తిరిగొచ్చిన హాస్టల్ విద్యార్థినులు | Sakshi
Sakshi News home page

తిరిగొచ్చిన హాస్టల్ విద్యార్థినులు

Published Mon, Nov 24 2014 12:27 AM

తిరిగొచ్చిన హాస్టల్ విద్యార్థినులు

 జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం నుంచి అదృశ్యమైన విద్యార్థులు ఆదివారం క్షేమంగా తిరిగొచ్చారు. వారిని రాజమండ్రి పోలీసులు తీసుకువచ్చి జంగారెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారు. ఈ నెల 21న కొండా గౌతమి, బి.ప్రేమలతలు కళాశాలకు అని చెప్పి బయలుదేరి అదృశ్యం కావడంతో వార్డెన్ స్వర్ణలత జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై పోలీసు అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థినులు తిరిగొచ్చారనే విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
 అనంతరం డీడీ శోభారాణి విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థినులు ఈ నెల 21న వసతిగృహం నుంచి కళాశాలకు వెళ్లి అదృశ్యమయ్యారన్నారు. ఆన్‌లైన్ స్కాలర్‌షిప్‌ల కోసం బ్యాంకు ఖాతాలు ఓపెన్‌చేయడానికి వెళ్లినట్టుగా విద్యార్థినులు చెబుతున్నారన్నారు. అయితే వసతిగృహం నుంచి బయలుదేరి కళాశాలకు హాజరుకాకుండా బ్యాంకుకు వెళ్లారని, కళాశాలకు హాజరుకాకపోవడంతో అధ్యాపకులు ఏమైనా అంటారేమోనని భయపడ్డామని తెలిపారన్నారు. అలాగే ఇదే విషయాన్ని తమ తల్లితండ్రులకు వార్డెన్ తెలియజేస్తానన్నారని, వారికి తెలిస్తే ఏమైనా అంటారేమోనన్న భయంతోనే తాము బయటకు వెళ్లిపోయామని విద్యార్థినులు చెబుతున్నారన్నారు. ఏసు అనే ఆటోడ్రైవర్ సహాయంతో ఆటోలో రాజమండ్రికి, అక్కడ నుంచి రైల్లో విజయవాడ, హైదరాబాద్ వెళ్లినట్టు పేర్కొంటున్నారన్నారు.
 
 హైదరాబాద్‌లో విద్యార్థులు దిగగానే వారి వారి తల్లితండ్రులతో ఫోన్లో మాట్లాడామని, భయంతోనే హైదరాబాద్ వెళ్లామని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నామని తల్లితండ్రులతో చెప్పామని వారు చెప్పారని ఆమె తెలిపారు. తిరిగి విద్యార్థులు రాజమండ్రి రైల్లో వచ్చి, పోలీసుల సహాయంతో జంగారెడ్డిగూడెం చేరుకున్నారు. అలాగే ఈ విద్యార్థులను చైల్డ్‌ప్రొటెక్షన్ వారికి అప్పగించనున్నట్లు చెప్పారు. వారు అక్కడ విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ ఏసు వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు ఉన్నారని విచారణలో తేలిందని తెలిపారు. విద్యార్థినులు ఆటో ఎక్కడం, దిగడం వల్లే ఏసుతో పరిచయం ఏర్పడి ఉండి ఉంటుందని ఆమె అన్నారు. అయితే ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఆమె తెలిపారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement