమాలు చేపట్టిన కార్మికులకే ఈ విజయం దక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, సంస్థ ఎండీ కార్మికుల సంక్షేమాన్ని, ఆర్ధిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఫిట్‌మెంట్ ఇవ్వడానికి సానుకూల నిర్ణయం  తీసుకోవడం అభినందనీయం.  
 -పలిశెట్టి దామోదర్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర
 ఉప ప్రధాన కార్యదర్శి
 
 సమష్టి కృషి


 ప్రతి కార్మికుడు చిత్తశుద్ధితో పోరాటం చేయడం ద్వారా దిగ్విజయంగా సమ్మె ముగిసింది. కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఉపసంఘం గ్రహించి 43 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు విశ్రాంత ఉద్యోగులకు  ఉచిత ప్రయాణం, రాష్ట్ర వ్యాప్తంగా  కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులపై కేసుల ఎత్తివేత వంటి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
 -వై.శ్రీనివాసరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement