పోలవరం ముంపుతిప్పలు

Roads collapsed no way to get water from outside, Polavaram Expats - Sakshi

పునరావాస ప్యాకేజీ ఏదీ !

కానరాని కనీస వసతులు

పోలవరం ముంపుగ్రామాల్లో దుస్థితి

నిర్వాసితుల ఆక్రందన

కాలినడకన వెళ్లేందుకూ పనికిరాని రోడ్డు..గుక్కెడు నీళ్ల కోసం చెలమలే గతి..వ్యవసాయ పనులు లేవు.. ఉపాధి పనులు ఉన్నా అవసరానికి వేతనాలు అందవు.. గ్రామాలువిడిచి వెళ్లిపోదామంటే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు కాదు.. ఉండాలంటే కనీస వసతుల్లేవు..కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం.. నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. గ్రామాలు విడిచివెళ్లలేక, ఉండలేక ప్రత్యక్ష నరకం.. ఇదీ పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల దీనగాథ..

సాక్షి, పోలవరం :  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 205 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో పోలవరం మండలంలో 26 గ్రామాలు ముంపు బారిన పడుతుండగా, ఇప్పటి వరకు ఏడు గ్రామాల్లోని 1,400 నిర్వాసిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా దాదాపు మూడు వేల కుటుంబాలు 19 గ్రామాల్లో మగ్గిపోతున్నారు. వీరికి ప్రభుత్వం కనీస వసతులూ కల్పించటంలేదు. అవసరమైన నిధులూ మంజూరు చేయటంలేదు. దశాబ్ద కాలంగా ఇదే దుస్థితి. రెండేళ్ల కిందట జిల్లాలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం నిర్వాసితులదీ ప్రస్తుతం ఇదే పరిస్థితి.

కుక్కునూరు మండలంలో 120 ముంపు గ్రామాల్లో దాదాపు 9వేల కుటుంబాలు, వేలేరుపాడు మండలంలోని 59 ముంపు గ్రామాల్లో దాదాపు 5వేల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఈ మండలాల్లోనూ కనీస వసతులు లేవు. ముంపు గ్రామాలు కావటంతో సర్కారు నిధులు కూడా మంజూరు చేయటంలేదు. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 198 గ్రామాల్లోని దాదాపు 17వేల కుటుంబాలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాయి. దీనికి సర్కారు నిర్లక్ష్య వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రోడ్డు శిథిలం : పోలవరం మండలంలో ముంపు గ్రామాల నిర్వాసితులు ఏ చిన్న పనికైనా నిత్యం పోలవరం రావాలి. 35కిలోమీటర్ల  పొడవైన ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ప్రయాణించాలి. పదేళ్ల కిందట ఈ రోడ్డు వేశారు. మూడేళ్ల కిందట తాత్కాలిక మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రోడ్డు పూర్తిగా శిథిలమైంది. ఫలితంగా ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులకు గురై నిలిచిపోతున్నాయి. ఒక్కోసారి రోజుల తరబడి బస్సులు రావటం లేదు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పరిస్థితి కూడా లేదు. ఆటోలకు వందలాది రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ గ్రామాల్లోని నిర్వాసితులకు చెందిన 2,600ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రాజెక్టు కోçసం సేకరించింది.

దీంతో వ్యవసాయ పనులు లేవు. ఉపాధి పనులు ఉన్నా, అవసరానికి సొమ్ములు అందవు. ఇక తాగునీటి పథకాలు ఉన్నా, నిర్వహణా లోపంతో పాటు, భూగర్భ జలాలు అడుగంటడంతో కొన్ని గ్రామాల్లోనే అవి అక్కరకు వస్తున్నాయి. ఎర్రవరం, శివగిరి, చీడూరు, టేకూరు వంటి గ్రామాల ప్రజలు తాగునీటి కోసం గోదావరినదిపై ఆధారపడుతున్నారు. విద్యుత్‌ సరఫరా కూడా సక్రమంగా ఉండదు. కొన్ని సార్లు విద్యుత్‌కు రోజుల తరబడి అంతరాయం కలుగుతోంది. ఫలితంగా  తాగునీటి పథకాలు పనిచేయటంలేదు.

