రూ.10 నోట్ల ఎర..రూ.20 లక్షలకు టోకరా | Rs 20 lakhs theft | Sakshi
Sakshi News home page

రూ.10 నోట్ల ఎర..రూ.20 లక్షలకు టోకరా

Apr 4 2014 1:09 AM | Updated on Sep 2 2017 5:32 AM

రూ.10 నోట్ల ఎర..రూ.20 లక్షలకు టోకరా

రూ.10 నోట్ల ఎర..రూ.20 లక్షలకు టోకరా

వేటగాడు.. కాసిని నూకలు చల్లి, పక్షులను పన్నిన వలలోకి రప్పించినట్టు- మోసగాళ్లు.. చిల్లరనో, నోట్లనో ఎరగా వేసి, దృష్టి మళ్లించి.. లక్షలు కాజేసే ఉదంతాలు కోకొల్లలు. అయినా- జగమెరిగిన ఈ టోకరా తిరిగి తిరిగి జరుగుతూనే ఉంటుంది.

కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : వేటగాడు.. కాసిని నూకలు చల్లి, పక్షులను పన్నిన వలలోకి రప్పించినట్టు- మోసగాళ్లు.. చిల్లరనో, నోట్లనో ఎరగా వేసి, దృష్టి మళ్లించి.. లక్షలు కాజేసే ఉదంతాలు కోకొల్లలు. అయినా- జగమెరిగిన ఈ టోకరా తిరిగి తిరిగి జరుగుతూనే ఉంటుంది.
 
తాజాగా గురువారం కాకినాడలో పునరావృతమైన ఈ దగాపర్వం ఖరీదు ఏకంగా రూ.20 లక్షలు! తాళ్లరేవులోని రాజువర్మ ఎంటర్‌ప్రైజెస్ అకౌంటెంట్ బులుసు వెంకట రామశర్మ.. రోడ్డుపై పడిఉన్న రూ.10 నోట్లను ఏరుకునే ఆదుర్దాలో అంత పెద్ద మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొయ్య రైతులకు సీడ్, కెమికల్స్ సరఫరా చేసే రాజు వర్మ ఎంటర్‌ప్రైజెస్‌లో శర్మ 12 ఏళ్ల నుంచి అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. సంస్థ పేరిట వచ్చిన చెక్కులను కాకినాడ బాలాజీచెరువు సమీపంలోని యూనియన్ బ్యాంకులో జమ చేసి సొమ్ము తీసుకు వెళుతుంటాడు.
 
గురువారం రూ.20 లక్షల చెక్కును నగదుగా మార్చి, ఆ మొత్తాన్ని బ్యాగ్‌లో ఉంచి బ్యాంకు బయటకు వచ్చాడు. బ్యాగ్‌ను మోటార్ బైక్ ఆయిల్ ట్యాంక్‌పై ఉంచి స్టార్ట్ చేయబోతుండగా ఓ ఆగంతకుడు వచ్చి, కింద పడి ఉన్న రూ.10 నోట్లను శర్మకు చూపించాడు. శర్మ బైక్ దిగకుండానే వంగి నోట్లు ఏరుకుని, జేబులో పెట్టుకోబోయేసరికి ట్యాంక్ మీద ఉండాల్సిన బ్యాగ్ కనిపించలేదు.

ఆ ఆగంతకుడూ పత్తా లేడు. చేష్టలుడిగిన శర్మ తేరుకుని చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. వారంతా సమీపంలో గాలించినా ఫలితం లేకపోయింది. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి, వన్‌టౌన్ క్రైం ఎస్సై పి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శర్మ నుంచి వివరాలు సేకరించారు.
 
యూనియన్ బ్యాంకులో అమర్చిన సీసీ కెమెరాల క్లిప్పింగ్‌లను పరిశీలించారు. ఆగంతకుడు రూ.పది నోట్లు కింద పడేయడమే కాక శర్మ వీపుపై కిళ్లీ ఉమ్మినట్టు కనిపించింది. దీన్నిబట్టి శర్మ పది నోట్లు తీసుకునేలోపు బ్యాగ్ చోరీ సాధ్యం కాకపోతే కిళ్లీ ఉమ్మి తుడుస్తున్నట్టు నటిస్తూ బ్యాగ్ కాజేయాలన్నది ఆగంతకుడి పన్నాగమై ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో నమోదైన చిత్రాలను బట్టి స్థానిక నిందితుడే నేరానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
 
పోలీసులకు సవాలు
కాగా నిత్యం రద్దీగా ఉండే బాలాజీ చెరువు సెంటర్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు క్రైం పోలీసులు గస్తీ నిర్వహిస్తుంటారు. అలాంటి చోట పట్టపగలు ఇంత మొత్తం చోరీ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ సంఘటన బ్యాంకు సిబ్బందిని కూడా కలవరపరిచింది. శర్మ ఫిర్యాదుతో వన్‌టౌన్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement