ఇదేం ‘దారి’ణం

Roads Structures In Chandrababu Naidu Constituency In Farmers Problems - Sakshi

పరిహారం ఇవ్వకనే పొలాలపై రహదారులు

పోలీసుల అండదండలతో టీడీపీ శ్రేణుల దౌర్జన్యం

హైకోర్టును ఆశ్రయిస్తున్న రైతులు

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దారుణం

ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో నూతన రోడ్డు నిర్మాణాలు రైతుల పాలిట శాపంగా మారాయి. కొత్త రోడ్ల ఏర్పాటు స్వాగతించాల్సిన విషయమే అయినా.. అనుసరిస్తున్న విధానం వికృతంగా ఉంది. రైతుల పొలాల్లో రోడ్డు వేస్తున్న విషయాన్ని కనీసం వారికి     చెప్పకుండా, పచ్చని పంటపొలాల మీదుగా రహదారులు నిర్మిస్తున్నారు. అడ్డుకుంటే స్థానిక టీడీపీ నాయకులు పోలీసుల అండదండలతో దాడులకు దిగుతున్నట్లు సమాచారం. దిక్కుతోచని రైతులు చేసేది లేక హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. స్టే తెచ్చుకుని పనులు     ఆపిస్తున్నారు. కొన్నిచోట్ల కోర్టు స్టేలను కూడా బేఖాతరు చేస్తున్నారు. 

కుప్పం రూరల్‌ :  కుప్పం నియోజకవర్గంలో నాలుగేళ్లుగా రూ.610 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆర్‌ అండ్‌ బీ పరిధిలో రూ.300 కోట్లతో 300 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. పంచాయతీ రాజ్‌ పరిధిలో మరో 310 కోట్ల రూపాయలతో 280 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 175 కిలో మీటర్ల తారురోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పనుల్లో రైతుల అనుమతి లేకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా చేసేవే అధికం.
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రోడ్లు మచ్చుకు కొన్ని..
     కుప్పం – గుడ్లనాయనపల్లి మార్గం నుంచి ఒంటూరు(చింపనగల్లు) గ్రామానికి రోడ్డు మంజూరైంది. పొలంలో రోడ్డు నిర్మాణం చేపడతామని పొలం యజమాని నారాయణప్రసాద్‌కు కాంట్రాక్టరు చెప్పాడు. రైతు నారాయణప్రసాద్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, పొలంలో రోడ్డునిర్మాణం చేయరాదని చెప్పారు. చేయాల్సి వస్తే తనకు పరిహారం ఇవ్వాలని భీష్మించారు. ఇదే సమయంలో రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని స్థానిక టీడీపీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

కుప్పం – గుల్లేపల్లికి తారురోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టరు జేసీబీలతో రైతుల పొలాల్లో మట్టిని తొలగించేందుకు ప్రయత్నించాడు. తంబిగానిపల్లి, కమతమూరు గ్రామాలకు చెందిన 10 మంది రైతులు ‘ఇదేమి దౌర్జన్యం ? మా అనుమతి తీసుకోకుండా రోడ్డు నిర్మాణం ఎలా చేపడతారు’ అని ప్రశ్నించారు. సదరు కాంట్రాక్టరు, అధికారులు పోలీసుల సమక్షంలో రోడ్డునిర్మాణానికి ఉపక్రమించారు. కాపాడాల్సిన పోలీసులే కాపలా కాస్తున్నప్పుడు రైతులు చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు. స్టే తెచ్చుకుని నిర్మాణాలు ఆపారు. నష్టపరిహారం తరువాత ఇప్పిస్తాం.. కోర్టు కేసు వాపసు తీసుకోవాలని రైతులపై స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. 

ఉర్లవోబనపల్లి రోడ్డు నుంచి పేటగుట్టమీదుగా గోనుగూరుకు తారురోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. అధికారులు ఓ వైపు సర్వే చేస్తే.. అటువైపు టీడీపీ నాయకుల పొలం పోతుందని మరోవైపు ఉన్న నిరుపేద పొలంలో నిర్మాణాలకు సిద్ధమయ్యారు. రైతు వైఎస్సార్‌సీపీ నాయకుల సహకారంతో రోడ్డుకు అడ్డంగా రాళ్లు నాటి నిర్మాణాలను నిలుపుదల చేశారు. స్థానిక నాయకులు నష్టపరిహారం ఇప్పిస్తామని రైతు అబ్బును మభ్యపెట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత పట్టించుకోలేదు.

నూలుకుంట నుంచి దెయ్యాలవంకకు వేస్తున్న తారురోడ్డును రైతులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా, పరిహారం ఇవ్వకుండా రోడ్డు వేస్తుండడంతో నలుగురు రైతులు హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. అయితే స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు రైతులకు రేషన్, పెన్షన్‌ వంటి పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. 

రామకుప్పం – బందార్లపల్లి మార్గంలో తారురోడ్డు నిర్మాణాలు చేపట్టారు. ఇందులో రామకుప్పం గ్రామానికి చెందిన శివశంకర్, నాగరాజుకు చెందిన 13 సెంట్ల భూమి పోయింది. వారికి మాటమాత్రమైనా చెప్పకనే రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రైతులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా అధికారులు ఖాతరు చేయలేదు. దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేసేశారు. 

కుప్పం మండలం తిర్లావానిబండ నుంచి ఫిరోజ్‌ కొటాలు వరకు తారురోడ్డు నిర్మాణాన్ని చేతికొచ్చిన వరిపొలంపై చేపడుతున్నారు. నాలుగు రోజులు సమయమిస్తే పంటను కోసుకుంటామని రైతులు కాళ్లావేళ్లా పడినా.. జేసీబీలతో పంటను తొక్కించి మరీ నిర్మాణాలు చేస్తున్నారు. అడ్డొచ్చిన నాపై దళిత మహిళని చూడకుండా టీడీపీ నాయకులు మంగళవారం దాడి చేశారంటూ 
తిర్లావానిబండకు చెందిన పద్మ వాపోయింది. ఒకటి రెండు ఇళ్లకోసం రోడ్ల నిర్మాణం చేపట్టరాదని కలెక్టర్‌ ఆదేశాలున్నా, నాలుగు ఇళ్ల కోసం రూ.10     లక్షలు ఖర్చుపెట్టి తారురోడ్డు నిర్మిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top