కనీసం వీధిలైట్లు కూడా వెలగవు. విలీన మండలాల్లోనూ అదే దైన్యం : అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోనూ దయనీయ పరిస్థితులు ఉన్నాయి. నిర్వాసితులు రోడ్లు, తాగునీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు. ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు.  వీధిలైట్లు కూడా వెలగని దుస్థితి. ఫలితంగా ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా చెలమల నీటిపై ఆధారపడుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండడంతో  పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎవరికైనా సుస్తీ చేసినప్పుడు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు  ఎన్నో అవస్థలు పడుతున్నారు. దీంతో నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, అధికారులు వారికి అవసరమైనప్పుడే గ్రామాలకు వస్తున్నారని  నిర్వాసితులు చెబుతున్నారు. ఎప్పుడు గ్రామాలు ఖాళీ చేయాలో మాకు తెలీదు. ఎప్పుడు ఖాళీ చేయిస్తారో అధికారులకు కూడా  తెలీదు. అయినా ఇక్కడ ఉన్నంతకాలం కూడా వసతులు కల్పించటం లేదు అంటూ నిర్వాసితులు తామా బుచ్చిరాజు, మణుగుల చంటబ్బాయిరెడ్డి, కత్తుల భీమిరెడ్డి, కుంజం సంకురు తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోవటం లేదు
మాది పోలవరం మండలం శివగిరి. ప్రాజెక్టు వల్ల మా గ్రామం మంపునకు గురవనుంది. ప్రస్తుతం కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నా. సెంటు భూమి కూడా లేదు. నా కొడుకుతోపాటు నేనూ కూలిపనికి వెళ్తున్నా.  వ్యవసాయ పనులు లేవు. బతుకు కష్టంగా ఉంది. వారానికి ఒకసారి పోలవరం వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నాం. రోడ్డు పాడవటంతో బస్సు సరిగ్గా తిరగక ఆటోలకు వెళ్తున్నాం. మనిషికి రూ.150 ఖర్చు అవుతోంది. తాగు నీటి కోసం గోదావరినదికి వెళ్తున్నాం. బయటకు వెళ్లిపోదామంటే ప్యాకేజీ అమలు చేయరు. ఇక్కడ ఉందామంటే వసతులు కల్పింటం లేదు. అధికారులు పని ఉన్నప్పుడే గ్రామానికి వస్తున్నారు. కరెంట్‌ కూడా సక్రమంగా ఉండదు. ప్రభుత్వం పట్టించుకోవటంలేదు.               – బేలం జోగమ్మ, నిర్వాసితురాలు, శివగిరి,

ఎన్నో బాధలు పడుతున్నాం
ముంపు గ్రామాల్లో ఉంటూ ఎన్నో బాధలు పడుతున్నాం. రోడ్డు బాగాలేదు. బస్సు సక్రమంగా తిరగడంలేదు. ఆటోలపై ఆధారపడుతున్నాం. ఎవరికైనా సుస్తీ చేస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు పడే ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. అధికారులు, ప్రభుత్వం కూడా పట్టించుకోవటంలేదు.
– ముచ్చిక కృష్ణ, నిర్వాసితుడు, సరుగుడు, పోలవరం మండలం

 పునరావాసం గురించి తెలీదు
ఇక్కడ ఉందామంటే వసతులు లేవు. బయటకు వెళ్లిపోదామంటే ప్యాకేజీ ఇవ్వటంలేదు. ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఎప్పుడు పంపుతారో అధికారులకూ తెలీదు. అయినా ఇక్కడ ఉన్నంతకాలం కూడా వసతులు కల్పించటంలేదు. రోడ్డుతోపాటు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదు.
– చింతలాడ సోమిరెడ్డి, నిర్వాసితుడు, తూటిగుంట, పోలవరం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top